రామ్ చరణ్, సుకుమార్ సినిమాలో హీరోయిన్ ఎవరనే చర్చ కొన్నాళ్లుగా సాగుతూనే ఉంది. సారా అర్జున్, భాగ్యశ్రీ బోర్సే, ప్రీతి ముకుందన్, అనీత్ పద్దా, సాత్విక వీరవల్లి.. ఇలా చాలా పేర్లు తెరపైకొచ్చాయి. వీళ్లలో కాస్త గట్టిగా వినిపించిన పేర్లు సారా అర్జున్, సాత్విక.
అయితే యూనిట్ మాత్రం తమ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని బయటపెట్టలేదు. వాళ్లు హీరోయిన్ ను లాక్ చేశారు. కానీ సరైన టైమ్ కోసం చూస్తున్నారు. ఆ టైమ్ వచ్చినప్పుడు అధికారికంగా బయటపెట్టాలనుకుంటున్నారు.
కానీ ఇంతలోనే పరోక్షంగా అసలు విషయాన్ని చెప్పేశారు నిర్మాత మైత్రీ రవి. ఓ పెద్ద సినిమా ఆఫీసులో సాత్విక ఆడిషన్ చేస్తుంటే చూశానని, ఆమె కెరీర్ అలా పెద్ద సినిమాలతో దూసుకుపోతుందని అన్నారు.
‘మా ఆఫీస్’ అనబోయి.. ఓ పెద్ద సినిమా ఆఫీస్ అంటూ రవిశంకర్ కవర్ చేసుకున్నారు. పైగా వాళ్ల చిరునవ్వులు చూస్తుంటే, సాత్విక దాదాపు ఓకే అయిందనే విషయం కూడా చాలామందికి అర్థమైపోయింది. ఇలా చెప్పాల్సిన విషయాన్ని చెప్పకనే చెప్పేశారు రవిశంకర్.
ఈ సినిమా ఆల్రెడీ లాంచ్ అయింది. అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. మైత్రీ రవి మాటల బట్టి చూస్తుంటే, మరికొన్ని రోజుల్లో సాత్విక పేరును అధికారికంగా ప్రకటించేలా ఉన్నారు.
