కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనుష్, రాజకీయాల వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటివరకు తన సినిమాలు, నటనతో ప్రేక్షకులకు దగ్గరైన ఆయన.. ఇప్పుడు అభిమాన సంఘాలను ఒక వ్యవస్థీకృత నిర్మాణంగా మార్చడంపై దృష్టి పెట్టాడు.
తన అభిమాన సంఘాన్ని, ధనుష్ సంక్షేమ ఉద్యమంగా పేరు మార్చిన ధనుష్.. అదే టైమ్‌లో తన సంఘం కోసం ఓ ప్రత్యేక గుర్తును కూడా ఆవిష్కరించాడు. ఇప్పటికే కొన్ని మీటింగ్స్ పెట్టిన ఈ నటుడు, ఈరోజు ఏకంగా 3వేల మంది మహిళా ఎగ్జిక్యూటివ్‌లు, అభిమాన సంఘాల కార్యకర్తలతో సమావేశమయ్యాడు.
చెన్నై శివార్లలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో జరిగిన ఈ సమావేశంలో, మధ్యాహ్నం అందరికీ కడుపునిండా భోజనం పెట్టిన ధనుశ్.. కీలకమైన మహిళా నేతలకు వెండి బహుమానాలు కూడా అందించాడు.
అయితే, రాజకీయాల్లోకి వస్తున్నట్లు ధనుష్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆయన పొలిటికల్ ఎంట్రీపై సిగ్నల్స్ ఇస్తున్నాయి.
తన అభిమాన సంఘం పేరును ‘ధనుష్ ఫ్యాన్స్ క్లబ్’ నుంచి ‘ధనుష్ నర్పణి ఇయక్కం’గా మార్చాడు. కేవలం సినీ ఫంక్షన్లకు పరిమితం కాకుండా, ఛారిటీ కార్యక్రమాలు చేపట్టాలని ఇప్పటికే తన అభిమానులకు పిలుపునిచ్చాడు.
సంఘం పేరు మార్పు, కొత్త గుర్తు, కార్యనిర్వహక కమిటీల ఏర్పాటు.. ఇవన్నీ చూస్తుంటే.. ధనుష్ మెల్లమెల్లగా తన పొలిటికల్ ఎంట్రీకి దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది.
తమిళనాడులో నటుడు విజయ్ సాధించిన అఖండ విజయం, ధనుష్ కు ప్రేరణగా నిలిచింది. విజయ్ తన అభిమాన సంఘాలను ‘విజయ్ మక్కల్ ఇయక్కం’గా వ్యవస్థీకరించి, ఆ తర్వాత తమిళగ వెట్రి కళగం-టీవీకేను ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసిందే. ధనుష్ కూడా ఇలానే వ్యవహరిస్తున్నాడు.
మరోవైపు, ధనుష్ రాజకీయాల్లోకి వస్తే ఆయన సోలోగా ఉంటారా, ఏదైనా పార్టీకి మద్దతిస్తారా అనే చర్చ తమిళనాట మొదలైంది. సొంత రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత ఆయన స్వతంత్రంగా ఉంటారా లేక మరో పార్టీకి మద్దతిస్తారా అనేది చర్చనీయాంశమైంది.
ధనుష్ రాజకీయాల్లోకి వస్తే అతడ్ని సాదరంగా తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని ఇప్పటికే అన్నాడీఎంకే ప్రకటించింది. అటు డీఎంకే కూడా స్పందించింది. ధనుష్ రాజకీయ ప్రవేశాన్ని ఎవరూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదంది. ఇక విజయ్ పార్టీ కూడా ధనుష్ పై స్పందిస్తూ, విజయ్ స్ఫూర్తితో మరింతమంది నటులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చింది.
చూడ్డానికి/వినడానికి ఈ ప్రకటనలు బాగానే ఉన్నాయి కానీ, ధనుష్, ఉన్నఫలంగా రాజకీయాల్లోకి వచ్చేది విజయ్-టీవీకేకి చెక్ పెట్టడానికే అనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా బీజేపీ సపోర్ట్‌తో ధనుష్, వడివడిగా రాజకీయ అడుగులు వేస్తున్నాడనే చర్చ తమిళనాట ఎక్కువగా జరుగుతోంది.

స్వామి రారా ..