మొన్న నారాయణమ్మ.. ఇప్పుడు జిమ్ జిమ్ తార.. ఇదేనా ‘ఆదర్శం’

నిజానికి ఆదర్శ కుటుంబం మేకర్స్ వాడింది కొన్ని సెకెన్ల ఆడియో మాత్రమే. అయినప్పటికీ సమాచారం అందించాల్సిన బాధ్యత వాళ్లకుంది

ఆదర్శ కుటుంబం సినిమా కోసం అలనాటి నారాయణమ్మ ట్యూన్‌ను కాపీ కొట్టిన సంగతి తెలిసిందే. అందరికీ తెలిసిన పాటే కదా, అది కాపీ కొట్టడం ఎలా అవుతుందంటూ నాగవంశీ తనదైన వెర్షన్ వినిపించారు అప్పట్లో.

ఓ పాత పాట నుంచి ప్రేరణ పొందామనే విషయం అందరికీ తెలుసని, ఇందులో దాపరికం ఏం లేదని, అందుకే బయటకు చెప్పలేదని అన్నారు. అలా పాత పాటను చాలా కన్వీనియంట్‌గా తమ సినిమాలో వాడేసిన ఆదర్శ కుటుంబం యూనిట్, అదే ఊపులో ఓ కొత్త ట్రెండింగ్ పాటను కూడా వాడేసింది.

ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతున్న సాంగ్ ‘జిమ్ జిమ్ తార’. విడుదలకు సిద్ధమైన ఓ చిన్న సినిమాలో పాట ఇది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ సాంగ్‌ను ఆదర్శ కుటుంబం సినిమాలో వాడేశారు.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో భాగంగా ఓ సన్నివేశంలో జిమ్ జిమ్ తార లిరిక్స్ వినిపిస్తాయి. ఆ వెంటనే దాని రీమిక్స్ ట్యూన్ కూడా కొనసాగుతుంది. తాము అప్‌డేట్‌గా ఉన్నాం, ట్రెండ్‌లోనే ఉన్నామని చెప్పుకోవడం కోసం ఆ పాటను అలా వాడేసినట్టున్నారు.

అయితే దీనిపై ఆ పాట హక్కులు కలిగిన నిర్మాత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. అనధికారికంగా తమ సినిమాకు చెందిన పాటని ఉపయోగించడం వల్ల తమ చిత్రానికి దక్కాల్సిన గుర్తింపు దక్కదని, అసలు ప్రయోజనం దెబ్బతిన్నదని ఆ నిర్మాత వాదిస్తున్నాడు.

ఇండస్ట్రీలో చిన్న సినిమాలను ప్రోత్సహించాల్సింది పోయి, వాటి మనుగడను ప్రశ్నార్థకం చేసేలా పెద్దవాళ్ళు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నాడు ఈ చిన్న సినిమా నిర్మాత.

నిజానికి ఆదర్శ కుటుంబం మేకర్స్ వాడింది కొన్ని సెకెన్ల ఆడియో మాత్రమే. అయినప్పటికీ సమాచారం అందించాల్సిన బాధ్యత వాళ్లకుంది. అలాంటి ముందస్తు సమాచారం లేకుండానే పాటను వాడేశారని సదరు నిర్మాత ఆరోపిస్తున్నాడు. ఇదే విషయం తమన్‌ను అడిగితే, అది దొంగిలించడం కాదు, తస్కరించడం అంటాడేమో.

2 Replies to “మొన్న నారాయణమ్మ.. ఇప్పుడు జిమ్ జిమ్ తార.. ఇదేనా ‘ఆదర్శం’”

Comments are closed.