అనిల్ రావిపూడి… ఒక సక్సెస్ స్టడీ!

తెలుగు సినిమాకు హీరోలు అవసరం… హిట్లు అవసరం… కానీ ఆ హిట్ల మధ్య ప్రేక్షకులకు నవ్వుల పండగ అందించే మీలాంటి దర్శకులు కూడా చాలా చాలా అవసరం!

గత కొన్నేళ్లుగా సంక్రాంతి పండగ అంటే..నాలుగు కాదు…ఐదు పండగల సమాహారం!
భోగి..
మకర సంక్రాంతి..
కనుమ..
ముక్కనుమ…
అనీల్ రావిపూడి సినిమ!!

ఎస్..అనీల్ రావిపూడి సంక్రాంతి సినిమా తీస్తే… థియేటర్లలో నవ్వులు పూస్తాయి, ఫ్యామిలీస్ థియేటర్లకు క్యూ కడతాయి, అభిమానులు పండగ చేసుకుంటారు, బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తుంది!

తెలుగు సినిమా చరిత్రలో స్టార్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. అద్భుతమైన విజన్ ఉన్న దర్శకులు ఉన్నారు. భారీ సినిమాలు తీసే దర్శకులు ఉన్నారు. ప్రయోగాలు చేసే దర్శకులు ఉన్నారు.

కానీ… ప్రేక్షకుడిని రెండున్నర గంటల పాటు నవ్వించాలి, ఎంటర్టైన్ చేయాలి, చివరికి థియేటర్ నుంచి ఒక మంచి అనుభూతితో ఇంటికి పంపించాలి… ఈ కళను ఒక సక్సెస్‌ఫుల్ ఫార్ములాగా మార్చుకున్న దర్శకులు మాత్రం చాలా తక్కువ!

ఆ జాబితాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న పేరు… అనిల్ రావిపూడి!

అసలు ఆయన గొప్పతనం ఏంటి? వరుస విజయాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే తనదైన మార్క్‌ను ఎలా నిలబెట్టుకున్నారు?

ఆయన పుట్టినరోజు సందర్భంగా… కేవలం హిట్ సినిమాల గురించి కాదు. ఒక దర్శకుడిగా అనిల్ రావిపూడి సాధించిన అసలు విజయాల గురించి మాట్లాడుకుందాం!

అనిల్ రావిపూడి ప్రయాణం… ఒక్క రోజులో మొదలైన సక్సెస్ స్టోరీ కాదు.

సినిమా మీద ఆసక్తి, కథల మీద పట్టుదల, రచన మీద నమ్మకంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.

అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. కథా రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. శంఖం, కందిరీగ, మసాలా, ఆగడు వంటి సినిమాలతో రచనా ప్రయాణంలో అనుభవాన్ని సంపాదించారు.

కానీ ఆయన లక్ష్యం కేవలం ఒక మంచి రైటర్‌గా గుర్తింపు పొందడం కాదు. తన ఆలోచనలను తెరపై ఆవిష్కరించే దర్శకుడిగా ఎదగడం!

ఆ కలకు అవకాశం ఇచ్చింది నందమూరి కల్యాణ్ రామ్.

2015లో వచ్చిన ‘పటాస్’తో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ సినిమా విజయం కేవలం ఒక కొత్త దర్శకుడికి వచ్చిన హిట్ మాత్రమే కాదు… తెలుగు సినిమాకు ఒక కొత్త కమర్షియల్ ఎంటర్టైనర్ మేకర్ పరిచయం కావడం!

అక్కడి నుంచి ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’…

ప్రతి సినిమాతో తన పరిధిని పెంచుకుంటూ వెళ్లారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక్కటే. ఆయన కెరీర్‌లో విజయం అనేది యాదృచ్ఛికంగా వచ్చిన అదృష్టం కాదు. రచన నుంచి దర్శకత్వం వరకు వచ్చిన అనుభవాన్ని ప్రేక్షకుల అభిరుచితో కలిపిన ఫలితం!

అనిల్ రావిపూడి గురించి మాట్లాడితే చాలామంది ముందుగా చెప్పే మాట… కామెడీ!

కానీ, కామెడీ ఆయన ఆయుధం మాత్రమే. ఆయన అసలు బలం మాత్రం ప్రేక్షకుడి పల్స్ పట్టుకోవడం!

ఒక్కసారి ఆలోచించండి.

ఒక ఫ్యామిలీ ప్రేక్షకుడు సినిమాకు ఎందుకు వస్తాడు?

