బాలీవుడ్‌లో నెపొటిజం గురించి స్టార్ కిడ్స్ ఎప్పుడూ ఏదో ఒక సందర్భంలో స్పందిస్తూనే ఉంటారు.
తాజాగా ప్రముఖ నటి సారా అలీ ఖాన్ కూడా దీనిపై స్పందించింది. కాకపోతే ఆమె స్పందన చాలా కొత్తగా ఉంది.
ఓ స్టార్‌కు కూతురుగా పుట్టడం తన చేతిలో లేదంటోంది సారా అలీఖాన్.
సైఫ్ అలీఖాన్‌కు కూతురిగా పుట్టడం తన అదృష్టమని, అదే టైమ్ లో తను సైఫ్‌కు కూతురిగా పుట్టడం తన చేతిలో లేనప్పుడు, నెపొటిజం పేరిట తనను ట్రోల్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తోంది
సినిమా కుటుంబం నుంచి రావడం వల్ల తనకు ఇండస్ట్రీలో ఈజీగానే అవకాశాలు వచ్చాయని ఒప్పుకున్న ఆమె, అదే సమయంలో నెపొటిజం అనే పదం తన కష్టాన్ని నీరుగారుస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.
షర్మిలా టాగోర్ మనవరాలుగా, సైఫ్ అలీ ఖాన్ కుమార్తెగా సారా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అయితే తన కుటుంబ నేపథ్యం తనకు ఎంత ప్లస్ అయిందో, అంతే మైనస్ కూడా అయిందంటూ నిట్టూర్చింది.
“నేనేమీ అమాయకురాలిని కాదు, అవకాశాలు అందుకోవడంలో, తక్కువ సమయంలో క్రేజ్ తెచ్చుకోవడంలో నా ఫ్యామిలీ లెగసీ నాకు ఉపయోగపడిందని అంగీకరిస్తాను” అని స్పష్టం చేసింది.
అయితే, ఎనిమిదేళ్ల తన సినీ ప్రయాణం తర్వాత కూడా ప్రతిసారీ నెపొటిజం గురించి వివరణ ఇస్తూనే ఉండాల్సి రావడం పట్ల ఆమె అసంతృప్తి వెళ్లగక్కింది.
ఎవరికి పుట్టాలనేది తాను ఎంచుకోలేదని, కేవలం అదృష్టం కొద్దీ ఆ కుటుంబాల్లో పుట్టామని అంటోంది సారా.
తన కెరీర్ వెనుక ఎలాంటి గాడ్‌ఫాదర్ల అండదండలు లేవంటోంది సారా. తల్లి అమృత సింగ్ వద్దే పెరిగిన తాను, సినిమాల కోసం ఏనాడూ తండ్రి వద్దకు వెళ్లలేదని, దర్శక-నిర్మాతలను బతిమాలాడలేదని అంటోంది.
తొలి సినిమా ‘కేదార్‌నాథ్’ సమయంలో ఎదురైన ఇబ్బందులను సైతం తనే స్వయంగా ఎదుర్కొన్నానని, ఇండస్ట్రీలో తనకు ఎలాంటి ప్రొటెక్షన్ లేదని అంటోంది సారా.
