గమనిక: ఈ ఆర్టికల్‌ను చదవడానికి టైము లేని వారు దీని వీడియో రూపాన్ని యీ కింది లింకులో చూడవచ్చు. తెలుగు అర్థం చేసుకోగలిగి, చదవడం రాని వారితో షేర్ చేసుకోవచ్చు కూడా! https://www.youtube.com/watch?v=txzwxPuEGyE
అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలలో ట్రంప్ ఓడినా ట్రంపిజం నెగ్గింది. దానికి తగిన వారసుణ్ని నేనే అంటూ జెడి వాన్స్ చెప్పుకుంటున్నాడు. మాగా కాంప్ యింకా బలంగా వుంది కాబట్టి ఆ ఫిలాసఫీని అమలు చేయగల సత్తా నాకే వుంది అన్నట్లు ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. ట్రంప్‌కు సహచరుడిగా వుంటూన్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాలలో అతనికి ప్రమేయం వున్నట్లేగా! ప్రభుత్వ వైఫల్యాలకు అతనూ బాధ్యుడేగా! కానీ అతను తెలివిగా వాటికి దూరంగా జరుగుతున్నాడు. ట్రంప్ కంటె తను భిన్నం అని చూపుకుంటూ, వచ్చే అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ సిఫార్సు చేసే అభ్యర్థిని కాకుండా తననే పార్టీ ఎంపిక చేస్తుందని ఆశ పడుతున్నాడు. అలా జరిగే ఛాన్సుందా లేదా అన్నది వేరే విషయం. ప్రస్తుతానికి తనను ట్రంప్ పాలనకు డిస్టెన్స్ చేసుకోగలడా? అన్నదే ప్రశ్న. ఇరాన్ యుద్ధాన్ని వ్యతిరేకించడం, ఇజ్రాయేలుతో అంటకాగక పోవడం అతని దగ్గరున్న ట్రంప్ కార్డులు. ట్రంప్ అంటే డోనాల్డ్ ట్రంప్ కాదు, పేకాటలో ట్రంప్. అది ట్రంప్ ఎలా అయిందో వివరిస్తాను.
ఎన్నికలలో ప్రధాన అంశమేమిటి?
అదుపు లేని ధరల పెరుగుదల. ముఖ్యంగా పెట్రోలు! టారిఫ్స్ కారణంగా కూడా ధరలు పెరిగాయి. – దాని గురించి తర్వాత చెప్తా. – కానీ ఫోకస్ అంతా పెట్రోలు మీదే పడింది. ఫిబ్రవరి నుంచి సగటున 46 శాతం పెట్రోలు ధర పెరిగింది. కాలిఫోర్నియా, వాషింగ్టన్, హవాయీ లాటి రాష్ర్టాలలో 70శాతం పెరిగింది. ద్రవ్యోల్బణ మనేది స్థానిక సమస్యే కానీ దాన్ని అంతర్జాతీయ పరిణామాలతో ముడి పెట్టాడు, సామాన్య ఓటరు! ధర పెరగడానికి కారణం ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడిన పెట్రోలు కొరత అనుకున్నాడు. నిజానికి అమెరికాలో వాడేది షేల్ ఆయిల్ లేదా టైట్ ఆయిల్. అది రాళ్లలో వుంటుంది. దాన్ని హారిజాంటల్ డ్రిల్లింగ్‌తో బయటకు తీసి రిఫైన్ చేస్తారు. ఇరాన్ కానీ గల్ఫ్ కానీ ప్రొడ్యూస్ చేసే ఆయిలు బావుల్లో దొరుకుతుంది. దాన్ని రిగ్గుల ద్వారా బయటకు తీస్తారు.