తన ఫ్యామిలీతో కలిసి నవ్వుకోవడానికి వస్తాడు. తనకు తెలిసిన మనుషుల్ని, తన జీవితంలో ఎదురయ్యే సంఘటనల్ని తెరపై చూడటానికి వస్తాడు. హీరోని చూసి ఆనందించడానికి, ఎమోషన్‌ను ఫీల్ అవ్వడానికి వస్తాడు.

ఈ విషయాన్ని అనిల్ చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు.

అందుకే ఆయన సినిమాల్లో కథ ఎంత సింపుల్‌గా ఉన్నా… దాని చుట్టూ అల్లే ఎంటర్టైన్మెంట్ మాత్రం చాలా ముఖ్యమైనది.

‘ఎఫ్-2’లో భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న గొడవల్ని ఒక పెద్ద కామెడీ ఎంటర్టైనర్‌గా మార్చారు.

‘ఎఫ్-3’లో డబ్బు కోసం మనుషులు పడే ఆశను హాస్యంతో చూపించారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’లో ఫ్యామిలీ డ్రామా, క్రైమ్, రిలేషన్షిప్స్, కామెడీని ఒకే కథలో కలిపారు.

ఇక్కడ ఆయన గొప్పతనం ఏమిటంటే… పెద్ద పెద్ద కాన్సెప్టులు చెప్పకుండానే ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే పరిస్థితుల్ని సృష్టించడం.

ప్రేక్షకుడిని నవ్వించడానికి కేవలం పంచ్ డైలాగులు అవసరం లేదు. సరైన క్యారెక్టర్, సరైన సందర్భం, సరైన టైమింగ్ ఉంటే చాలు.

అనిల్ రావిపూడి ఈ విషయాన్ని తన సినిమాలతో పదే పదే నిరూపించారు.

ఇప్పుడు ఆయన దర్శకత్వ ప్రతిభలో మరో ఆసక్తికరమైన కోణం గురించి మాట్లాడుకోవాలి.

అదే… స్టార్ హీరోలను హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం!

మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’ చేశారు.

వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి మల్టీస్టారర్ ఎంటర్టైనర్స్ అందించారు.

బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ వంటి భిన్నమైన సినిమాను తెరకెక్కించారు.

మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను అందించారు.

ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది.

స్టార్ హీరోతో సినిమా చేయడం ఒక విషయం. ఆ హీరోలో ప్రేక్షకులు చూడాలనుకునే ప్రత్యేకతను గుర్తించి, దానికి తగ్గట్టుగా ఒక కొత్త ఎంటర్టైనింగ్ ప్రపంచాన్ని సృష్టించడం మరో విషయం.

మహేష్ బాబులోని కామెడీ టైమింగ్, మాస్ ఇమేజ్‌ను ‘సరిలేరు నీకెవ్వరు’లో ఉపయోగించారు.

బాలకృష్ణలోని పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు ‘భగవంత్ కేసరి’లో ఒక ఎమోషనల్, సోషల్ బ్యాక్‌డ్రాప్‌ను జోడించారు.

చిరంజీవి విషయంలో ఆయన కామెడీ, స్టైల్, స్వాగ్‌లను ప్రేక్షకులు ఆస్వాదించేలా కథను రూపొందించారు.

అంటే హీరో ఎవరో మాత్రమే చూడటం కాదు… ఆ హీరోలో ప్రేక్షకుడు ఏం చూడాలనుకుంటున్నాడో గుర్తించడం ఆయన ప్రత్యేకత!

ఇదే ఒక కమర్షియల్ డైరెక్టర్‌కు ఉండాల్సిన ముఖ్యమైన నైపుణ్యం.

ఒక దర్శకుడు వరుసగా హిట్లు ఇస్తున్నప్పుడు అతనికి ఎదురయ్యే అతిపెద్ద ప్రమాదం ఏంటి?

తనకు వర్కౌట్ అయిన ఫార్ములానే మళ్లీ మళ్లీ ఉపయోగించడం!

కానీ అనిల్ రావిపూడి కెరీర్‌లో ‘భగవంత్ కేసరి’ ఒక కీలకమైన మలుపు.

తనకు కామెడీ, ఎంటర్టైన్మెంట్ బాగా తెలుసు. అయినా తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి, మహిళా సాధికారత, తండ్రీకూతుళ్ల బంధం, సామాజిక బాధ్యత వంటి అంశాలతో ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామాను రూపొందించారు.

