మూవీ రివ్యూ: రామాయణ-పార్ట్ 1

గతంలో వచ్చిన రామాయణ చిత్రాల్లో ఇంత భారీ స్థాయిలో చూపించని ఎన్నో సన్నివేశాలను ఈ సినిమాలో అద్భుతంగా తెరకెక్కించారు.

సినిమా: రామాయణం పార్ట్ 1
రేటింగ్: 3/5
బ్యానర్: ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్
నటీనటులు: రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ డియోల్, లారా దత్తా, అరుణ్ గోవిల్, రవి దూబే, కాజల్ అగర్వాల్ తదితరులు
సంగీత దర్శకులు: ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్
ఛాయాగ్రహణం: పంకజ్ కుమార్, మనీష్ లిమాయే
ఎడిటర్: హుజేఫా లోఖండ్వాలా
నిర్మాతలు: నమిత్ మల్హోత్రా, యష్
రచన, దర్శకత్వం: నితేష్ తివారీ
విడుదల తేదీ: నవంబర్ 5, 2026

రామాయణం కథ గురించి కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు. అందరికీ తెలిసిందే. అయితే ఎవరు ఆ కథని ఎలా చెప్పారు?.. ఎవరు ఎలా నటించారు అనేదే పాయింట్. ఇప్పుడు నితీష్ తివారి చెప్పిన ఈ రామాయణం ఎంతవరకు మనసుకి హత్తుకుందో చూద్దాం.

ఈ పార్ట్ 1 లో టచ్ చేసిన కథ ఏంటంటే.. రావణుడు (యష్) తన తల్లి కైకసి (శోభన) ప్రోద్బలంతో తపస్సు చేసి బ్రహ్మ నుంచి వరం పొంది లంకకు రాజు అవుతాడు. ఆ వరం వల్ల దేవతలు, దైత్యులు, దివ్యశక్తులు అతడిని ఏమీ చేయలేవు. మరోవైపు, ఇంద్రుని ప్రార్ధనతో మహావిష్ణువు రాముడిగా (రణబీర్ కపూర్) జన్మిస్తాడు. స్వయంవరంలో సీత (సాయి పల్లవి) చేతిని గెలుచుకుని రాముడు ఆమెను పెళ్లి చేసుకుంటాడు.

కైకేయి కారణంగా రాముడు అయోధ్యను వదిలి వనవాసానికి వెళ్లాల్సి వస్తుంది. భరతుడు రాజు అవుతాడు. వనవాసంలో ఉన్నప్పుడు రావణుడి చెల్లెలు శూర్పణఖ రాముడిని చూసి మోహిస్తుంది. తనను రెండో భార్యగా చేసుకోమని రాముడిని అడుగుతుంది. కానీ రాముడు అందుకు ఒప్పుకోడు.

ఆ తర్వాత సీత రూపంలో రాముడి దగ్గరకు వచ్చిన శూర్పణఖపై కోపంతో లక్ష్మణుడు ఆమె ముక్కు కోస్తాడు. ఈ ఘటన చివరికి రావణుడు సీతను అపహరించడానికి దారి తీస్తుంది. సీతను లంక నుంచి తిరిగి తీసుకొస్తానని రాముడు ప్రతిజ్ఞ చేయడంతో మొదటి భాగం ముగుస్తుంది.

ఈ చిత్రంలో కొత్తగా ఉన్న అంశం రావణాసురుడి బ్యాక్ స్టోరీ. ప్రధాన రామాయణ కథల్లో కానీ, నాటకాల్లో కానీ, సినిమాల్లో కానీ ఈ టాపిక్ ని టచ్ చెయ్యలేదు. అయితే ఇక్కడ చెప్పిన రావణుడి బ్యాక్ స్టోరీలో శూర్పణఖ భర్త విద్యుజ్జిహ్వుడు ఉంటాడు. ఆ పాత్ర వాల్మీకి రామాయణంలో లేదు. తరవాత ఎప్పుడో వచ్చిన “ఆనంద రామాయణం” వంటి వాటిల్లో ఉంది. ఆ విద్యుత్ జిహ్వుడిని రావణుడు చంపడం వగైరా సీన్లు ఇందులో పెట్టారు. అలాగే శూర్పణఖ- రాముడు-సీత మధ్యన జరిగే సన్నివేశాలు కూడా కొత్తగా ఇంటర్ప్రిట్ చేసారా, లేక ఏ మారుమూల రామాయణం వెర్షన్ లో అయినా ఉన్నాయా అన్నది తెలీదు.

