అజిత్ సినిమాతో ఆగింది.. సూర్య సినిమాతో మొదలు

మద్రాస్ హైకోర్టు ఆదేశాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా అర్ధరాత్రి, ఉదయం 4, 5 గంటల ఫ్యాన్స్ షోలను పూర్తిగా రద్దు చేసింది.

తమిళ సినీ రంగంలో ఫ్యాన్స్ హంగామాకు, తెల్లవారుజామున పడే షోలకు ప్రత్యేకమైన స్థానం ఉండేది. అయితే 2023 పొంగల్ వేళ అజిత్ నటించిన ‘తునివు’, విజయ్ నటించిన ‘వారిసు’ చిత్రాలు ఒకే రోజు పోటీపడగా, వేకువజామున జరిగిన తొక్కిసలాట కారణంగా 19 ఏళ్ల అజిత్ అభిమాని లారీపై నుంచి కిందపడి మరణించాడు.

ఆ విషాదకర ఘటనతో తమిళనాడు ప్రభుత్వం తీవ్ర నిర్ణయం తీసుకుంది. మద్రాస్ హైకోర్టు ఆదేశాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా అర్ధరాత్రి, ఉదయం 4, 5 గంటల ఫ్యాన్స్ షోలను పూర్తిగా రద్దు చేసింది.

అప్పట్నుంచి తమిళనాట మిడ్-నైట్, ఎర్లీ మార్నింగ్ షోలు నిలిచిపోయాయి. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఉదయం 9 గంటల ఆట నుంచే మొదలు. ఇప్పుడా పరిస్థితి మళ్లీ మారబోతోంది.

థియేటర్ యజమానుల అసోసియేషన్, ఫిల్మ్ ఛాంబర్ సుదీర్ఘకాలంగా చేస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ప్రత్యేక ప్రదర్శనలకు ఆమోదం తెలపడానికి సిద్ధమైంది. అలా అని మిడ్-నైట్ షోలకు, ఉదయం 4 గంటల షోలకు అనుమతి ఇవ్వలేదు.

ఉదయం 6 గంటల నుంచే షోలు వేసుకోవడానికి అనుమతులు ఇవ్వడానికి రెడీ అవుతోంది విజయ్ సర్కారు. అజిత్ సినిమాతో ఊహించని రీతిలో ఆగిపోయిన ఈ ప్రత్యేక షోల సంస్కృతి, ఇప్పుడు సూర్య నటించిన ‘సీన్’ సినిమాతో తిరిగి మొదలుకానుంది.