సినిమా: భోగి
రేటింగ్: 1.5/5
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
నటీనటులు: శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి, శరత్ లోహితస్వ, అవినాష్ తదితరులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: కిషోర్ కుమార్ ఏ
ఎడిటర్: తమ్మిరాజు
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్
నిర్మాత: కేకే రాధామోహన్
రచన, దర్శకత్వం: సంపత్ నంది
విడుదల తేదీ: నవంబర్ 27, 2026
“ఎగిలివారంగా” అనే పాటతోటే ఈ చిత్రంపై ప్రేక్షకుల దృష్టి పడింది. ఆ తర్వాత వచ్చిన “ఓ లచ్చా గుమ్మాడి..” కూడా జనాల్లోకి వెళ్లింది. తెలంగాణా మట్టి కథగా ప్రచారం జరుపుకున్న ఈ చిత్రం తాలూకు శర్వానంద్ లుక్, ట్రైలర్లో చూపించిన కంటెంట్ కూడా ఆసక్తిని పెంచాయి. మరి ఇంత బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం.
సినిమా కథ 1960ల నేపథ్యంలో సాగుతుంది. ఆదిలాబాద్‌లోని మారుమూల గ్రామమైన బొగ్గులగుట్టలో గంగ (శర్వానంద్) తన ఐదుగురు అక్కాచెల్లెళ్లతో కలిసి జీవిస్తుంటాడు. తన అన్నయ్య చికెన్‌పాక్స్‌తో మంచానికే పరిమితం కావడంతో, గ్రామ పెద్ద పటేల్ (శరత్ లోహితస్వ) గంగతో పాటు గ్రామానికి చెందిన మరికొందరు వ్యక్తులకు ఓ బాధ్యత అప్పగిస్తాడు. అసలు పటేల్ వారికి అప్పగించిన పని ఏంటి? ఆ పని చేస్తుండగా గంగకు ఎలాంటి నిజాలు తెలుస్తాయి?
కథగా చెప్పుకుంటే ఇంతే…
అసలు సినిమా తీసేటప్పుడు కథ అనుకున్నాక దానిని ఎలా నడపాలి, ఏం చేస్తే ప్రేక్షకులకి ఎమోషన్ అందుతుంది అనే దాని మీద ఎంతో కసరత్తు చేయాలి. పీరియడ్ బ్యాక్ డ్రాప్ పెట్టాం, హీరోకి విలేజ్ గెటప్పేసాం, వీర నరుకుడుతో రక్తపాతం పెట్టాం..ఇక చూసేయండి…ఇదే మాస్ మసాలా కమర్షియల్ ఎమోషనల్ చిత్రం అంటే ఎలా? ఇక్కడ అదే జరిగింది.
సినిమా మొదలయ్యి నలభై నిమిషలావుతున్నా ఎక్కడా ఎమోషన్ హుక్ పడదు. ఊళ్లో ఆడపిల్లల్ని ఎత్తుకుపోతున్నారు..అనగానే…హీరోకి ఆల్రెడీ నలుగురు చెల్లెళ్లు ఉన్నారు కనుక వాళ్లకేదో అవుతుందని ప్రేక్షకుడికి అనిపిస్తుంది. అనిపించింది నిజమవుతున్నప్పుడు ప్రెడిక్టిబుల్ గా ఉండి పెదవి విరిచేలా చేస్తుంది. పోనీ, ఆ రివీలింగ్ సీన్స్ బలంగా తెరకెక్కితే వేరు. అవి కూడా పేలవంగా, రొటీన్ గా ఉంటే? ఎప్పుడెప్పుడు సినిమా పూర్తవుతుందా, బయటపడదామా అనే అనిపిస్తుంది. దానికి తోడు ఇంటర్వెల్ కే హీరోకొచ్చిన కష్టం చూపించేసేటప్పటికి..ఇక అతని రివెంజ్ ని చూడడానికి ద్వితీయార్ధమంతా కూర్చోవాలన్న ఆలోచనే నీరసం తెప్పిస్తుంది.
మంచి పాటలున్నా, తెలంగాణా యాస గుబాళించే సంభాషణలున్నా…ప్రధాన కథలోనూ,కథనంలోనూ డెప్త్ లేకపోవడం వల్ల, మనసును పిండే ఎమోషన్ కానీ, రక్తం మరిగించే సన్నివేశాలు కానీ పండకపోవడం వల్ల తెర మీద ఏదో ఇంఫర్మేషన్ చూస్తున్నట్టు ఉంటుంది తప్ప నవరసాలతో కూడిన సినిమా చూస్తున్నట్టు అనిపించదు.
హీరో హీరోయిన్ మధ్యన ఏ రకమైన లవ్ ట్రాక్ కూడా లేదు. అనుపమ పరమేశ్వవరన్ పాత్రని సరిగ్గా వాడుకోనేలేదు. డింపుల్ హయాతి పోషించిన మందారం పాత్ర ఒక సీన్లో కాస్త ఉనికి చాటుకుంది. ఊరి ఎస్సై మగతనాన్ని ఊరి జనం మధ్యన బట్టబయలు చేసే సీన్ బాగుంది. కానీ ఆ తర్వాతి సన్నివేశంలోనే అంత బోల్డ్ లేడీ కాస్తా భయంతో పరుగుపెట్టడం దేనికో తెలీలేదు.