ఈ చిత్రం మేకింగ్ విషయంలో తీసుకున్న తెలివైన నిర్ణయాల్లో ఒకటి సినిమాను రావణుడి కథతో ప్రారంభించడం. మొదట్లో రావణుడు యుద్ధాలకంటే సంగీతంపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు. అయితే అసుర వంశానికి హీరోగా ఎదగాలని అతడి తల్లి ప్రోత్సహిస్తుంది. రావణుడి తపస్సు, బ్రహ్మ ఇచ్చిన వరాలు, చివరకు లంకకు రాజుగా ఎదిగిన తీరు సినిమాటిక్‌గా, ఆసక్తికరంగా చూపించారు. రాముడి జన్మను పరిచయం చేసే ముందు దాదాపు 45 నిమిషాల పాటు ఈ ఎపిసోడ్‌ను తెరకెక్కించడం బాగుంది.

తెలుగు డబ్బింగ్, సంభాషణలు బాగున్నాయి. ఏఐ సాయంతో లిప్ సింక్ సాధించడం మరో విశేషం.

రాముడి జననం నుంచి వనవాసం వరకు ఫస్ట్ హాఫ్‌లో కథ దాదాపుగా మనకు తెలిసిన విధంగానే సాగుతుంది. అయితే కొన్ని సన్నివేశాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ముఖ్యంగా రాముడు, పరశురాముడి మధ్య జరిగే సంఘర్షణ సినిమాకు ప్రధాన హైలైట్. పరశురాముడి పాత్రలో కూడా రణబీర్ కపూర్ కనిపిస్తాడు.

సెకండ్ హాఫ్ మరో రావణుడి ఎపిసోడ్‌తో ప్రారంభమవుతుంది. వివేక్ ఒబెరాయ్ పోషించిన విద్యుజ్జిహ్వుడుతో జరిగే ఘర్షణ ద్వారా రావణుడి అహంకారం, గర్వాన్ని చూపించారు. ఈ సన్నివేశాన్ని కూడా భారీ స్థాయిలో తెరకెక్కించారు.

ఈ భాగంలో యష్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

నటీనటుల విషయానికి వస్తే.. రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో ఆకట్టుకున్నాడు. రాముడికి ఉండాల్సిన పవిత్రత, ప్రశాంతతను తన నటనలో చక్కగా చూపించాడు.

సాయి పల్లవి సీతగా హుందాగా ఉంది. కథ వనవాసం వైపు సాగేకొద్దీ ఆమె నటన, పాత్రలోని బలం స్పష్టంగా కనిపిస్తాయి.

అయితే, ఈ పార్ట్ ఎక్కువగా రావణుడి చుట్టూనే తిరుగుతుంది. రావణుడి కథతో మొదలై, అతడు సీతను అపహరించడంతో ముగుస్తుంది. యష్ కేవలం రావణుడిగా కనిపించడమే కాకుండా, అతడి జీవితంలోని వివిధ దశలకు తగ్గట్టుగా భిన్నమైన లుక్స్, గెటప్స్‌లో కనిపిస్తాడు. దాదాపు గంటసేపు రావణుడి కథకే ప్రత్యేకంగా కేటాయించారు.

లక్ష్మణుడిగా రవి దూబే ఓకే. శూర్పణఖ పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ బాగా సరిపోయింది. తెర మీద గ్లామరస్ గా కనిపించింది శూర్పణఖే. రావణుడి తల్లిగా శోభన నిండుగా ఉంది.

సాంకేతిక అంశాల విషయనికొస్తే .. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన బలంగా నిలిచాయి. హాలీవుడ్‌కు చెందిన సంస్థ వీఎఫ్ఎక్స్ బాధ్యతలు చేపట్టగా, అక్కడక్కడ వీక్ గా ఉన్నా ఓవరాల్ గా ఫలితాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రత్యేకించి 3డిలో చిత్రం మరింత బాగుంది. ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు గ్రాండియర్‌ను తీసుకొచ్చాయి.

అయితే, సంగీతం మాత్రం అంతగా ప్రభావం చూపించలేకపోయింది. ఏఆర్ రెహమాన్ ఈ పార్ట్ కి పెద్దగా న్యాయం చేయలేకపోయాడు. పాటలు ఉన్నట్టే అనిపించదు. ఉన్నా అస్సలు హాంట్ చేయవు. బలహీనమైన ట్యూన్స్, లిరిక్స్. హన్స్ జిమ్మర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది.