ఏ రకమైన ఆయిలైతేనేం, ‘ఇరాన్ నుంచి దిగుమతి చేసుకునే పెట్రోలు ధర యుద్ధకారణంగా పెరిగింది’ అని అమెరికన్ ప్రభుత్వం అనలేదు. ఎందుకంటే ఇరాన్ నుంచి అమెరికా దిగుమతి చేసుకోనే చేసుకోదు. 60శాతం స్థానికంగానే తయారవుతుంది. 40శాతం దిగుమతి చేసుకుంటుంది. దానిలో కెనడా, మెక్సికో వాటా పెద్దది. గల్ఫ్ నుంచి ఒకప్పుడు, అనగా పుష్కరం క్రితం 25శాతం దిగుమతి చేసుకునేది కానీ ప్రస్తుతం 8శాతం మాత్రమే చేసుకుంటోంది. మరి అలాటప్పుడు గల్ఫ్‌లో యుద్ధం అమెరికా పెట్రోలు ధరపై ఎలా ప్రభావం చూపించ గలదు? …చూపకపోయినా ఆ పేరు చెప్పి ప్రయివేటు కంపెనీలు ధరలు పెంచేశాయి. పెట్రోలు వ్యాపారం మొత్తం – ఉత్పత్తి నుంచి అమ్మకాల దాకా – ప్రయివేటు హస్తాల్లోనే వుంది. హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ఇంటర్నేషనల్ బారెల్ ధరలు పెరిగాయి కాబట్టి, మేమూ యిక్కడ పెంచేస్తాం అన్నారు. ట్రంప్ సరేనన్నాడు. ప్రజలడిగితే ‘ఇరాన్ యుద్ధం నడుస్తోందిగా, దాని వలన ధర పెంచాల్సి వస్తోంది’ అని సాకు చెప్తున్నాడు. అది పట్టుకుని ప్రజలు ఇరాన్ యుద్ధమే తమ కొంప ముంచింది అనే కన్క్లూజన్కి వచ్చారు.
ఇక నెక్స్ట్ క్వశ్చన్? – యుద్ధమెందుకు వచ్చింది?
‘ఇజ్రాయేలు కారణంగానే! మనం ఎప్పటికీ గెలవలేని యుద్ధంలోకి ఇజ్రాయేలు మనల్ని దింపింది. దాని చిరకాల శత్రువులను దుంపనాశనం చేయడానికి మనల్ని వాడుకుంది. మంటల్లో కాలుతున్న జీడి పిక్కల్ని మన చేత్తో తీయించబోయింది. జీడి పిక్కలు బయటకు వస్తే జీడిపప్పు యిద్దరం కలిసి పంచుకుందాం అంది. ట్రంప్ అతి తెలివితక్కువగా తలూపాడు. మనకు చేతులూ, ఒళ్లూ కాలాయి. ఫ్రెండు కోసం ఆ మాత్రం కాల్చుకున్నా ఫర్వాలేదులే అనుకుందామంటే అది మన మాట వినదు. మహా దూకుడు మీద వుంటుంది. కొన్నాళ్లయినా యుద్ధం ఆపమంటే ఆపదు. ఏదో ఒక దుడుకు పని తెచ్చి మన నెత్తి మీదకు తెస్తోంది.’ అనుకున్నాడు అమెరికన్ పౌరుడు.
ఈ అభిప్రాయం బలంగా ఏర్పరచిన వాళ్లెవరు?
రాజకీయ పార్టీలు తమ వంతు కృషి తాము చేశాయి. 4 కోట్ల డాలర్లు ఖర్చయిన ఎన్నికల ప్రచారంలో సగం యాడ్స్ దీని చుట్టూనే రూపొందించ బడ్డాయి. 65 యునీక్ యాడ్స్ ఇరాన్ యుద్ధానికి, కాస్ట్ ఆఫ్ లివింగ్‌కి ముడి పెట్టాయి. ఐయోవా రాష్ట్రంలో రిపబ్లికన్ అభ్యర్థి ఏష్లీ హిన్సన్కి వ్యతిరేకంగా జరిగిన ప్రచారంలో ఆమె సెనేటు మెంబరుగా యుద్ధం కొనసాగింపుకి 5 సార్లు ఓటేశారని ఆ యాడ్స్ చాటి చెప్పాయి. ‘ఆ విధంగా పెట్రోలు, ఫెర్టిలైజర్ ధరలు పెరగడానికి దోహదపడింది’ అని చేర్చారు. ఆమె ఎన్నికల్లో ఓడిపోయింది.
