కల్కి బ్లాక్ బస్టర్ హిట్టయింది. దర్శకుడు ఎంచుకున్న కథ వల్లనే ఇదంతా సాధ్యమైందంటున్నారంతా. అమితాబ్ బచ్చన్ ఇదే చెప్పారు. ఈరోజు కమల్ హాసన్ కూడా ఇదే మాట అంటున్నారు. మరి ఇందులో ప్రభాస్ గొప్పదనం ఏమీ లేదా? ప్రభాస్ లేకపోతే ఈ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు వచ్చి ఉండేవా? ఈ విషయాన్ని కమల్ ఎందుకు ప్రస్తావించరు?
నిజమే కల్కి సినిమా కోసం దర్శకుడు మూడేళ్లు కష్టపడ్డాడు. నిర్మాత వందల కోట్లు కుమ్మరించాడు. చాలామంది స్టార్స్ ను తీసుకున్నారు. అమితాబ్, కమల్, దీపిక లాంటి స్టార్స్ ను ఒకే సినిమాలోకి తీసుకోవడం చాలా పెద్ద టాస్క్. వీళ్లతో పాటు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్, రాజమౌళి, ఆర్జీవీ లాంటి వాళ్లను కూడా అక్కడక్కడ చూపించారు. అయితే వీళ్లందరూ ఉన్నంత మాత్రాన సినిమాకు వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు వస్తాయా?
వీళ్ల కంటే ముఖ్యంగా కల్కిలో ప్రభాస్ ఉన్నాడు. అసలైన పాన్ ఇండియా స్టార్ అతడు. అందుకే ఇన్ని వందల కోట్ల వసూళ్లు.. కళ్లుచెదిరే రికార్డులు. మరి అలాంటి స్టార్ గురించి కమల్ హాసన్ ఎందుకు మాట్లాడరు?
కల్కి సక్సెస్ ను తను బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు కమల్. కచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం అన్నారు. సినిమాలో కొంతమంది బిగ్ స్టార్స్ నటించినప్పటికీ, సక్సెస్ కు మెయిన్ కారణం నాగ్ అశ్విన్ ఐడియా అని తేల్చిచెప్పారు.
నిజంగానే నాగ్ అశ్విన్ కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఓ కొత్త కాన్సెప్ట్ తో, కొత్త ప్రపంచాన్ని సృష్టించి అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించాడు. కచ్చితంగా అతడికి జేజేలు దక్కాల్సిందే. అయితే ప్రభాస్ లేకుండా ఇంత పెద్ద విజయం సాధ్యమౌతుందా? వెయ్యి కోట్ల వసూళ్లు కళ్లకు కనిపిస్తాయా? అది గుర్తించాలి కదా.
“నేను వసూళ్లు గురించి మాట్లాడ్డం లేదు, సినిమా ఇచ్చిన ఆనందం గురించి మాట్లాడుతున్నాను. ఆ సంతోషంలో మీరు కూడా పాలుపంచుకోండి” అని ఆహ్వానిస్తున్నారు కమల్ హాసన్. ఈ స్థాయిలో వసూళ్లు రాకపోతే ఇంత ఆనందం వస్తుందా? మరి ఈ భారీ వసూళ్లకు కారణం ఎవరు?