బత్తా.. ఇంటి భోజనం లాంటి సినిమా!

వరుస సినిమాలు చేస్తున్నా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న విజయ్ సేతుపతి, ‘బత్తా’తో మళ్లీ తన మార్క్ చూపించాడు.

వరుస సినిమాలు చేస్తున్నా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న విజయ్ సేతుపతి, ‘బత్తా’తో మళ్లీ తన మార్క్ చూపించాడు. ‘నడువుల కొంజం పక్కత్త కానోమ్’, ‘సీతకాతి’ సినిమాల దర్శకుడు బాలాజీ తరణీధరన్‌తో అతనికి ఇది మూడో సినిమా.

విజయ్ సేతుపతి టామ్ క్రూజ్ లాంటి హీరో కాదు, టామ్ హ్యాంక్స్ లాంటి నటుడు అని దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ మాటకు తగ్గట్టే ఈ సినిమాలో అతను యాక్షన్ హీరోలా కాకుండా, ఒక సాధారణ మనిషిలా కనిపిస్తాడు. అట్లీ సమర్పణలో వచ్చిన ఈ తమిళ సినిమా ఇప్పుడు తెలుగు అనువాదంతో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన రోజు నుంచే తెలుగు సోషల్ మీడియాలో ‘బత్తా’ గురించి పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. కొందరు దీన్ని ‘ఆల్ టైమ్ క్లాసిక్’ అని పొగిడేస్తున్నారు. నిజమే, సినిమా బాగుంది. కానీ ఆ స్థాయి పొగడ్తలకు కారణం సినిమా ఒక్కటే కాదు.

పెద్ద హీరోల ఎలివేషన్లు, పాన్ ఇండియా హంగామాలు, వందల కోట్ల బడ్జెట్ల మధ్య మనసును తాకే చిన్న కథలు తెలుగులో దాదాపు కరువైపోయాయి. అలాంటి కరువులో ఉన్న తెలుగు ప్రేక్షకులకు ఒక నిజాయితీ ఉన్న కథ, సహజమైన పాత్రలు కనిపిస్తే అది అద్భుతంగా అనిపించడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఆకలితో ఉన్నవాడికి ఇంటి భోజనం కూడా విందులానే ఉంటుంది.

కథలోకి వెళ్తే.. 1986 నాటి ఉత్తర మద్రాసు. బత్తా పేరు చెబితే ఆ ప్రాంతమంతా వణికిపోతుంది. గొడవలు, సారా వ్యాపారం, మాటకు ముందు బెదిరింపు.. ఇదే అతని జీవితం.

క్వార్టర్లీ సెలవుల్లో స్కూల్ మూసి ఉన్నప్పుడు, టీచర్ తీసేసుకున్న తన బొమ్మ కోసం ఎనిమిదేళ్ల శబరి స్కూల్‌కి వెళ్తాడు. అదే సమయంలో అక్కడే ఉన్న బత్తా బాత్‌రూమ్‌లోకి వెళ్తే, శబరి తెలియకుండానే బయటి నుంచి గడియ పెట్టేస్తాడు. లోపలి నుంచి వినిపించే అరుపులు, బెదిరింపులకు భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు.

ఖాళీ స్కూల్లో, తాళం వేసిన బాత్‌రూమ్‌లో బత్తా ఎనిమిది రోజులు చిక్కుకుపోతాడు. అసలు మూసి ఉన్న స్కూల్‌కి బత్తా ఎందుకొచ్చాడు, ఆ ఎనిమిది రోజుల్లో అతనిలో వచ్చిన మార్పు ఏంటి, భయపడి పారిపోయిన ఆ పిల్లాడితో అతని బంధం ఎలా మారింది అనేదే మిగతా కథ.

ఈ సినిమాలో నచ్చేది దాని సింప్లిసిటీ. ఎనభైల నాటి వాతావరణం, పాత స్కూళ్లు, క్వార్టర్లీ సెలవులు, బొమ్మల కోసం పడే ఆరాటం.. ఇవన్నీ ఒక తరం ప్రేక్షకులకు తమ బాల్యాన్ని గుర్తుచేస్తాయి. అందరూ భయపడే ఒక పెద్ద మనిషి, ఒక చిన్న పిల్లాడి ముందు నిస్సహాయంగా మారిపోవడం అనే ఆలోచనలోనే ఒక అమాయకత్వం ఉంది. హీరో అందరినీ కొట్టి గెలవడం కాదు, ఒక గోడల మధ్య చిక్కుకుని తనను తాను తెలుసుకోవడం ఇక్కడ కథ. మన సినిమాల్లో ఇలాంటి హీరోను చూసి చాలా కాలమైంది.