ఈ సినిమా ఆయనలోని మరో దర్శకుడిని ప్రేక్షకులకు పరిచయం చేసింది.

అంతేకాదు, 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా గుర్తింపు పొందింది.

ఇది ఒక ముఖ్యమైన విషయం.

ఒక దర్శకుడి విజయాన్ని కేవలం బాక్సాఫీస్ కలెక్షన్లతోనే కొలవలేం. తనకు తెలిసిన జానర్‌లో విజయం సాధిస్తూనే, కొత్త విషయాలను ప్రయత్నించే ధైర్యం కూడా ఉండాలి.

అనిల్ ఈ రెండు కోణాలనూ తన ప్రయాణంలో చూపించారు.

ఇప్పుడు అసలు రికార్డుల విషయానికి వద్దాం!

‘పటాస్’ నుంచి ‘మన శంకర వరప్రసాద్ గారు’ వరకు… ఆయన దర్శకత్వంలో వచ్చిన తొమ్మిది సినిమాలు తొమ్మిదీ విజయవంతం కావడం అనేది తెలుగు సినిమా పరిశ్రమలో చాలా ప్రత్యేకమైన రికార్డు!
రాజమౌళి తర్వాత ఆ స్థాయి హిట్ రికార్డ్ ఉన్న ఏకైక దర్శకుడు అనిల్ రావిపూడి.

ఇది కేవలం అదృష్టం అని చెప్పడం చాలా సులభం.

కానీ వరుసగా తొమ్మిది సినిమాలకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం వెనుక ఉన్న కష్టం, ప్లానింగ్, రచనా బలం, టీమ్‌వర్క్‌ను కూడా గుర్తించాలి.

ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌లో అనిల్ రావిపూడి సినిమాలంటే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన అంచనా ఏర్పడింది.

సంక్రాంతికి ఒక సినిమా అంటే కేవలం ఒక సినిమా కాదు. కుటుంబం మొత్తం కలిసి చూడగలిగే ఒక పండగ అనుభూతి!

ఈ భావనను తన సినిమాల ద్వారా ఒక బ్రాండ్‌గా మార్చగలిగారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’తో ఆ బ్రాండ్ మరింత బలపడింది. ఆ తర్వాత ‘మన శంకర వరప్రసాద్ గారు’తో చిరంజీవి లాంటి మెగాస్టార్‌ను తన ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలోకి తీసుకువచ్చి మరో భారీ విజయాన్ని అందించారు. ఇప్పుడు “జనవరి 12 విడుదల” అంటూ మరొకటి!

ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి.

అనిల్ రావిపూడి గొప్పతనం ప్రతి ఒక్క విమర్శకుడిని మెప్పించడంలో లేదు. ప్రతి ప్రేక్షకుడికి ఒకే రకమైన సినిమా నచ్చుతుందని నిరూపించడంలోనూ లేదు.

తన సినిమాల ద్వారా ఒక నిర్దిష్టమైన ప్రేక్షక వర్గాన్ని థియేటర్లకు రప్పించగలగడం, వాళ్లకు కావాల్సిన వినోదాన్ని అందించగలగడం, థియేటర్ ఎజమానులకు కాసుల వాన కురిపించడం, తన సినిమాలపై ఒక నమ్మకాన్ని నిర్మించడం… అదే ఆయన అసలు బిజినెస్ స్ట్రెంగ్త్!

అయితే అనిల్ రావిపూడి సక్సెస్ నుంచి సినీ రచయితలు, దర్శకులు నేర్చుకోవాల్సింది ఏంటి?

– తమ బలం ఏంటో తెలుసుకోవాలి!
– ప్రేక్షకులను తక్కువ అంచనా వేయకూడదు!
– ఒక విజయం వచ్చిన తర్వాత దానితో ఆగిపోకుండా, ఆ మూసలో ఇరుక్కుపోకుండా కొత్తదనం కోసం ప్రయత్నించాలి!
– నచ్చిన సినిమా తీయడం మాత్రమే కాదు, ప్రేక్షకులకు ఏం నచ్చుతుందో కూడా అర్థం చేసుకోవాలి!

ఇవన్నీ వినడానికి చాలా సింపుల్‌గా అనిపించవచ్చు. అందరికీ తెలిసిందేగా అనిపించవచ్చు. కానీ ఈ సూత్రాలను వరుసగా సినిమాల్లో అమలు చేయడం అంత సులభం కాదు.

