నంద్యాల మున్సిప‌ల్ కౌంటింగ్‌లో కుట్ర జ‌రుగుతోందా?

నంద్యాల మున్సిప‌ల్ ఎన్నిక‌ల కౌంటింగ్‌పై స‌ర్వ‌త్రా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి

నంద్యాల మున్సిప‌ల్ ఎన్నిక‌ల కౌంటింగ్‌పై స‌ర్వ‌త్రా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఒక‌వైపు రాష్ట్ర‌మంతా కౌంటింగ్ ప్ర‌క్రియ పూర్త‌వుతుంటే, నంద్యాల‌కు సంబంధించి చిన్న అప్డేట్ కూడా తెలియ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

నంద్యాల మున్సిపాలిటీలో విజ‌యం సాధిస్తామ‌ని వైసీపీ ధీమా వ్య‌క్తం చేస్తోంది. అందుకే అక్క‌డి కౌంటింగ్ వివ‌రాల్ని వెల్ల‌డించ‌క‌పోవ‌డంతో, ఏదైనా కుట్ర జ‌రుగుతోందా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

కౌంటింగ్ ఆల‌స్యం కావ‌డంతో ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. కౌంటింగ్‌లో వైసీపీకి అనుకూల ఫ‌లితాలు వ‌స్తుండ‌డంతో, ఎలాగైనా వాటిని దాచి, టీడీపీ వ‌శం అయ్యిన‌ట్టు ప్ర‌క‌టించుకోవాల‌నే కుట్ర‌లు జ‌రుగుతున్న‌ట్టు ప్ర‌తిప‌క్ష నేత‌లు ఆరోపిస్తున్నారు.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిచిందే చాలా త‌క్కువ‌. గెలిచిన చోట కూడా డిక్ల‌రేష‌న్ ఫారాలు ఇవ్వ‌కుండా, టీడీపీ అడ్డుకుంటున్న‌ట్టు ఆరోప‌ణ‌లే కాదు, ఆధారాలు కూడా బ‌య‌ట‌ప‌డ్డాయి.

అదే నంద్యాల స‌మీపంలోని నందికొట్కూరులో వైసీపీ విజ‌యం సాధించింది. కానీ విజేత‌ల‌కు డిక్ల‌రేష‌న్ ఫారాలు ఇవ్వ‌కుండా , ఫ‌లితాల్ని తారుమారు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారంటూ వైసీపీ యువ‌నేత బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి ఆందోళ‌న‌కు దిగారు.

అలాగే బేతంచ‌ర్ల న‌గ‌ర పంచాయ‌తీలో వైసీపీ ఆధిక్య‌తో వుంది. గెలిచిన వైసీపీ అభ్య‌ర్థుల‌కు డిక్ల‌రేష‌న్ ఫారాలు ఇవ్వ‌కుండా, రీకౌంటింగ్ పేరుతో కుట్ర‌లు చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి.

ఈ నేప‌థ్యంలో నంద్యాల ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌క‌పోవ‌డం వెనుక, అలాంటి కుట్ర‌లే జ‌రుగుతున్నాయ‌ని వైసీపీ నేత‌లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. కావున అనుమానాల‌కు చోటు లేకుండా వెంట‌నే నంద్యాల ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించాల్సిన బాధ్య‌త అధికారుల‌పై వుంది.

2 Replies to “నంద్యాల మున్సిప‌ల్ కౌంటింగ్‌లో కుట్ర జ‌రుగుతోందా?”

Comments are closed.