కొన్ని చిన్న చిన్న పంటి కింది రాళ్లు కూడా చెప్పుకుందాం.

– సినిమా మొదలయ్యే ముందు వచ్చిన డిస్క్లైమర్ లోనే ఏదో తేడా ఉంది. రామాయణం మీద నమ్మకంతో కాక కేవలం చెలమాణీలో ఉన్న కథల్ని బేస్ చేసుకుని చెప్పామంతే, ఇది చరిత్ర అని చెప్పట్లేదు..కేవలం ఆదర్శాలపై ఫోకస్ చేసాం..అనే సెన్స్ లో సాగింది ఆ డిస్క్లైమర్. లీగల్ గా ఏ అవసరం ఉండి ఆ డిస్క్లైమర్ రాసుకున్నారో తెలీదు. రామాయణం అనేది ఒక ఎమోషన్. అది భారతీయుల డీ.ఎన్.ఎ లో కలిసిపోయి ఉంది. ఇది జరిగిన కథ కాదు అని ఎవరు ఎన్ని సాక్ష్యాలు చెప్పినా, ..మనసు మాత్రం నమ్మదు చాలా మందికి. అలాంటప్పుడు, “వన్సపాన్ ఏ టైం..” అంటూ “ఇతిహాసం” పద్ధతిలో కాకుండా ఏదో కల్పిత కథ అన్నట్టుగా మొదలుపెట్టారు.

– రావణుడు ఇంద్రుడిపై దండెత్తడాన్ని హీరోయిక్ గా చూపించడం జరిగింది. ఏ కథలోనైనా విలన్ మీద కోపం కలగాలి. అలా కాకుండా అతను చేసే ప్రతి పనికి ఒక జస్టిఫికేషన్ ఇస్తూ, ఆ పాత్ర పొషించిన యష్ ఇమేజ్ ని కాపాడేలా తెరకెక్కించినట్టు ఉంది.

– శూర్పణఖకి ముక్కు చెవులు కోయడమనేది పాపులర్ ఎపిసోడ్. అయితే ఇందులో ముక్కు మీద కత్తి గాటు పడిందంతే. దానికి సీత ఫెమినిస్ట్ లా మారి “స్త్రీ రూపాన్ని వికృతం చేసే అధికారం ఎవ్వరికీ లేదు” అంటూ లక్ష్మణుడిని మందలిస్తుంది. ఇది కూడా ఏదో ఒక రామాయణంలో ఉండే ఉంటుందిలే అనుకుని చూసేయాలి… నేటి కాలానికి అవసరమయ్యే ఆదర్శం కనుక!

– వాల్మీకి ప్రకారం సీత యోధురాలేమీ కాదు. కానీ ఇందులో ఖర దూషణాదుల యుద్ధంలో కత్తి పట్టి యుద్ధం చేసేస్తుంది. ఇలా సీత యోధురాలు అన్న పాయింట్ ని అమీష్ త్రిపాఠి ఈ మధ్యన రాసిన “సిత:వారియర్” నుంచి తీసుకున్నట్టుంది.

– విశ్వామిత్రుడు “బల-అతిబల” విద్యల గురించి రామలక్ష్మణులకు చెప్పిన సీన్ లేదు.

– రాముడు మానవుడు. కానీ కొండలు దూకేస్తూ, చెట్లు ఎక్కేస్తూ, గ్రద్ద కాలు పట్టుని వేలాడుతూ ఆకాశంలో ఎగిరేస్తూ..చిత్ర విచిత్ర వానర విన్యాసాలు చేయించేసాడు దర్శకుడు.

ఈ చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, ‘రామాయణం పార్ట్ 1’ ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ అనుభూతిని అందిస్తుంది.

మొత్తంగా చెప్పాలంటే, ‘రామాయణం పార్ట్ 1’ విజువల్‌గా బాగుంది. 3డిలో చూడగలిగితే మంచి అనుభూతి అందుతుంది. గతంలో వచ్చిన రామాయణ చిత్రాల్లో ఇంత భారీ స్థాయిలో చూపించని ఎన్నో సన్నివేశాలను ఈ సినిమాలో అద్భుతంగా తెరకెక్కించారు. ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేసే కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. రామాయణం వంటి పవిత్రమైన ఇతిహాసానికి అవసరమైన భారీ విజువల్ స్కేల్‌ను నితేష్ తివారీ, నమిత్ మల్హోత్రా కలిసి తెరపై ఆవిష్కరించారు.

