‘అక్క’ వెండి పళ్లెంలో వడ్డించిన చప్పిడి భోజనం!

‘అక్క’ ఒక ఆలోచన, భారీ హంగులు, ఇద్దరు బలమైన నటీమణులు ఉన్న సిరీస్. కానీ ఆ వెండి పళ్లెం ఎంత మెరిసినా, వడ్డించిన కథలో రుచి తక్కువైంది.

‘మహానటి’తో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ మొదటిసారి నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో, అది కూడా పూర్తి మాస్ అవతార్‌లో కనిపిస్తుందంటే అంచనాలు సహజంగానే పెరిగాయి. దానికి తోడు ‘సేక్రెడ్ గేమ్స్’ లాంటి సిరీస్‌లతో ఓటీటీలో తనదైన ముద్ర వేసిన రాధికా ఆప్టే ఆమెకు ఎదురుగా నిలబడింది.

‘ది రైల్వే మెన్’ నిర్మించిన యశ్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన ఈ హిందీ సిరీస్‌కు ధర్మరాజ్ శెట్టి కథ, దర్శకత్వం అందించారు. 2025లోనే టీజర్ వచ్చినా, ఏడాది ఆలస్యం తర్వాత ఐదు ఎపిసోడ్ల ఈ సిరీస్ తెలుగు అనువాదంతో నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది.

గ్యాంగ్‌స్టర్ కథలంటే ఇప్పటిదాకా మగాళ్ల సామ్రాజ్యాలు, మగాళ్ల పగలే చూశాం. ఆడవాళ్లు పక్కనే ఉంటారు. ‘అక్క’ ఆ లెక్కను పూర్తిగా తిరగరాస్తుంది. ఇక్కడ వారసత్వం ఆడవాళ్లది, డబ్బు ఆడవాళ్ల చేతుల్లో, తుపాకులు కూడా వాళ్ల చేతుల్లోనే. మంగళసూత్రాల బంధం లేకుండానే వాళ్లు తమకు నచ్చిన తోడును ఎంచుకుంటారు.

మగాళ్లు ఇంట్లో ఫర్నీచర్‌లా మిగిలిపోతారు. దేశంలో పది మందిలో ఒక్కరే చదువుకున్నారని ఒక ప్రభుత్వ అధికారి చెబితే, మా పెర్నూరులో పది మందిలో తొమ్మిది మంది చదువుకున్నారని భవాని చిరునవ్వుతో చెప్పే సీన్ ఆ ప్రపంచం ఎంత భిన్నమైనదో చెబుతుంది. వినడానికి ఈ ఆలోచన ఎంత కొత్తగా ఉందో, తెరపై కూడా మొదట్లో అంతే ఆసక్తిగా అనిపిస్తుంది. కానీ ఆ కొత్తదనాన్ని చివరిదాకా నిలబెట్టుకోవడంలో మాత్రం సిరీస్ తడబడింది.

కథలోకి వెళ్తే.. 1985 నాటి పెర్నూరు. తరతరాలుగా ఆడవాళ్లే నిర్మించి, పాలించి, కాపాడుకుంటూ వస్తున్న ఒక సామ్రాజ్యం అది. ఆ ప్రాంతం మొత్తం సారా వ్యాపారం మీదే నడుస్తుంది. ఆ సామ్రాజ్యానికి వారసురాలు భవాని (కీర్తి సురేష్). ఆ వంశానికి కొన్ని కఠినమైన నియమాలు ఉంటాయి. పెళ్లి చేసుకోకూడదు. బిడ్డ లేకుండా, అది సొంత బిడ్డైనా దత్తత తీసుకున్నదైనా, ‘అక్క’ పీఠం ఎక్కే అర్హత రాదు.

బయటి ప్రపంచం జోక్యం అసలు ఉండకూడదు. భవాని ఈ నియమాలన్నింటినీ తు.చ. తప్పకుండా పాటిస్తుంది. ఆమె ప్రేమించిన వ్యక్తి మాత్రం పెళ్లి కాకుండా బిడ్డను కనడానికి ఒప్పుకోడు. ఇలా వ్యక్తిగత జీవితంలో సంఘర్షణ నడుస్తుండగానే, ముంబై గ్యాంగ్‌స్టర్ శంకర్ (మహేష్ మంజ్రేకర్) పంపిన రుద్ర (రాధికా ఆప్టే) పెర్నూరులోకి అడుగుపెడుతుంది.