అందుకే అనిల్ రావిపూడి ప్రయాణం ఒక దర్శకుడి సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు… ఒక కమర్షియల్ ఫిల్మ్‌మేకర్ ఎలా తనదైన మార్కెట్‌ను నిర్మించుకోవచ్చో చెప్పే ఒక మంచి ఉదాహరణ!

ఇదంతా ఒక ఎత్తైతే ..సినిమాని పబ్లిసిటీ చేయడంలో కొత్తపొంతలు తొక్కడం ఒక్క అనిల్ కే సాధ్యమవుతోంది. మిగిలిన దర్శకులకి ఆయన ఈ విషయంలో దారి వేసారా అనిపిస్తుంది.

తాజాగా “జనవరి 12 విడుదల” ప్రమోషన్స్ లో జంధ్యాల సినిమా స్పూఫులు, దళపతి సినిమా స్పూఫ్ వంటివి చేస్తూ ఈ తరం ప్రేక్షకులకి ప్రియమైన దర్శకుడిగా మారిపోయాడు అనిల్ రావిపూడి.

అనిల్ లో మంచి నటుడు కూడా ఉన్నాడన్నది కొత్తగా చెప్పక్కర్లేదు. ఫిల్మ్ నగర్ క్లబ్బులో జరిగిన డైరక్టర్స్ అసోషియేషన్ ఈవెంట్స్ లో స్టేజ్ మీద స్కిట్స్ చేసినా…ఎల్బీ స్టేడియం లో జరిగిన ఈవెంటులో వెంకటేష్, చిరంజీవి వంటి వారిని ఇమిటేట్ చేస్తూ డ్యాన్స్ చేసి మెప్పించినా, తాజాగా “జనవరి 12 విడుదల” ప్రమోషన్స్ లో నవ్వించే స్కిట్స్ చేస్తున్నా… అది అనిల్ రావిపూడికే చెల్లింది.

“ఎ.ఎన్.ఇ- రిపీట్” లాంటి సినిమాల్లో కేమియోలతో సరిపెట్టకుండా, పూర్తి స్థాయి నటుడిగా దర్శమిస్తారా అనేది కూడా చూడాలి. ఆయనిష్టం..ఆయన కంఫర్ట్!

చివరగా ఒక మాట…

కొంతమంది దర్శకులు తమ సినిమాలతో ప్రేక్షకులకు గుర్తుండిపోతారు.

కొంతమంది దర్శకులు తమ హీరోలతో గుర్తుండిపోతారు.

కానీ అనిల్ రావిపూడి లాంటి దర్శకులు… తమ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముఖాల్లో పూయించిన నవ్వులతో గుర్తుండిపోతారు!

ఆయన ప్రయాణంలో ఇంకా ఎన్నో కథలు ఉన్నాయి. ఇంకా ఎన్నో కొత్త ప్రయోగాలు చేయాల్సి ఉంది. ఇంకా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాల్సి ఉంది.

ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా… ఒక మంచి సినిమా కోసం ఎదురుచూసే ప్రతి తెలుగు ప్రేక్షకుడి తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేద్దాం.

హ్యాపీ బర్త్‌డే అనిల్ రావిపూడి గారు!

మీరు సినిమాలు తీయడం కొనసాగించండి… మేము థియేటర్లలో నవ్వుతూనే ఉంటాం!

ఎందుకంటే…

తెలుగు సినిమాకు హీరోలు అవసరం… హిట్లు అవసరం… కానీ ఆ హిట్ల మధ్య ప్రేక్షకులకు నవ్వుల పండగ అందించే మీలాంటి దర్శకులు కూడా చాలా చాలా అవసరం!

మీలోనే ఒక జంధ్యాలని, ఒక ఈవీవీని చూసుకుంటూ ఉంటాం మేము. ఆ మహోన్నత దర్శకుల ఆశీర్వాదాలు కూడా పైనుంచి మీకు ఉంటాయని ఆశిస్తున్నాం.

మీ ప్రయాణం మరిన్ని విజయాలతో కొనసాగాలని కోరుకుంంటున్నాం.

– సిరాశ్రీ

2 Replies to “అనిల్ రావిపూడి… ఒక సక్సెస్ స్టడీ!”

  1. ఇతని సినిమాలు నాకు నచ్చవు. అసలు సంక్రాంతికి వస్తున్నాం ఎలా హిట్ అయిందో అర్ధం కాదు. C గ్రేడ్ కామెడీ.

Comments are closed.