“మేం మంచి సినిమా తీశాం, కానీ మీరే చూడట్లేదు. తమిళ్, మలయాళంలో ఇలాంటి సినిమా వస్తే ఆహా ఓహో అంటారు. మరి తెలుగులో మేం తీస్తే ఎందుకు చూడరు.”. ఇలా సమ్మర్ హాలిడేస్ యూనిట్ మొత్తం ఒకటే టాపిక్ ఎత్తుకుంది.
సోషల్ మీడియాలో సానుభూతి మెసేజ్ లు వద్దని, థియేటర్లకు వచ్చి సినిమాను ఆదరించాలని కోరుతున్నారు. చూసినవాళ్లందరికీ నచ్చుతుందని, కానీ చాలా తక్కువ మంది చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి కంటెంట్ ను ఆదరించకపోతే, మాలాంటి వాళ్లు సినిమాలు తీయడం మానేస్తారని.. ఓటీటీలో వచ్చిన తర్వాత చూసి చప్పట్లు కొడుతున్నారని, దాని వల్ల మాలాంటి నిర్మాతలకు ఒరిగేదేం ఉండదంటున్నారు.
ఇలా ఓ రకంగా ఎమోషనల్ గా, మరో రకంగా ప్రేక్షకుల్ని బ్లేమ్ చేస్తూ మాట్లాడుతోంది సమ్మర్ హాలిడేస్ యూనిట్. వాళ్ల బాధ అర్థం చేసుకోదగ్గదే. అదే టైమ్ లో ప్రేక్షకుల్ని నిందించడం ఎంత వరకు కరెక్ట్. వాళ్లు మంచి సినిమానే తీసి ఉండొచ్చు. కానీ ఆడకపోతే ప్రేక్షకులదే తప్పు అన్నట్టు మాట్లాడటం సరైన విధానమేనా? అసలు ఈ అంశంపై ఆడియన్స్ అభిప్రాయం ఏంటి?
సమ్మర్ హాలిడేస్ యూనిట్ కామెంట్స్ పై సోషల్ మీడియా కూడా అంతే ఘాటుగా స్పందించింది. “గురువారం రామాయణ, శుక్రవారం సీన్ మూవీ చూశాను. మళ్లీ పనిగట్టుకొని ఈ చిన్న సినిమా చూడాలా. ఇంత కాంపిటిషన్ మధ్య ఈ సినిమాను రిలీజ్ చేయమని ఎవరు చెప్పారు.” అంటూ ఒకరు స్పందించారు.
“సాంగ్స్, ట్రయిలర్ చూశాను, ఎలాంటి ఆసక్తి కలగలేదు. ఇక ఇంటర్వ్యూ మొత్తం నిర్మాతే కనిపించాడు. పైగా సినిమా గురించి తప్ప అన్నీ మాట్లాడాడు. ఇక సినిమా చూడాలనే ఆసక్తి ఎందుకు కలుగుతుంది” అంటూ మరొకరు స్పందించారు.
“ఇదే టికెట్ రేటుకు రామాయణ లాంటి విజువల్ వండర్ పక్కనే ఉంది. అందులో యశ్, సాయి పల్లవి కూడా ఉన్నారు. అలాంటప్పుడు సమ్మర్ హాలిడేస్ ఎందుకు చూడాలని” మరో యూజర్ ప్రశ్నించాడు.
నిజంగా బాగుంటే చూసిన ఒకరిద్దరైనా మిగతావాళ్లకు బాగుందని చెప్పేవారు కదా. అది చూసి మిగిలినవాళ్లు వెళ్తారు. ఎవ్వరూ వెళ్లట్లేదంటే మూవీలో ఏదో తేడా ఉందనే కదా అర్థంమంటూ ఒకరు స్పందిస్తే… ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండి ఇప్పుడీ మాటలేంటి, సినిమా బాగుంటే ప్రచారం లేకపోయినా ఆడుద్ది అంటూ మరొకరు రియాక్ట్ అయ్యారు.
నాకు చూడాలని అనిపించినా దగ్గర్లో ఈ సినిమా యాక్సెస్ లేదు. రామాయణ, సీన్ మాత్రమే ఉన్నాయని ఒకరు స్పందించారు. సినిమా బాగుంది కానీ, రిలీజ్ చేసిన టైమింగ్ అస్సలు బాగాలేదని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇలా కంటెంట్ పై కంప్లయింట్లు తక్కువగా, సినిమా విడుదల తేదీపై ఫిర్యాదులు ఎక్కువగా కనిపించాయి సోషల్ మీడియాలో.