భారతదేశంలో అత్యంత పవిత్రమైన ఇతిహాసమైన రామాయణాన్ని ఇంతకుముందెన్నడూ చూడని స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించే సాహసోపేతమైన ప్రయత్నాన్ని అభినందించాలి. ఇందులో తప్పుప్పులు ఉన్నా, కొన్ని సమంజసంగా అనిపించపోయినా రామాయణం పై చర్చ, ప్రశ్నలు, సమాధానాలు ఉత్పన్నం కావడం కూడా మంచిదే. ఏ పాత్ర గౌరవాన్ని తగ్గించకుండా, మేకింగ్ స్టైల్లో మాత్రం జెన్-జీ ఆడియన్స్ ని ఆకట్టుకునే పద్ధతులు అవలంబించారు.

ఇప్పుడు ఒక్కటే మైనస్. రెండవ భాగం చూడ్డానికి రెండేళ్లు ఆగాలి. 2027 దీపావళికి అని అనుకున్నదే “టూ లాంగ్” అనుకుంటే, 2028కి గానీ రాదని టాక్. హనుమాన్-సాక్షాత్కారం రెండవ పార్టులోనే. అంతవరకు రామయణాభిమానులు రామనామం జపిస్తూ కూర్చోవాలి.

బాటం లైన్: జై శ్రీ రాం

22 Replies to “మూవీ రివ్యూ: రామాయణ-పార్ట్ 1”

    1. యాక్టర్స్ మాత్రం ‘ఆదిపురుష్’ కన్నా వరస్ట్ 😂ఒక్క యాష్, గ్రూవర్ వంటి ఒక ఇద్దరు ముగ్గురు తప్ప.

  1. ఇతిహసం లో లేనివి సినిమా లో పెట్టి దేవుడి కధ లో పైత్యం చూపి అదే క్రియేటివిటీ అనుకుంటే ఫలితం ఎలాగూ చవి చూస్తారు లే.

  2. ARR music is a big minus. I dont know why bollywood directors/producers go behind him for even the Hindu religious epics. He belongs to another faith and he cannot understand the essence of Hindu religious epics like Ramayana. 

  3. ఏ  హాలీవుడ్ సినిమాకీ  తీసిపోని,

    టాప్ రేంజ్ గ్రాఫిక్స్ ఇండియన్ “అవతార్” ఈ రామాయణ.

    ఈ కాలం పిల్లలకు చూపించండి…  వాళ్లు ఇష్టపడే గ్రాఫిక్స్‌తో చాలా బాగుంది… వాళ్లకు మన సాంస్కృతిక ఇతిహాసం  పరిచయం చేయండి… అదీ గ్రాండ్‌గా… ఇది ఆదిపురుష్ వంటి పరమనాసిరకం కాదు… 

  4. జ్ఞాన కాంతిలో మెరిసి పక్వానికి వచ్చిన తెలివిడి భక్తి అయితే ఆ రెండు లోపించించిది ఈ సినిమా

    ..

    Ray of knowledge and matured intelligence securely locks in mind its called bhakthi. If was lacked and this ramayana happeneD

    ..

    now realize why lavakusa and sampoorna ramayanam are classics

  5. Ee review lo ekkada HANUMANTHUDI Patra ledu oho ante ide hanuma leni ramayana 

    Ramayanam ante VFX Yuddalu kadu ramudu ki seetha ki vunna prema mariyu ramudi ki hanumanthudi ki bakthi parayanam Ramayanam ante BHAKTHI . Aa bhakti lenapudu enni unna weast .ayithe theater lone kadu OTT lo kuda chudalsina avasaram ledu.

    Ja

    Om sri Banumathi namha

  6. ఎంత గట్టిగా అరుస్తే, ఎంత ఎక్కువగా ఓవర్ యాక్టింగ్ చేస్తే అంత గొప్ప నటుడివని అనుకుంటారు

  7. మన పిల్లలకు చూపించాల్సిన చిత్రం , ఈ తరం లో సాంకేతికతను ఉపయోగించుకొని చాలా చక్కగా చిత్రీకరించారు 

Comments are closed.