కేన్జస్లో రిపబ్లికన్ అభ్యర్థి ‘నేను యుద్ధ తీర్మానాన్ని సమర్థించాను కానీ నిజానికి నాకు యుద్ధం యిష్టం లేదు’ అంటూనే ‘డెమోక్రాట్లకు సెనేట్‌లో ఆధిక్యం వస్తే మాత్రం ఇరాన్ అణ్వాయుధం తయారు చేస్తుంది, అప్పుడు పెట్రోలు రేట్లు ఆకాశాన్ని అంటుతాయి.’ అని ప్రజల్ని భయపెట్టాడు. ప్రజలు భయపడలేదు. అతన్ని హేళన చేసి, డెమోక్రాటిక్ అభ్యర్థినే గెలిపించారు. ఆఖరి క్షణంలో ట్రంప్ వచ్చి కాన్వాస్ చేసినా లాభం లేకపోయింది.
ఇక ఇజ్రాయేలు గురించి చెప్తాను –
ఇజ్రాయేలుకి మద్దతిచ్చే విషయంలో డెమోక్రాట్లలో కూడా చీలిక వుంది. ఇజ్రాయేలుకి మద్దతివ్వాల్సిందే అని భావించిన డెమోక్రాట్ సభ్యులూ వున్నారు. మిషిగన్‌లో డెమోక్రాట్ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయీద్ పాలస్తీనా వారిని చంపుతున్నందుకు ఇజ్రాయేలుకి వ్యతిరేకంగా యాడ్స్ రిలీజ్ చేస్తే అది నచ్చని హేలీ స్టీవెన్స్ అనే డెమోక్రాట్ నాయకురాలు తన పార్టీ అభ్యర్థిని కాకుండా రిపబ్లికన్ అభ్యర్థి యైన రోజర్స్‌ను సమర్థించింది. కానీ అతను ఓడిపోయాడు. ట్రంపూ, రిపబ్లికన్ అభ్యర్థులూ ధరలు పెరిగాయని ఒప్పుకుంటూనే, యిది తాత్కాలికమేననీ, యుద్ధం గెలవాలంటే యీ మాత్రం కష్టాన్ని ఓర్చుకోవాలని అన్నారు. యుద్ధం అత్యవసరమని వాదించారు.
అక్టోబరు తొలి వారంలో గేలప్ ప్రచురించిన సర్వే ప్రకారం గ్యాస్, పెట్రోలు ధరలపై యుద్ధ ప్రభావం గురించి 75శాతం మంది అమెరికన్లు ‘ఎక్స్ట్రీమ్లీ వర్రీడ్’! డెమోక్రాట్ సమర్థకులలో 85శాతం మంది, రిపబ్లికన్ ఓటర్లలో 61శాతం మంది యీ కేటగిరీలో వున్నారు. ట్రంప్ విధానాల కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింది అనే వాళ్ల శాతం ఏడాది మొదట్లో 18 వుంటే అక్టోబరు నాటికి 35కి ఎగబాకింది.
ఈ విధంగా తప్పంతా ఇరాన్ యుద్ధం పైకి తోసేశారు కాబట్టి, ఆ యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్ విలనై పోయాడు, వ్యతిరేకించిన జెడి వాన్స్ హీరో అయిపోయాడు. ఇజ్రాయేలుపై అమెరికన్లకు వచ్చిన కోపం ట్రంప్‌కు శాపంగా మారింది. ఎందుకంటే ట్రంప్‌కు అల్లుడి ద్వారా ఇజ్రాయేలు కనక్షన్ వుంది. తక్కిన అధ్యక్షులందరి కంటె ట్రంప్ ఇజ్రాయేలు పక్షపాతిగా వున్నాడు. దాంతో అతన్ని నెటన్యాహూ తోలుబొమ్మలా ఆడించాడనే అభిప్రాయం అమెరికన్లకు కలిగింది. కానీ వాన్స్‌కు ఆ ఇజ్రాయేలు బ్యాగేజి లేదు.
దీంతో రిపబ్లికన్ల ప్రాభవం ముగిసింది అనుకోగలమా?
