ఢిల్లీకి బాబు, ప‌వ‌న్‌!

ఢిల్లీకి రావాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు బీజేపీ పెద్ద‌లు ఆహ్వానం ప‌లికిన‌ట్టు తెలుస్తోంది.

ఢిల్లీకి రావాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు బీజేపీ పెద్ద‌లు ఆహ్వానం ప‌లికిన‌ట్టు తెలుస్తోంది. రెండుమూడు రోజుల్లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌, మ‌హిళా రిజ‌ర్వేష‌న్ స‌వ‌ర‌ణ బిల్లుల్ని పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ పెట్ట‌నున్నారు.

ఈ రెండు బిల్లుల్ని మోదీ స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో బిల్లుల్ని తీసుకొచ్చిన మోదీ స‌ర్కార్‌… మొద‌టి సారి దెబ్బ తింది. లోక్‌స‌భ‌లో త‌గిన బ‌లం లేక‌పోవ‌డంతో మోదీ స‌ర్కార్ తీసుకొచ్చిన బిల్లులు వీగిపోయాయి.

అయితే కీల‌క బిల్లుల విష‌యంలో మోదీ స‌ర్కార్ మొండిగా ముందుకెళుతోంది. ఎలాగైనా వీటిని తీసుకురావాల‌నే ప‌ట్టుద‌ల‌తో బీజేపీ అగ్ర‌నేత‌లు ఉన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 30న తిరిగి లోక‌స‌భ స‌మావేశాల్ని ప్రారంభించాల‌ని మోదీ స‌ర్కార్ నిర్ణ‌యించింది.

హాజరై ఓటు వేసిన వారిలో 2/3 వంతుల మెజార్టీ ఎన్డీఏ స‌ర్కార్‌కు అవ‌స‌రం. దీంతో విప‌క్షాల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకునేందుకు బీజేపీ పెద్ద‌లు కృషి చేస్తున్నారు. మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు మిత్ర‌ప‌క్షాలైన టీడీపీ, జ‌న‌సేన అగ్ర‌నేత‌లు చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను వెంట‌నే ఢిల్లీకి రావాల‌ని బీజేపీ ముఖ్య నేత‌లు ఆహ్వానించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

దీంతో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఢిల్లీకి వెళ్ల‌డానికి రెడీ అవుతున్నారు. అయితే వీళ్లిద్ద‌రి జోక్యం పెరిగితే, ఆ రెండు పార్టీల‌ను తీవ్రంగా వ్య‌తిరేకించే రాజ‌కీయ పార్టీల నిర్ణ‌యంపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

గ‌తంలో కూడా ఇదే రీతిలో చంద్ర‌బాబుకు ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే బాధ్య‌త‌ల్ని కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్‌షా అప్ప‌గించిన‌ట్టు టీడీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున జ‌రిగింది. కానీ అలాంటిదేమీ జ‌రగ‌లేదు.

తాజాగా మ‌రోసారి చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఢిల్లీ వెళ్లి ఎవ‌రి మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతారో చూడాలి. సొంత రాష్ట్రంలోనే వారిని తీవ్రంగా వ్య‌తిరేకించే పార్టీలున్నాయి. అయితే చంద్ర‌బాబు రాజ‌కీయ అనుభ‌వాన్ని ఏ ర‌కంగా వినియోగించుకోవాల‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నారో ఒక‌ట్రెండు రోజుల్లో తేల‌నుంది.

One Reply to “ఢిల్లీకి బాబు, ప‌వ‌న్‌!”

Comments are closed.