తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్యేల పనితీరుపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏమిటో తెలుసుకునేందుకు రెడీ అవుతోంది.
సంక్షేమ పథకాల అమలు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వ్యవహారశైలి వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో రహస్యంగా సర్వే చేస్తున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో పార్టీ వ్యూహాలను రూపొందించేందుకు ఈ సమాచారాన్ని ఉపయోగించుకోవాలని నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
2023 డిసెంబర్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ 7వ తేదీ నాటికి మూడేళ్ల పాలనను పూర్తి చేసుకుంటుంది. అందువల్ల ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడంతోపాటు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఎలా వ్యవహరిస్తున్నారనే అంశాన్ని అంచనా వేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.
అందుకే నియోజకవర్గాల వారీగా గోప్యంగా సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను పార్టీ వర్గాలు అధికారికంగా వెల్లడించలేదు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయి? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇంకా పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉన్నాయా? వాటిని పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు ఎంతవరకు చొరవ చూపుతున్నారు? అనే అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.
మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను సేకరించి, ప్రభుత్వంపై సంతృప్తి, అసంతృప్తి స్థాయిని అంచనా వేయనున్నట్లు సమాచారం.
ముఖ్యంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఎమ్మెల్యేలను సులభంగా కలుసుకోగలుగుతున్నారా? సమస్యల పరిష్కారం కోసం అధికారులు, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటున్నారా?
అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరుగుతున్నాయా? అనే ప్రశ్నల ఆధారంగా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు నాయకులపై ఉన్న ఆదరణతో పోలిస్తే ప్రస్తుతం ప్రజల్లో వారి పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందనే అంశాన్ని కూడా అంచనా వేయనున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? ఎక్కడైనా అసంతృప్తి పెరుగుతోందా? స్థానిక సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందా? అనే అంశాలను సర్వే ద్వారా తెలుసుకుంటారు. ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించడం, వారి సమస్యలపై వెంటనే స్పందించడం, అభివృద్ధి పనులను పర్యవేక్షించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు.
సర్వేలో వెల్లడయ్యే అభిప్రాయాలు పార్టీ అంతర్గత సమీక్షకు ఉపయోగపడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఎమ్మెల్యేల పనితీరుతోపాటు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమన్వయంపైనా అధిష్ఠానం దృష్టి సారించినట్లు సమాచారం. స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం లభిస్తోందా?
ఎన్నికల సమయంలో పార్టీ విజయం కోసం పనిచేసిన వారికి గుర్తింపు దక్కుతోందా? ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడంపై స్థానికంగా ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? అనే అంశాలను కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నియోజకవర్గాల్లో నాయకుల మధ్య వర్గ విభేదాలు ఉన్నాయా? అవి పార్టీ కార్యక్రమాలపై ప్రభావం చూపుతున్నాయా? అనే విషయాలపైనా సమాచారం సేకరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కొన్ని గ్రామీణ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కొందరు ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి.
ఈ ఏడాది జూలైలో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో విడివిడిగా సమావేశమై అభిప్రాయాలు సేకరించినట్లు ది టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెల్లడించింది.

Mari potreddy gaadi panitheeru
Mundhu rythulu ki water ivvu raaa Munda