అలా చెప్పడం కష్టం. ఎందుకంటే డెమోక్రాట్లు కూడా సిద్ధాంత రీత్యా చాలా దిగజారిపోయారు. రిపబ్లికన్ల భావాలే వారిలో చాలామంది కనబడుతున్నాయి. దాంతో వాళ్ల ట్రెడిషినల్ ఓటు బ్యాంకు చెదిరిపోయింది. అందుకే ట్రంప్ రెండో సారి అంత భారీగా గెలిచాడు.
ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే – ట్రంప్ ఓడిపోయాడు కానీ ట్రంపిజం ఓడిపోలేదు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనే
మాగా భావజాలం బలంగా వుంది. రిపబ్లికన్లలోనే కాదు, డెమోక్రాట్లలో కూడా ఆ భావజాలం వ్యాపించి వుంది. శ్వేత జాతి అహంకారం వుంది. తమకు ఉద్యోగాలు రావటం లేదనే అక్కసు వుంది. దానికి కారణం వలసదారులే అనే ఆగ్రహం వుంది. మాగా బ్యాచ్ వాళ్ల పరిస్థితి ఏమిటంటే – చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తారా అంటే దానికి నామోషీ. మంచి ఉద్యోగాల కోసం విదేశీ నిపుణులతో పోటీ పడదామా అంటే దానికి ఒళ్లొంగదు. ప్రతిభ వుండి తక్కువ జీతాలకు పని చేసే భారతీయులు, చైనీయులు దొరుకుతూంటే కంపెనీలు వీళ్లకు హెచ్చు జీతాలు ఎందుకిస్తాయి? కంపెనీలకు ఆ ఛాన్సు యివ్వకూడదని వీళ్ల పట్టుదల. సరేసరే అంటారు కానీ పాలకులు కంపెనీలను కట్టడి చేయరు – నిధులిచ్చేది వాళ్లే కాబట్టి!
ట్రంప్ ఐతే అలా చేయడు, మనకు ఉద్యోగాలు పెరుగుతాయనుకున్నారు మాగా వాళ్లు. ఉద్యోగాల మాట ఎలా వున్నా ధరలు పెరిగాయి. కారణం ఇరాన్ యుద్ధం, ఆ యుద్ధంలో తమను లాగినందుకు ఇజ్రాయేలు అనడంతో ‘ఇది కాదు పద్ధతి’ అని ట్రంప్‌కు బుద్ధి చెప్పారు. దీన్ని వాన్స్ కరక్టుగా పట్టుకున్నాడు. ఫలితాలు రాగానే ఏం చేయాలో నాలుగు అంశాలు చెప్పాడు –
మొదటగా ఇరాన్ యుద్ధం ఆపాలన్నాడు. ఇరాన్ యుద్ధానికి వ్యతిరేకిగా అతనికి మొదట్నుంచి ప్రొజక్షన్ వుంది. చిన్న లోపం ఏమిటంటే – పాకిస్తాన్లో ఇరాన్ ప్రతినిథులతో సరిగ్గా వ్యవహరించ లేదు. కానీ ట్రంప్ ఆదేశాల మేరకే అలా చేశానని చెప్పుకుని తప్పించుకోవచ్చు. యుద్ధం వద్దని ముందే చెప్పాను. విన్నారా? అంటూ సుద్దులు చెప్పడానికి అతనికి అవకాశం వచ్చింది. ఇక రెండోది – అమెరికా ఫస్ట్ అనే విధానాలను అమలు చేయండి అన్నాడు. ఆ నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆచరణలో దాన్ని వదిలేసింది అని ఒప్పేసుకున్నాడు. మాగా అభిమానుల గుండెల్లో వున్న మాటే అతను చెప్పాడు.
