సెన్సార్ రూల్స్ మారాయి. ఒకప్పట్లా ఆఖరి నిమిషంలో సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడం కుదరదు. ఇలా సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొన్ని ఇప్పటికే కొన్ని సినిమాలు వాయిదా పడుతున్నాయి కూడా. మరి దాదా పరిస్థితేంటి?
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న దాదా సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా షూటింగ్ లో తీవ్రంగా గాయపడిన బాలయ్య, అనుకున్న టైమ్ కంటే ముందే సెట్స్ పైకి వచ్చారు. అన్ని విధాలుగా షూటింగ్ కు సహకరిస్తున్నారు. కానీ సెన్సార్ టైమ్ కు ఫస్ట్ కాపీ రెడీ అవుతుందా అనే అనుమానాలున్నాయి.
సెన్సార్ నియమాల ప్రకారం సర్టిఫికేషన్ ప్రక్రియకు 48 రోజులు టైమ్ తీసుకునే హక్కు సెన్సార్ బోర్డుకు ఉంది. కానీ అధికారులు అంత టైమ్ తీసుకోరు. సగటున 18 రోజుల్లోనే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నారు. ఆ టైమ్ అయినా దాదాకు దొరుకుతుందా అనేది డౌట్.
ఇవాళ్టి నుంచి ఈ సినిమా క్లయిమాక్స్ పార్ట్ షూటింగ్ మొదలుపెట్టారు. వారం రోజుల్లో ఈ షెడ్యూల్ పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే, డిసెంబర్ 1 నాటికి సాంగ్ మినహా టోటల్ షూటింగ్ పూర్తవుతుంది.
డిసెంబర్ 24కి ఈ సినిమాను విడుదల చేయాలంటే, కనీసం డిసెంబర్ 10 నాటికి ఫస్ట్ కాపీ సిద్ధం చేసి సెన్సార్ కు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ డెడ్ లైన్స్ అందుకోవడానికి యూనిట్ రాత్రిపగలు కష్టపడుతోంది. ఎలాగైనా క్రిస్మస్ బరిలో దాదాను దించాలని గట్టిగా ఫిక్స్ అయింది.
బాలకృష్ణ, కాజల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకుడు. సముద్రఖని, మంచు మనోజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు.
