పిఠాపురంలో ప‌వ‌న్ ఆదేశాల్ని లెక్క చేయ‌ని కౌన్సిల‌ర్లు

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్వ‌యంగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పిఠాపురంలో ఆయ‌న ఆదేశాల్ని మ‌రోసారి సొంత పార్టీ నాయ‌కులే లెక్క చేయ‌లేదు.

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్వ‌యంగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పిఠాపురంలో ఆయ‌న ఆదేశాల్ని మ‌రోసారి సొంత పార్టీ నాయ‌కులే లెక్క చేయ‌లేదు.

ఇటీవ‌ల పిఠాపురం రూర‌ల్ ఎంపీపీ ఎన్నిక విష‌యంలో ఎంపీటీసీలు అధిష్టానం నిర్ణ‌యాన్ని ధిక్క‌రించి ప‌వ‌న్‌కు షాక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అదే ధిక్క‌ర‌ణ మ‌రోసారి పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్మ‌న్ ఎన్నిక విష‌యంలో పున‌రావృత‌మైంది.

ఇవాళ పిఠాపురం మున్సిపాలిటీలో వైస్ చైర్మ‌న్ ఎన్నిక‌కు ముహూర్తం పెట్టారు. మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్‌గా బొజ్జ వెంక‌టేశ్వ‌ర‌రావు పేరును అధిష్టానం ప్ర‌క‌టించింది.

ఇవాళ వెంక‌టేశ్వ‌ర‌రావును ఏక‌గ్రీవంగా ఎన్నుకోవాల్సి వుండింది. అయితే అనూహ్యంగా జ‌న‌సేన మెజార్టీ కౌన్సిల‌ర్లు అధిష్టానం నిర్ణ‌యించిన వెంక‌టేశ్వ‌ర‌రావును వ్య‌తిరేకించి, షాక్ ఇచ్చారు.

పిఠాపురం మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులున్నాయి. ఇందులో జ‌న‌సేన‌కు 19 మంది, టీడీపీకి ఐదుగురు, బీజేపీకి ఒక‌రు చొప్పున కూట‌మి బ‌లం 25. జ‌న‌సేన అధిష్టానం నిర్ణ‌యించిన వెంక‌టేశ్వ‌ర‌రావు అభ్య‌ర్థిత్వాన్ని ఏక‌గ్రీవంగా ఆమోదించ‌డానికి బ‌దులు, ఎదురు తిరిగారు.

జ‌న‌సేన మెజార్టీ కౌన్సిల‌ర్లంతా సంధ్య‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. ఆమెనే వైస్ చైర్మ‌న్‌గా ఎన్నుకుంటామ‌ని తేల్చి చెప్పారు. దీంతో మున్సిప‌ల్ కౌన్సిల్ స‌మావేశంలో ఒక్క‌సారిగా ర‌గ‌డ మొద‌లైంది.

త‌న‌ను ప‌వ‌న్ ఎంపిక చేశారంటూ వెంక‌టేశ్వ‌ర‌రావు గ‌ట్టిగా వాదించారు. ఆయన్ను వ్య‌తిరేకించే వాళ్లు కూడా త‌మ సీట్లలో నుంచి లేచారు. దీంతో ర‌గ‌డ పెద్ద‌ద‌వుతుంద‌ని భావించిన పోలీసులు, స‌మావేశం మ‌ధ్య‌లోకి వెళ్లి స‌ర్దుబాటు చేశారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీలో చేరిన వెంక‌టేశ్వ‌ర‌రావుకు వైస్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వ‌డాన్ని మెజార్టీ కౌన్సిల‌ర్లు వ్య‌తిరేకించారు. పార్టీలో మొద‌టి నుంచి వుంటున్న సంధ్య‌కే ప‌ద‌వి ఇవ్వాల‌నేది వారి డిమాండ్. దీనంత‌టికి కార‌ణం అని భావించి కాకినాడ ఎంపీ ఉద‌య్ శ్రీ‌నివాస్ పీఏ చ‌క్రిపై జ‌న‌సేన నేత‌లు, కౌన్సిల‌ర్లు దాడి చేశారు.

పార్టీని నాశ‌నం చేస్తున్నారంటూ ఎంపీ ఉద‌య్ శ్రీ‌నివాస్ పీఏ చ‌క్రిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కున‌డంతో ఎంపీ పీఏ అక్క‌డి నుంచి కారులో ప‌రార‌య్యారు.

పార్టీని కాపాడాల‌ని, మొద‌టి నుంచి సేవ‌లందిస్తున్న సంధ్య‌కే వైస్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ఎదుట జ‌న‌సేన కౌన్సిల‌ర్లు, నేత‌లు ధ‌ర్నాకు దిగారు. ఇప్ప‌టికైనా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏం జ‌రుగుతున్న‌దో తెలుసుకోవాల‌ని వారంతా ముక్త కంఠంతో నిన‌దించారు.