ట్రంప్ మొదటి సారి కంటె రెండో సారి గొప్పగా గెలవడానికి కారణం – జో బైడెన్ నిర్వాకం! కానీ రెండో టర్మ్, మొదటి టర్మ్ కన్నా అధ్వాన్నంగా తయారైంది. అతను చేసిన తిక్క పనులతో అంతర్జాతీయంగా అమెరికా ప్రతిష్ఠ పూర్తిగా దెబ్బ తింది. పోనీ అమెరికా ఏమైనా బావుకుందా అంటే అదీ లేదు. అమెరికా ఫస్ట్ సంగతి తక్కిన వాటిల్లో ఎలా వున్నా ఉద్యోగాల విషయంలో మాత్రం అమెరికన్స్ ఫస్ట్ అనే సిద్ధాంతాన్ని అమలు చేయాలని, ఇమ్మిగ్రేషన్ ఆపాలని మాగా వాళ్ల పట్టుదల. ఈ విషయాన్ని హైలైట్ చేయడానికి వాన్స్‌కి అర్హత వుంది. ఎందుకంటే అతనిది డెమోక్రాట్లలా ఓపెన్ డోర్ పాలసీ కాదు. ట్రంప్‌లా క్లోజ్డ్ డోర్ పాలసీనూ కాదు.
అతను ఇమ్మిగ్రేషన్ పట్ల తన వ్యతిరేకతను క్వాలిఫై చేస్తాడు. తన అత్తమామల్లా ప్రతిభ వుండి వచ్చే వారికి స్వాగతం పలుకుదాం. కానీ ఎచ్1బి పేరుతో తక్కువ స్థాయి వాళ్లు వచ్చేసి, తక్కువ జీతాలకు ఒప్పుకుని స్థానికుల ఉద్యోగాలు కాజేయడాన్ని మాత్రం వ్యతిరేకిద్దాం అంటాడు. ఇలా వడపోసే ఓపిక ట్రంప్‌కు లేదు. వీసా ఫీజులు విపరీతంగా పెంచేద్దాం. ఎవర్నీ రానీయకుండా చేద్దాం అంటాడు. దానికి అమెరికన్ కంపెనీలు, కోర్టులు ఏవీ ఒప్పుకోవటం లేదు. వాన్స్ ఆర్గ్యుమెంటులో తభావతు లేదు. వలసదారులను తెచ్చే అమెరికన్ కంపెనీలు ‘అబ్బో యితను పెద్ద తోపు. ఇతని లాటి వాడు అమెరికన్లలో దొరకకనే అక్కణ్నుంచి తెప్పించాం.’ అంటూ చెప్తున్నాయి. ‘మరి అంత తోపుకి యింత జీతం మాత్రమే యిస్తున్నావేం?’ అని అడిగితే మాత్రం సమాధానం లేదు. ‘మీ లాభాల కోసం చౌక లేబరును దిగుమతి చేసుకుని స్థానికులకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నార’ని అంటే వాళ్లు కాదనగలరా? వాన్స్ యీ పాయింటు మాగా వాళ్లకు బాగా నచ్చుతుంది.
ఇక మూడోది ‘ధరల పెరుగుదలను అరికట్టాలి’ అన్నాడు. అంటే యిప్పటిదాకా అరికట్టలేదని ఒప్పుకున్నట్లేగా. అది అధ్యక్షుడి బాధ్యత తప్ప, తనది కాదని అనగలడా? అయినా ట్రంప్ మీద తోసేస్తున్నాడు. ‘‘భలే కోడళ్లు’’ సినిమాలో ఓ సీనుంది. ముగ్గురు అన్నదమ్ముల గురించి ఓ పుకారు పుడుతుంది. దానికి ఎవరు బాధ్యులో చర్చించడానికి ముగ్గురూ కూర్చుంటారు. చలం ‘‘మన ముగ్గురిలో ఎవరో ఒకరు చేసి వుంటారు. మీ యిద్దరిలో ఎవరు?’’ అని అన్నలను అడుగుతాడు. అంటే ఓపెనింగ్‌లోనే తనకు తాను క్లీన్ చిట్ యిచ్చేసుకున్నాడన్నమాట. అలా వుంది వాన్స్ వ్యవహారం.
