చేతులు కట్టుకున్నాం… బీజేపీలో అసంతృప్తి పీక్స్

విశాఖ మేయర్ పదవికి ఆశపడి ఎన్నో ప్రయత్నాలు చేసిన బీజేపీకి ఆఖరుకు డిప్యూటీ మేయర్ పదవి కూడా దక్కలేదు.

విశాఖ మేయర్ పదవికి ఆశపడి ఎన్నో ప్రయత్నాలు చేసిన బీజేపీకి ఆఖరుకు డిప్యూటీ మేయర్ పదవి కూడా దక్కలేదు. దాంతో తీవ్ర అసంతృప్తితో ఆ పార్టీ ఉంది. సోమవారం జరిగిన జీవీఎంసీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బీజేపీ నేతలు అదే తీరున కనిపించారు. తమ అసంతృప్తిని వారు వ్యక్తం చేశారు.

ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అయితే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. మేయర్ ఇవ్వలేదని డిప్యూటీ మేయర్ అయినా ఇస్తారని ఎదురు చూసామని చివరికి అది కూడా దక్కలేదని బాధ పడ్డారు.

విశాఖలో తమ పార్టీకి డిప్యూటీ మేయర్ అయినా ఇవ్వకపోవడం అసంతృప్తిని మిగిల్చింది అని రాజు గారు వ్యాఖ్యానించారు. అసలు 120 వార్డులలో తాము కోరిన మేరకు కార్పోరేటర్ సీట్లు కూడా ఇవ్వలేదని ఆయన చెప్పారు. అయినా సరే తాము కూటమి ధర్మం కోసం చేతులు కట్టుకుని కూర్చుండిపోయాయమని కామెంట్స్ చేశారు.

ప్రతీ సారి కూటమి ధర్మం కోసం సర్దుకొని పోవడం తప్పనిసరిగా మారింది అన్న రాజు గారి మాటలు ఆయన ఒక్కరివే కాదు, వెనక కాషాయ దళంలోని నాయకులు క్యాడర్ కూడా ఇదే భావనతో ఉంది అని అంటున్నారు.

విశాఖ వంటి బీజేపీకి రాజకీయంగా పట్టున్న చోట డిప్యూటీ మేయర్ చాన్స్ రాకపోవడంపైన బీజేపీలో అసంతృప్తి పీక్స్ కి చేరుకుంది. ఆ పార్టీ ఈ విషయంలో కూటమి పెద్దలతో సంప్రదింపులు చేసినా ఫలితం దక్కలేదు. జనసేనకు ఈ పదవిని కేటాయించారు. దాంతో కేవలం ఎనిమిది మంది కార్పోరేటర్ల అతి చిన్న పక్షంగా బీజేపీ జీవీఎంసీలో మిగిలిపోవాల్సి వచ్చింది.

జీవీఎంసీలో వైసీపీ సొంతంగా పోటీ చేసి 13 మందితో టీడీపీ జనసేన తరువాత స్థానంలో ఉంది. బీజేపీ అటు మిత్రపక్షంగా ఉన్నా తమకు దక్కాల్సిన స్థాయిలో అవకాశాలు లభించలేదని ఆవేదన చెందుతోంది. ఒకనాడు విశాఖ మేయర్ గా గెలిచి నగరాన్ని పాలించిన బీజేపీ ఈ రోజు కొద్ది సీట్లకే పరిమితం అయి సర్దుకుపోవడం పైన చర్చ సాగుతోంది.

పొత్తు పెట్టుకున్నా తమకు ఇంతకంటే ఎదిగే చాన్స్ లేదా అన్నదే ఆ పార్టీ నేతలలో ఉన్న బాధ. అయితే టీడీపీ వ్యూహాత్మకంగానే జనసేనకు అవకాశాలు ఇస్తోంది. బీజేపీకి బలం లేదని భావిస్తోందా అన్నది కూడా కాషాయం నేతలను వేధిస్తున్న మరో ఆవేదనగా ఉంది.

3 Replies to “చేతులు కట్టుకున్నాం… బీజేపీలో అసంతృప్తి పీక్స్”

Comments are closed.