న‌ర్సీప‌ట్నంలో జ‌న‌సేన‌కు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న టీడీపీ

టీడీపీ నుంచి ప‌ద‌వులు తీసుకోవ‌డం ఎంత క‌ష్ట‌మో జ‌న‌సేన‌కు ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతోంది.

టీడీపీ నుంచి ప‌ద‌వులు తీసుకోవ‌డం ఎంత క‌ష్ట‌మో జ‌న‌సేన‌కు ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతోంది. మ‌రీ ముఖ్యంగా డిమాండ్ చేస్తే అస‌లు ప‌ద‌వులు రావ‌ని, వేడుకుంటేనే టీడీపీ నేత‌లు ద‌య‌చూపుతార‌ని జ‌న‌సేన‌కు జ్ఞానోద‌యం అవుతోంది.

ఎదురు తిరిగితే, అస‌లుకే ఎస‌రు పెడ‌తార‌ని జ‌న‌సేన‌కు అనుభ‌వ‌మ‌వుతోంది. ఇందుకు ఉమ్మ‌డి విశాఖ జిల్లా న‌ర్సీప‌ట్నం మున్సిపాలిటీలో వైస్ చైర్మ‌న్ ప‌ద‌వే నిద‌ర్శ‌నం.

న‌ర్సీప‌ట్నం మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్‌గా స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడి స‌తీమ‌ణి పద్మావ‌తి ఎన్నిక‌య్యారు. అయితే ఈ ప‌ద‌విని జ‌న‌సేన మొద‌ట్లో ఆశించింది. అందుకే ముందూవెనుకా ఆలోచించ‌కుండా జ‌న‌సేన నాయ‌కురాలు అద్దేప‌ల్లి సౌజ‌న్య నామినేష‌న్ వేశారు.

అయితే కూట‌మి పెద్ద‌లు జోక్యం చేసుకుని ఆమెను పోటీ నుంచి విర‌మింప‌జేశారు. దీంతో న‌ర్సీప‌ట్నం మున్సిపాలిటీలో 13వ వార్డు నుంచి అద్దేప‌ల్లి సౌజ‌న్య పోటీ చేసి గెలిచారు. ఇంత వ‌ర‌కూ అంతా బాగుంది.

మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక వ‌చ్చే స‌రికి, జ‌న‌సేన‌పై చింత‌కాయ‌ల విజ‌య్ కుటుంబం ఎంత ఆగ్ర‌హంగా వుందో తెలిసొచ్చింది. త‌మ‌నే వ్య‌తిరేకించేలా ప్ర‌వ‌ర్తించిన సౌజ‌న్య‌కు మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వ‌డానికి టీడీపీ సుముఖంగా లేదు. మ‌రోవైపు త‌మ పార్టీ మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ అభ్య‌ర్థిగా అద్దేప‌ల్లి సౌజ‌న్య పేరును జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఖ‌రారు చేశారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిర్ణ‌యించినంత మాత్రాన అంతా అయిపోద‌ని న‌ర్సీప‌ట్నం టీడీపీ ముఖ్య నేత‌లైన చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు, ఆయ‌న కుమారుడైన రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య్ త‌మ చ‌ర్య‌ల ద్వారా చెప్ప‌క‌నే చెప్పారు.

పాల‌క మండ‌లి కొలువైన 23వ తేదీన వైస్ చైర్మ‌న్‌ను కూడా ఎన్నుకోవాల్సి వుండింది. అయితే బీ ఫామ్ రావ‌డానికి ఆల‌స్య‌మైంద‌నే సాకుతో ఎన్నిక‌ను వాయిదా వేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా వాయిదా ప‌డిన వాటికి తిరిగి ఇవాళ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఎస్ఈసీ నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా జ‌న‌సేన ముగ్గురు కౌన్సిల‌ర్లు ఇవాళ స‌మావేశానికి వెళ్లారు. కానీ టీడీపీ కౌన్సిల‌ర్లు ఎన్నిక‌కు డుమ్మా కొట్టారు. దీంతో జ‌న‌సేన‌కు తీవ్ర నిరాశే మిగిలింది.

టీడీపీ తీరు చూస్తుంటే, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సౌజ‌న్య‌ను వైస్ చైర్మ‌న్‌గా ఎన్నుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. మూడు చెరువుల నీళ్లు తాగించ‌డం అనే సామెత‌ను జ‌న‌సేన‌కు టీడీపీ అనుభ‌వంలోకి తెచ్చింద‌నే మాట వినిపిస్తోంది.

5 Replies to “న‌ర్సీప‌ట్నంలో జ‌న‌సేన‌కు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న టీడీపీ”

  1. ఆనం ఆల్రెడీ తాగాడు నెల్లూరు లో… చింతకాయల కూడా తాగుతాడు నర్సీపట్నం లో… లేదంటే నీ సైట్ చూడనంతే

Comments are closed.