అందరూ ఊహించినట్టుగానే ఆదర్శ కుటుంబం సినిమాను 30వ తేదీన విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీంతో కొన్ని సినిమాల పరిస్థితి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది.
కేవలం ఈ సినిమాకు దారివ్వడం కోసం గతంలో ఇట్లు అర్జున అనే సినిమాను స్వచ్ఛందంగా వాయిదా వేశారు. కట్ చేస్తే, వీళ్లు ఫిక్స్ చేసుకున్న తేదీకే తిరిగి ఆదర్శ కుటుంబం కూడా వస్తోంది.
ఈసారి ఇట్లు అర్జున సినిమాను వాయిదా వేసే ప్రసక్తి లేదని స్వయంగా నాగార్జున వెల్లడించారు. ఇప్పటికే యూనిట్ అంతా చాలా పెయిన్ తీసుకుందని, మరోసారి వాయిదా వేయడం కరెక్ట్ కాదంటూ కాస్త గట్టిగానే స్పందించారు. సో.. ఆదర్శ కుటుంబం వచ్చినా ఇట్లు అర్జున వాయిదా పడదు.
ఇక అందరి చూపు కల్ట్ సినిమాపైనే ఉంది. ఈ సినిమా విశ్వక్ సేన్ కు చాలా కీలకం. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న ఈ హీరో, స్వీయ దర్శకత్వంలో, ఎంతో నమ్మకంతో, మరెంతో ఆశతో కల్ట్ చేశాడు.
ఇప్పుడీ సినిమాకు ఆదర్శ కుటుంబం పోటీగా మారింది. సో.. వెంకీ సినిమాకు పోటీగా తన కల్ట్ను బరిలోకి దించుతాడా లేక వాయిదా వేస్తాడా అనేది చూడాలి.
ఒకవేళ, విశ్వక్ తన సినిమాను వాయిదా వేస్తే, రాబోయే రోజుల్లో కల్ట్కు, విశ్వక్ సినిమాలే పోటీగా నిలిచే పరిస్థితి ఉంది. జస్ట్ వారాల గ్యాప్లోనే ఈఎన్ఈ రిపీట్, లెగసీ చిత్రాలు వస్తున్నాయి.
వీటితో పాటు కిల్లర్, సమ్మర్ హాలిడేస్ లాంటి మరో 2 చిత్రాలు కూడా 30కి షెడ్యూల్ అయి ఉన్నాయి. ఇలా వెంకీ సినిమా రాకతో ఈ సినిమాల రిలీజెస్ అన్నీ డైలమాలో పడ్డాయి.
లెక్కప్రకారం రెండో తేదీకి రావాలి ఆదర్శ కుటుంబం. ఆ తర్వాత 9కి మార్చారు. ఆ తేదీకి కూడా సినిమా రాలేదు. తాజాగా 30వ తేదీ ప్రకటించారు. ఈసారి సినిమా రావడం పక్కా అంటున్నాడు నిర్మాత నాగవంశీ.
