ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందింది. ఈ ఓటమి నుంచి జగన్ ఇంకా తేరుకోలేదు. కానీ జగన్ ఘోర ఓటమి నుంచి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుణపాఠం నేర్చుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఆయన పార్టీ కేడర్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. భవిష్యత్‌లోనూ వారికి గుర్తింపు, గౌరవం ఇచ్చేలా మసలుకుంటామని ఆయన చెబుతున్నారు. అంతేకాదు, తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా పార్టీని కేడర్‌ను విస్మరించొద్దని దిశానిర్దేశం చేశారు.
జిల్లాల పర్యటనల్లో తాను పార్టీ కార్యాలయాలకు వెళ్లి, కార్యకర్తలు, నాయకులతో తప్పనిసరిగా మాట్లాడ్తానని ఆయన చెప్పారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా ఆయన మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. కార్యకర్తలు, నాయకులతో సంతోషాన్ని పంచుకున్నారు. నామినేటెడ్ పదవుల పంపకాల్లో కష్టపడిన వారికి గుర్తింపు వుంటుందని ఆయన చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎవరేం చేశారో వివరాలు తెప్పించుకుంటానని ఆయన తెలిపారు.
ఇవాళ కూటమి కనీవినీ ఎరుగని రీతిలో సీట్లను దక్కించుకోడానికి ప్రధాన కారణం… కార్యకర్తల శ్రమే అని ఆయన గుర్తు చేశారు. ప్రతి మాటలోనూ కార్యకర్తలే కీలకం అని చంద్రబాబు చెప్పడం వెనుక బలమైన కారణం లేకపోలేదు. గత ఐదేళ్లలో వైసీపీ కేడర్‌ను ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తిగా విస్మరించారు. వారిని పలకరించిన దిక్కులేదు. వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి, తమకు విలువ లేకుండా చేశారని పార్టీ కార్యకర్తలు, నాయకులు పలు సందర్భాల్లో మండిపడ్డారు.
జగన్‌ను సీఎం చేసుకోడానికి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నామని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరూ తమను పట్టించుకోలేదని వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఆవేదన చెందారు. కార్యకర్తలు, నాయకుల సహాయ నిరాకరణ వల్లే ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందింది. ఇలాంటి తప్పు తాము చేయకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే కేడర్‌కు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు.
పాలనలో పూర్తిగా నిమగ్నమైన తర్వాత చంద్రబాబు ఏ మేరకు కేడర్‌ను సంతృప్తిపరుస్తారో చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే కార్యకర్తలే తమ మొదటి ప్రాధాన్యత అనే సంకేతాల్ని ఆయన పంపారు. ఇదంతా జగన్ ఘోర ఓటమి నుంచి నేర్చుకున్న పాఠమే అని టీడీపీ నాయకులు చెబుతున్నారు.