నిజానికి ధరలు పెరగడానికి ట్రంప్ విధించిన టారిఫ్‌లు కూడా ప్రధాన కారణం. జీవనవ్యయం ఏడాదికి 1700 డాలర్ల నుంచి 2500 డాలర్లకు పెరిగింది. ఎన్నికల ప్రచారంలో దానిపై కూడా చర్చ జరిగింది. ట్రంప్, రిపబ్లికన్ అభ్యర్థులలో కొంతమంది వాటి వలన అమెరికాకు మాన్యుఫేక్చరింగు తిరిగి వస్తోందని, దాని కారణంగా ఉద్యోగాలు వస్తాయనీ, బయటి దేశాల్లో మార్కెట్లు విస్తరిస్తాయనీ వాదించారు. కొంతమంది రిపబ్లికన్లు మాత్రం వాటి గురించి అటుగానీ, యిటుగానీ మాట్లాడకుండా సైలెంటుగా వున్నారు. వాస్తవం ఏమిటంటే ఇర్రేషనల్ టారిఫ్‌ల కారణంగా యితర దేశాలు కూడా అమెరికాతో తమ టారిఫ్‌లు పెంచాయి. దానివలన ఎలక్ట్రానిక్స్, ఆటో విడిభాగాలు, టమాటో, కాఫీ వంటి ఆహార పదార్థాల రేట్లు పెరిగాయి. టారిఫ్‌లను సమర్థించిన వారిలో వాన్స్ కూడా ఉన్నాడు. ధరల పెరుగుదలకు అతనూ బాధ్యుడే.
నాల్గోదానిగా, ‘మన ఇజ్రాయేలు విధానాలను మార్చాలి’ అన్నాడు. ఇదీ అమెరికన్ సాధారణ పౌరుడు హర్షధ్వానాలు చేసే స్టేటుమెంటే. ఇజ్రాయేలు తన స్వార్థం కోసం అమెరికాను ముక్కు పట్టుకుని ఆడిస్తోందని ప్రపంచమంతా గుర్తించడంతో అమెరికన్లకు రోషం వచ్చింది. అంత చిన్న దేశం మమ్మల్ని ఆడించడమేమిటని. ఇజ్రాయేలుతో సమీకరణం మారాలని కోరుకుంటున్నారు. దానికి వాన్స్ వాయిస్ యిచ్చాడు.
ట్రంప్‌కు భిన్నంగా తన యిమేజిని ప్రొజెక్ట్ చేసుకోవడం వలన వచ్చే అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడే అవకాశాలు అతనికి పెరిగాయి. కానీ ట్రంప్ అతన్ని ఎండార్స్ చేస్తాడా? చేయకపోవచ్చు. తన విధానాలు తప్పని అనేవాణ్ని తన వారసుడిగా ఎందుకు రానిస్తాడు? ఇప్పటికీ పార్టీలో అతని బాటలో నడిచే వాళ్లు ఉన్నారుగా! పార్టీపై అతని పట్టు యింకా దృఢంగానే వుంది. అయినా ట్రంప్ బిజినెస్ లింకులు, అల్లుడి ఇజ్రాయేలు కనక్షన్ యివన్నీ ట్రంప్ నిలబెట్టే ఏ కాండిడేట్ కైనా గుదిబండలే. వాన్స్ కి ఆ బాదరబందీ లేదు. అసలతని నేపథ్యమే వేరు.
ట్రంప్ ధనిక కుటుంబం నుంచి వస్తే వాన్స్ పేద కుటుంబం నుంచి వచ్చాడు. కష్టపడి చదువుకున్నాడు. సైన్యంలో పని చేశాడు. మేధావిగా పేరుబడ్డాడు. ట్రంప్‌లా అనేక పెళ్లిళ్లు చేసుకోలేదు. ప్రొటెస్టంటుగా పుట్టి, కొన్నాళ్లు నాస్తికుడుగా వుండి, యిప్పుడు రోమన్ కాథలిక్ అయిపోయాడు. హిందువైన తన భార్య కూడా ఎప్పటికో అప్పటికి ఏసు ప్రభువు వైపు మళ్లుతుందని అన్నాడు. అబార్షన్ వగైరాలు వ్యతిరేకిస్తాడు. ఇవన్నీ రిపబ్లికన్లకే కాక కన్సర్వేటివ్లందరికీ నచ్చే మాటలే. ట్రంప్‌లా వదరుబోతు కాదు, మాటలు ఆచితూచి వాడతాడు. జెలెన్స్కీతో రూడ్‌గా ప్రవర్తించినా, వ్యూహం