బత్తా పాత్రలో విజయ్ సేతుపతి సహజంగా ఒదిగిపోయాడు. రౌడీ పొగరు, ఆ తర్వాత బయటపడే నిస్సహాయత రెండింటినీ బాగా పలికించాడు. బాత్‌రూమ్ గోడల మధ్య ఒంటరిగా తనతో తానే మాట్లాడుకునే సన్నివేశాల్లో అతని నటన బాగుంది. అయితే కరుకు బయట, మెత్తని లోపల లాంటి పాత్రల్లో అతన్ని ఇప్పటికే చూశాం కాబట్టి, ఆశ్చర్యపరిచే కొత్తదనం మాత్రం లేదు. శబరిగా సాయి పృథ్విరాజ్ సినిమాకు అసలు బలం. భయం, అపరాధ భావం, అమాయకత్వం అన్నీ ఆ పిల్లాడి కళ్లలో కనిపిస్తాయి. లిజోమోల్ జోస్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు.

మొదటి భాగం సాధారణ గ్యాంగ్‌స్టర్ సినిమాలా సాగుతుంది. బత్తా రౌడీయిజాన్ని చూపించడానికి దర్శకుడు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. బత్తా బాత్‌రూమ్‌లో చిక్కుకున్నాకే కథ ఊపందుకుంటుంది. ఆకలి, దాహం, ఎవరైనా వస్తారేమో అనే ఆశ.. ఇవన్నీ బత్తాను మెల్లగా మార్చే తీరు బాగుంది. అక్కడ కొన్ని నవ్వించే, కదిలించే సన్నివేశాలు బాగా పండాయి. కానీ ఒకే చోట కథ ఎక్కువసేపు తిరగడంతో ద్వితీయార్థంలో వేగం తగ్గుతుంది. ‘రౌడీలో మార్పు’ అనే కథ చివరికి ఎటు వెళ్తుందో ముందే ఊహించేయొచ్చు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా కాస్త సాగదీసినట్టు అనిపిస్తాయి.

దర్శకుడు బాలాజీ తరణీధరన్ మొదటి సినిమా ‘నడువుల కొంజం పక్కత్త కానోమ్’లో ఒక చిన్న సంఘటన చుట్టూ ఎంత బిగువుగా కథ నడిపించాడో గుర్తున్నవాళ్లకు, ‘బత్తా’ ఆ స్థాయిని పూర్తిగా అందుకోలేదనే అనిపిస్తుంది. ఆలోచన ఉంది, హృదయం ఉంది. రచనలో మాత్రం ఇంకాస్త పదును ఉండాల్సింది.

మొత్తంగా ‘బత్తా’ ఒక మంచి సినిమా. కానీ సోషల్ మీడియాలో వినిపిస్తున్నంత ‘ఆల్ టైమ్ క్లాసిక్’ కాదు. ఆ పొగడ్తలు సినిమా గొప్పతనం కంటే, మంచి కథల కోసం తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఆకలిని ఎక్కువగా చెబుతున్నాయి.

13 Replies to “బత్తా.. ఇంటి భోజనం లాంటి సినిమా!”

  1. All time classic కాదు అని మీరెలా డిసైడ్ చేస్తున్నారు. అందరూ క్లాసిక్ అంటుంటే కాదని మీరు అనడానికి మీకున్న అర్హత ఏమిటి? రచనలో పదును ఉండాలి… అని అన్నారు. అలా మీరన్న పదును లేకపోతే చూసిన ప్రేక్షకులకు ఎందుకు నచ్చుతుంది? కాబట్టి మీ అభిప్రాయం సినిమా స్థాయిని తగ్గించేదిగా ఉండకూడదు. ఇంతకు ఈ వ్యాసం రాసిన విశ్లేషకుడు అర్హత ఏమిటో చదువుతున్న పాఠకుడిగా నాకు తెలియదు. 

  2. అద్భుతమైన సినిమా.. ఇలాంటి కథ వస్తుంది అని ఎప్పుడు అనుకోలేదు.. ఇంత గొప్ప కథను వ్రాసిన  తమిళులకు వందనాలు. ప్రధాన బలం చిన్నపిల్లవాడి నటన . ఎంత బాగా నటించాడు. విజయ్ సేతుపతి చివరి సీన్లో గాయకుడిగా వంద నంది పురస్కారాలు అందుకునేంతగా నటించాడు. కళ్ళల్లో నీళ్లు తిరగని వారు ఉండరు. సాహో తమిళ సినిమా. కొందరైనా తెలుగు రచయితలు ఇటువంటి అద్భుతమైన కథలను రాస్తారని ఆశిద్దాం

  3. సోది సినిమా, ఆ పిల్లవాడి అద్భుతమైన పెర్ఫార్మన్స్ తప్ప సినిమాలో కథా కాకరకాయ ఏమి లేదు.

    విక్రమ్ వేధా, మహారాజ, పిజా సినిమాల ముందు ఇది ఎందుకూ పనికి రాదు.

Comments are closed.