ఏఐ గ్రాఫిక్స్ తో ఇప్పుడు చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి. అలాంటి సినిమాలతో ఓటీటీలకు ఎలాంటి ఇబ్బంది లేదు. మరి పూర్తిగా ఏఐతో తెరకెక్కిన సినిమాల సంగతేంటి? అలాంటి సినిమాలు తీసుకోవాలా వద్దా? ప్రస్తుతం ఇదే సందిగ్దంలో పడ్డాయి కొన్ని ఓటీటీ సంస్థలు.
అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏఐని ఉపయోగించి ఏకంగా సినిమాలే తీస్తున్నారు కొంతమంది. ఇందులో హీరో, హీరోయిన్ తో పాటు అన్ని పాత్రలూ ఉంటాయి. కాకపోతే అవి నిజమైన పాత్రలు కావు. అన్నీ ఏఐ క్యారెక్టర్స్ అన్నమాట.
మనం రాసుకున్న కథ, స్క్రీన్ ప్లేకు తగ్గట్టు.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టూల్స్ దృశ్యాల్ని జనరేట్ చేసి ఇస్తాయి. వాటిని కావాలంటే మాన్యువల్ గా ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే అదే ఎడిటింగ్ కూడా చేసి ఇస్తుంది. కావాలంటే దానికి మ్యూజిక్, రీ-రికార్డింగ్ కూడా ఏఐతోనే పూర్తిచేయొచ్చు.
అలా పూర్తిస్థాయిలో ఏఐని వాడుకొని కొన్ని సినిమాలు తెరకెక్కుతుంటే, మరికొన్ని ఏఐ సినిమాలకు మాన్యువల్‌గా రీ-రికార్డింగ్, ఎడిటింగ్ చేయిస్తున్నారు.
మరి ఇలాంటి సినిమాల్ని ఓటీటీ సంస్థలు తీసుకుంటాయా? పూర్తిగా ఏఐతో తెరకెక్కిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి.. కానీ తెలుగు ఏఐ సినిమాల్ని ఇప్పటివరకు ఏ సంస్థ తీసుకోలేదు.
ఇలాంటి సినిమాల థియేట్రికల్ రిలీజ్ కు ఎలాంటి ఇబ్బందుల్లేవు. బయ్యర్లతో మాట్లాడుకొని, పర్సంటేజీ సిస్టమ్ కింద హ్యాపీగా విడుదల చేసుకోవచ్చు. డబ్బులు ఖర్చుపెట్టి ప్రచారం చేసుకోవచ్చు. నచ్చితే జనం చూస్తారు, లేదంటే లేదు. కానీ ఓటీటీ సంస్థలు ఇలాంటి సినిమాల్ని తీసుకుంటాయో లేదో చూడాలి.