పెర్నూరు సారా వ్యాపారాన్ని భవాని చేతుల్లోంచి లాక్కోవడమే ఆమె లక్ష్యం. కానీ ఆమెకు ఈ వంశం మీద ఉన్న కోపం వెనక వ్యాపారం కంటే లోతైన పాత పగ ఏదో ఉంటుంది. అసలు రుద్ర ఎవరు, ఆమె గతం ఏంటి, భవాని తన వారసత్వాన్ని ఎలా కాపాడుకుంది అనేదే మిగతా కథ.

భవానిగా కీర్తి సురేష్ సిరీస్‌కు అసలు బలం. అధికారం చూపించే చోట కరుకుదనం, ఒంటరిగా ఉన్నప్పుడు బయటపడే బలహీనత రెండింటినీ బాగా పలికించింది. రుద్రగా రాధికా ఆప్టే పూర్తిగా కొత్తగా కనిపిస్తుంది. పెర్నూరు ఆడవాళ్లు సంప్రదాయ చీరలు, నగలతో కనిపిస్తే, రుద్ర మాత్రం నల్లటి వెస్ట్రన్ దుస్తుల్లో కనిపిస్తుంది. ఆ తేడానే రెండు ప్రపంచాల మధ్య పోరును చెబుతుంది. రుద్ర పాత్ర వెనక ఉన్న ఫ్లాష్‌బ్యాక్ సిరీస్‌లో ఆసక్తిగా సాగే భాగాల్లో ఒకటి.

సాంకేతికంగా ‘అక్క’ చాలా రిచ్‌గా ఉంది. భారీ సెట్లు, దూరంగా విసిరేసినట్టు ఉండే లొకేషన్లు ఆ ప్రపంచాన్ని నమ్మేలా చేస్తాయి. కాస్ట్యూమ్స్, ముఖ్యంగా ఆ పెద్ద పెద్ద ముక్కుపుడకలు, నగలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. మొదటి రెండు ఎపిసోడ్లలో పెర్నూరు ప్రపంచాన్ని, అక్కడి నియమాలను దర్శకుడు ఆసక్తిగా పరిచయం చేశాడు.

సమస్య అక్కడి నుంచే మొదలవుతుంది. అంత కొత్త ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత, కథ మాత్రం మామూలు గ్యాంగ్ వార్ దారిలోకే వెళ్లిపోతుంది. అధికారం కోసం గొడవ, హింస, దాని పర్యవసానం.. మళ్లీ గొడవ, మళ్లీ హింస. మగాళ్ల స్థానంలో ఆడవాళ్లను పెట్టారు తప్ప, ఆ మార్పు కథకు ఏ కొత్త లోతునూ ఇవ్వలేదు.

సన్నివేశాల మధ్య సహజమైన ప్రవాహం కూడా ఉండదు. ఒక పెద్ద మూమెంట్ నుంచి ఇంకో పెద్ద మూమెంట్‌కి దూకినట్టు సాగుతుంది. పెర్నూరు ప్రజల మనసు గెలవడానికి చాలా కాలం పడుతుందని ఒక పూజారి చెబితే, తర్వాతి సీన్‌లోనే రుద్ర అందరికీ ఆరాధ్యురాలైపోతుంది.

స్లో మోషన్ నడకలు, పంచ్ డైలాగులు ఎక్కువై, పాత్రల లోపలి మనసు తక్కువైంది. రుద్రను భవానికి సరిసాటి ప్రత్యర్థిగా మలచడంలో కూడా రచనలో పదును లోపించింది. నాలుగో ఎపిసోడ్‌కి వచ్చేసరికి కథ ఊహించే దారిలోనే వెళ్తుంది. ఐదు ఎపిసోడ్లే అయినా సిరీస్ సాగదీసినట్టు అనిపిస్తుంది.

చివరి ఎపిసోడ్‌లో భవాని, రుద్ర గ్యాంగ్‌ల మధ్య జరిగే పోరు కొంత ఊపునిచ్చినా, అప్పటికే ఆసక్తి సగం చల్లారిపోతుంది. రక్తపాతం కూడా కొన్నిచోట్ల అవసరానికి మించి ఉంది.

మొత్తంగా ‘అక్క’ ఒక ఆలోచన, భారీ హంగులు, ఇద్దరు బలమైన నటీమణులు ఉన్న సిరీస్. కానీ ఆ వెండి పళ్లెం ఎంత మెరిసినా, వడ్డించిన కథలో రుచి తక్కువైంది.

5 Replies to “‘అక్క’ వెండి పళ్లెంలో వడ్డించిన చప్పిడి భోజనం!”

      1. అలాంటి ‘ఆంటీ ‘వాళ్ళకే పనిగట్టుకునిఅరవ సినిమా లో ఛాన్స్ లు, ఇక్కడ రిలీజ్ ఊఉ,  డోరోతి ఎవడికి ‘అక్క’?

Comments are closed.