ఇక హీరో శర్వానంద్ విషయానికొస్తే, కష్టపడ్డాడన్న విషయం తెలుస్తున్నా…మనసుకి హత్తుకునే విధంగా నటించడానికి వీలుగా స్క్రిప్ట్ కలిసిరాలేదు. తెలంగాణా యాసలో డయలాగ్స్ చెబుతున్నా తను హీరోనని కాన్షియస్ గా చెబుతున్నట్టు ఉంది తప్ప సహజంగా ఆ మట్టి తాలూకు మనిషిలా కనిపించలేదు. స్టైల్ గా బీడీ తాగడం, చిన్న చిన్న ఎలివేషన్ షాట్స్, ఆ తర్వాత నరుకుడు…వీటివల్ల సహజత్వం లోపించి ఆడియన్స్ డిసెంగేజ్ అవుతారని ఎందుకు ఊహించలేదో!
విలన్ గా నటించిన లోహితాశ్వ మొహాన్ని చాలా సేపటి వరకు పూర్తిగా రివీల్ చేయకుండా దర్శకుడు ఎందుకు దాచాడో అర్ధం కాలేదు. పైగా ట్రైలర్లో ఆల్రెడీ చూపించేసాడు కూడా. బహుశా ఊరి జనం అతనిని చూడకుండా ఎప్పుడూ తల దించుకునే ఉంటారు కనుక వాళ్ల పాయింటాఫ్ వ్యూవ్ లో అలా చూపించాలనుకున్నాడేమో మరి తెలీదు. అదే అనుకుంటే పాదాలు తప్ప ఏమీ చూపించకూడదు. ఏది ఏమైనా అదొక అనవసర ప్రయాస ఆనిపించింది. ఈ అక్కర్లేని షాట్స్ కోసం సినిమాటొగ్రాఫర్ ఎంత కష్టపడాల్సి వచ్చిందో!
అలాగే ఇందులో కొన్ని చిన్న చిన్న “రంగస్థలం” షేడ్స్ కనిపిస్తాయి. ముఖ్యంగా..ఊరి పెద్ద ఊళ్లో వాళ్లని చంపడం, ఒకడు మెడ తెగాక ఏదో రహస్యం చెప్పబోతుంటే హీరో అతన్ని లేపుతూ ఆ రహస్యం తెలుసుకునే ప్రయత్నం చేయడం, అంజనం లాంటిది వేసి ఊరికి ఉత్తరం దక్షిణం అంటూ డైరెక్షన్స్ చెప్పుకోవడం, సెకండాఫులో చావు పాట….లాంటివి! ఇక ఇంటర్వెల్ ముందు శర్వానంద్ పరుగెత్తే సీన్లో “కాంతారా”ని పోలిన బీజీయం వినిపించారు. యాదృచ్ఛికంగానో, ఉద్దేశపూర్వకంగానో ఆ షేడ్స్ కనిపించడం వల్ల ఇందులో ఉన్న ఒరిజినాలిటీ ఏముందా అని వెతుక్కోవడం, కొత్తగా ఏదీ కనిపించకపోవడం జరిగింది.
ఇక ఎస్సై కేరెక్టర్ మరీ లౌడ్ గా ఉంది. ఆ కేరెక్టర్ మీద కంటే, దానిని డిజైన్ చేసిన రచయిత మీదే చిరాకు ఎక్కువ కలుగుతుంది. ఇక పరాకాష్ట ఏంటంటే, అడవిలో తలదాచుకున్న హీరో విలన్ మీద తిరగబడడానికి అడివిలోనే ఇనుముని కరగ్గొట్టి కొత్త కత్తి తయారు చేసుకోవడం, దానికి చెల్లెళ్ల నగలని కరిగించి బంగారు తాపడం పెట్టుకోవడం..అతి కే అతి అనిపించే సన్నివేశం.
ఇందులో మైనస్సులేమిటని అడిగితే..ఆసక్తి కలిగించని స్క్రీన్‌ప్లే, ఆకట్టుకోని కథనం, బలవంతంగా ఇరికించిన హింస, మోతాదుకు మించిన యాక్షన్ సీన్లు, సాగదీసిన సన్నివేశాలు, ముందే ఊహించగలిగే కథనం, ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే సన్నివేశాలు లేకపోవడం అని చెప్పుకోవాలి.
బాగున్నదేమిటి అంటే పాటలు, శర్వానంద్ పడిన కష్టం ..అంతే!
ఎంత రొటీన్ కథ కాదని చెప్పుకున్నా…ఈ భోగి కూడా ఒక సామాన్యుడు, భూస్వామ్య పెత్తందారుడిని ఎదిరించే పాత ఫార్ములాతో వచ్చిన మరో తెలుగు సినిమా. పీరియడ్ మారినా కథావస్తువు అదే. శర్వానంద్ కి ఇదొక “రంగస్థలం” రేంజ్ సినిమా అవుతుందని, ఈ మధ్యన వస్తున్న మంచి చిత్రాల కోవలోకి ఇది చేరుతుందని..ఇలా ఎన్నో అనుకుని చూడడానికి వెళ్లిన ప్రేక్షకులకి నిరాశ ఎదురవ్వడానికే చాన్స్ ఉంది.
శర్వానంద్ కి సాఫ్ట్ ఫ్యామిలీ స్టోరీస్ తప్ప ఇలాంటి బ్లడ్ బాత్ లు నప్పవేమో అన్న అనుమానాలు కూడా బలపడ్డాయి. ఇక తన కెరీర్ ని ఎలా మలుచుకుంటాడో, ఏం జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి. నరబలి అమానుషమని చెప్పడానికి హీరో చేత లెక్కలేనన్ని నరబలులు చేయించేశాడు దర్శకుడు. అదే విడ్డూరం! సంక్రాంతికి ముందే వచ్చిన ఈ “భోగి”మంట ప్రేక్షకుల ఆశలకి చితిమంటయ్యింది.
బాటం లైన్: చితిమంట

ఐతే థియేటర్లో చూడాల్సిన అవసరం లేదు
M …. Telusu ga
Sav edana dookki