ప్రకారం అలా చేశాడని అనుకోవచ్చు. ట్రంప్ అహంభావం బయటకు కనబడుతుంది. కెనడాను అమెరికాలో కలిపేస్తానని, గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటానని అనడం చూస్తే పాలకుడా? విదూషకుడా? అనిపిస్తుంది. కానీ వాన్స్ అలాటి వాచాలత ప్రదర్శించడు. ట్రంప్ సమర్థించే ఏ అభ్యర్థియైనా ట్రంప్ నీడ లోంచి బయటపడడం కష్టం. ట్రంప్ యిమేజి భారం మోయాల్సి వస్తుంది. వాన్స్ ప్రస్తుతం యిచ్చిన స్టేటుమెంట్ల ద్వారా ఆ భారం నుంచి తప్పించుకున్నాడు. అలా ఎన్నికల వలన ట్రంప్ ఓడితే, వాన్స్ గెలిచాడు. ట్రంప్ యితన్ని ఎలా కట్టడి చేయబోతాడో వేచి చూడాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్

అమెరికా గల్ఫ్ దేశాల నుంచి చమురు దిగుమతులు తక్కువగా ఉన్నప్పటికీ పెట్రోల్ ధరలు పెరగడానికి కారణాలు:
అందువల్ల ఇరాన్ యుద్ధం అమెరికాకు ప్రత్యక్షంగా గల్ఫ్ చమురు దిగుమతులు తగ్గించినా, ప్రపంచ మార్కెట్ ధరలు, సరఫరా భయాలు, కెనడా వంటి సరఫరాదారుల ధరలు, మార్కెట్ ఆధారిత వ్యవస్థ ద్వారా అమెరికాలో పెట్రోల్ ధరలను ప్రభావితం చేసింది.
వాన్స్ ఇరాన్ పై యుద్ధం చేయడం తప్పే అనేమాట ఎలక్షన్లలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు చిత్తుగా ఓడాక చెప్పిన మాట. ఈ ముక్క ఎలక్షన్ల ముందు ఎందుకు చెప్పలేదు అనేది మెజారిటీ అమెరికన్ల ప్రశ్న. అతన్ని అవకాశవాదిగా చూస్తున్నారు తప్ప వెన్నుముకగల నాయకుడిగా, భావి అధ్యక్షునిగా ఎవరూ అనుకుంటున్నట్లు కనిపించడం లేదు.
I find that YouTube videos often feel like radio programs, similar to bedtime stories. Could you record a close-up video where you speak directly to the camera, as if you were interacting with the viewers?
గతంలో శాటిలైట్ రేడియోలో మాట్లాడేవాణ్ని. హాయిగా వుండేది. ఇప్పుడు యూట్యూబు కాబట్టి తప్పక కెమెరా ముందుకు వచ్చాను. ఇది సేఫ్ డిస్టన్స్. ఇంతకంటె క్లోజ్ అప్ భరించడం కష్టం. నేనేమీ స్టార్‌ని కాను కదా. కొంతమంది యాంకర్‌తో మాట్లాడుతూ సైడు పోజులో మాట్లాడతారు. నేను డైరక్టుగా కెమెరాలోకే చూస్తున్నానుగా. రేడియో టాక్లా వుండకుండా విజువల్స్ ఎక్కువ పెట్టమని అడిగాను. పెడుతున్నారు.
You’re a star writer, I’m sure you’ll become YouTube star as well. Thinkers like Prof.Nageswara Rao and you are needed for Telugu society. Professor doesn’t even put the visuals unless he talks about that data. Please try few videos, if you’re comfortable. Thanks to GreatAndhra for this inactive.
