పురంధేశ్వరి విశాఖ నుంచే పోటీ.. ?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి సొంత నియోజకవర్గం అంటూ లేదని వైసీపీ విమర్శలు చేస్తూ వస్తోంది. కానీ ఆమెకు సొంత సీటు ఉంది. అదే విశాఖ ఎంపీ సీటు అని అంటున్నారు. 2009లో…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి సొంత నియోజకవర్గం అంటూ లేదని వైసీపీ విమర్శలు చేస్తూ వస్తోంది. కానీ ఆమెకు సొంత సీటు ఉంది. అదే విశాఖ ఎంపీ సీటు అని అంటున్నారు. 2009లో విశాఖ నుంచి ఎంపీగా తొలిసారి పోటీ చేసి గెలిచి కేంద్రంలో మంత్రి పదవిని ఆమె అందుకున్నారు.

అలా సెంటిమెంట్ సీటుగా దాన్ని ఆమె నమ్ముకున్నారు. 2019లో మరోసారి పొత్తులు లేకుండా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాలేదు. అయినా విశాఖ అంటే పురంధేశ్వరికి మక్కువ ఎక్కువ అని అంటున్నారు. అయితే గత రెండేళ్లుగా బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖలో మకాం ఉంటూ స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలను చూస్తున్నారు.

బీజేపీ తరఫున ఆయన జోరుగా పనిచేస్తున్నారు. కానీ జీవీఎల్ కి చివరి నిముషంలో హ్యాండ్ ఇస్తారని చిన్నమ్మకే ఎంపీ సీటు ఖరారు అవుతుందని అంటున్నారు. ఆమె టీడీపీతో పొత్తులకు ఆసక్తి చూపడం వెనక విశాఖ ఎంపీ సీటు మదిలో ఉందని అంటున్నారు. దీని మీద వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ ఈసారి పురంధేశ్వరి ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అని ప్రశ్నను సంధించారు.

పురంధేశ్వరి పోటీ చేసే సీటుని చంద్రబాబు నిర్ణయిస్తారని ఆయన సెటైర్లు వేస్తున్నారు అందుకే చంద్రబాబు మీద ఈగ కూడా వాలకుండా పురంధేశ్వరి చూస్తున్నారు అని విమర్శించారు. విశాఖ నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తే పొత్తులు లేకపోయినా టీడీపీ పరోక్షంగా సహకరిస్తుంది అన్న ప్రచారమూ ఉంది అంటున్నారు. ఈసారి ఎలాగైనా ఎంపీగా గెలిస్తేనే దగ్గుబాటి వారి వంశ రాజకీయం ఒక వెలుగు వెలుగుతుందని చిన్నమ్మ గాఢంగా నమ్ముతున్నారు. అందుకే ఆమె టీడీపీతో పొత్తులు కోసం చూస్తున్నారు అని అంటున్నారు.