తెలంగాణ రాజకీయాల్లో హీరోయిన్లు బద్నాం అవుతున్నారు. నిజానిజాల నిర్థారణ లేకుండా, రాజకీయ ఆరోపణల్లో భాగంగా టాలీవుడ్ హీరోయిన్లను బలిపశువుల్ని చేస్తున్నారు.
ఈ విషయంలో ఏ ఒక్క పార్టీనో నిందించాల్సిన పనిలేదు. ముందు ఒకరు మొదలుపెట్టారు, దాన్ని మరో పార్టీ కొనసాగిస్తోంది. ఇప్పుడు ముచ్చటగా మూడో పార్టీ కూడా ఈ రొంపిలో దిగింది.
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, రాజకీయ ఆరోపణల కంటే, ఇలా హీరోయిన్లను ముడిపెడుతూ, నాయకుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో హీరోయిన్ల పరువుకు భంగం వాటిల్లుతోంది.
మొన్నటివరకు తెలంగాణ రాజకీయాల్లో రకుల్ ప్రీత్ సింగ్ పేరు జోరుగా వినిపించింది. ఓ రాజకీయ నాయకుడికి ఆమెతో ముడిపెడుతూ వరుస కథనాలు పుట్టుకొచ్చాయి. ఓ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం ఆ కథనాల్ని గట్టిగానే ఎగదోసింది.
ఆ తర్వాత బాధిత పార్టీ నుంచి కౌంటర్ మొదలైంది. ఈసారి వాళ్లు మీనాక్షి చౌదరిని సెలక్ట్ చేసుకున్నారు. రకరకాల ఆధారాలు, స్క్రీన్ షాట్లు, ఫ్లయిట్ టికెట్లు చూపిస్తూ.. ఓ రాజకీయ నాయకుడితో మీనాక్షిని ముడిపెట్టే ప్రయత్నం చేశారు. వీళ్ల సోషల్ మీడియా వింగ్ మరింత గట్టిగా దీన్ని ఎగదోసింది.
ఇప్పుడు కయాదు లోహర్ వంతు వచ్చింది. తెలంగాణకు చెందిన ఓ నేతతో ఆమెకు సంబంధం ఉందని, ఆమెకు ఆ నేత ఏకంగా ఓ విల్లా రాసిచ్చాడంటూ ఓ పార్టీ పత్రిక ఏకంగా ఈ-పేపర్‌లో ప్రచురించడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆ ఈ-పేపర్ క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.
వీళ్ల ఆరోపణలు, ప్రత్యారోపణలు, కథనాలు పక్కనపెడితే.. తెలంగాణ రాజకీయాల్లో హీరోయిన్లు బలిపశువులుగా మారుతున్నారు.
ఓవైపు ఇలా ప్రత్యక్షంగా హీరోయిన్లు పేర్లు తెరపైకి తెచ్చి విమర్శలు, గలీజు ఆరోపణలు చేస్తుంటే, టాలీవుడ్ సంఘాలు మాత్రం స్పందించడం లేదు. విచారణ సంగతి దేవుడెరుగు, కనీసం ఖండిన ప్రకటనలు కూడా లేవు.
హీరోయిన్లపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతోంది. ఏఐ వచ్చిన తర్వాత ఈ పైశాచికత్వం మరింత పెరిగింది.
ఇప్పుడిలా రాజకీయ ఆరోపణల్లో కూడా హీరోయిన్ల పేర్లు వాడుకోవడం బాధాకరం. ఈ విషయాల్ని టాలీవుడ్‌లో ఎవ్వరూ ఖండించకపోవడం మరింత బాధాకరం.

మొన్న మీరు కూడా రాసినట్టున్నారు