మీరు ా నాపై అభిమానంతో అంటున్నారు కానీ వాస్తవం చెప్పుకోవాలంటే యూట్యూబులో శతకోటి లింగాల్లో నేనో బోడిలింగాన్ని. నా కంటూ మార్కెట్ ఏర్పడిందో లేదో తెలుసుకోవడానికి 6 నెలలు టైము పడుతుంది. చాలామంది వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రయిబ్ చేయరు. వెయ్యి మంది సబ్‌స్క్రయిబర్స్ వుంటే తప్ప గూగుల్ డబ్బులు పే చేయడం ప్రారంభించదు. ఇలా వెయ్యి గొడవలున్నాయి. నేను క్లిక్ అవుతానో లేదో ఎవరూ చెప్పలేరు. ప్రయత్నం చేస్తున్నానంతే. ఇప్పటికే చాలా మంది యీ ఫీల్డులో స్టార్లు వున్నారు. నేను చాలా లేటుగా వస్తున్నాను. ఎనీవే థాంక్స్ ఫర్ యువర్ గుడ్‌విషెస్
Many of them catering to one sided sections. So the space is always there for your independent mind. Please keep doing them frequently whether related article written or not. During big events like elections, subscribers will be growing. While writing this got an idea, how about talking on great literature, bring other authors for a discussion on their work or famous authors work.
For GreatAndhra team, one suggestion. Instead of specifying the video hyperlink, please embed the video like how you do it for movie trailers, songs etc.
There’s no doubt that it will take many years for Republicans to reocver. MAGA is seen as a bad word now, unless you watched fox news. Thats why many traditionally Republican states turned Democrat now including Texas
కుర్ర కారుతో పోటీ గ కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం మంచి విషయం. ఈ వయసులో మీ అభిరుచి, జిజ్ఞాస ఇతరులకు కూడా ప్రోత్సాహం. ముందు గ్రేట్ ఆంధ్ర ఎందుకండీ ? మీకంటూ ఒక మంచి గుర్తింపు వుంది కదా. మీ విశ్లేషణాత్మకతో మిగతా వాళ్ళకి గట్టి పోటీ ఇస్తారని ఆశిద్దాం.
కుర్రకారుతో పోటీ పడి.. అనే మాట కొట్టేయండి. అన్ని వయసుల వాళ్లూ యూట్యుూబు వీడియోలు చేస్తున్నారు. ఏడాదిన్నర కితమే ప్రారంభించమని నాపై గట్టి ఒత్తిడి వచ్చింది. నాకు యిష్టం లేక ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు చదివే వారు మరింత తగ్గిపోవడంతో, ఏం చెప్పాలన్నా యూట్యూబు ద్వారా చెప్పవలసిన అగత్యం ఏర్పడడంతో దిగాను. నేను తెలుసుకున్నది యితరులకు చెప్పాలన్న తపనే నన్ను దింపింది. 6 నెలలు చేస్తే ఫలితం ఏమిటో తెలుస్తుందంటున్నారు. రెస్పాన్సు లేకపోతే మానేసి, హాయిగా పుస్తకాలు చదువుకుంటూ కాలక్షేపం చేసేస్తాను.
గ్రేట్ ఆంధ్ర అమర్చిన వేదిక. నా పేరు బాగా తెలిసిన వాళ్లు యిక్కడున్నారు. నాకంటూ నేనే వేరే ఛానెల్ పెట్టుకోవడం శ్రమతో కూడుకున్న పని. పైగా కంటెంటుపై పెట్టాల్సిన టైము టెక్నికల్ విషయాలపై వెచ్చించడం తెలివితక్కువ పని కదా!
మన దేశానికీ రష్యా నుండి చవకగా క్రూడ్ ఆయిల్ వస్తుంటే మనకెందుకుఅధిక ధరలు మరి అలాంటివి రాయండి G లో D ఉంటె
క్రింద చెప్పినట్టు , క్రూడ్ ప్రైస్ ని నిర్దేశించేది ఇంటర్నేషనల్ మార్కెట్ . ప్రపంచం లో ఏ మూలదిగుబడి తగ్గినా , లేక యుద్ధాల వల్ల అవసరం పెరిగిన మార్కెట్స్ లో వడిదుడుకులు తప్పవు.
కానీ యుద్ధ సమయం లో ట్రంప్ ఊగిసలాట ట్వీట్స్ వల్ల మార్కెట్ చాల ఎగుడు దిగుడు ఎదుర్కొంది. ట్రంప్ అనుయూయులు, ఈ ట్వీట్స్ గురించి తెలిసి చాల లాభ పడినట్టు వార్తలు వచ్చాయి. అటువంటి డి ఇండియా లో జరిగితే చాల తీవ్ర పరిణామాలు ఉండేవి.