ఉత్తరాంధ్రకు టీటీడీ చైర్మన్ పదవి?

అందరికంటే ముందంజలో కిమిడి కళా వెంకటరావు ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

ఉత్తరాంధ్రకు గతంలో కొంతమంది కీలక నేతలు టీటీడీ చైర్మన్ పదవిని చేపట్టారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ఈ పదవిని నిర్వహించారు. ఇప్పుడు మరోసారి ఉత్తరాంధ్రకు ఈ పదవి దక్కనుందనే ప్రచారం ఊపందుకుంది.

ఈసారి కూడా రేసులో పలువురు సీనియర్ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందరికంటే ముందంజలో కిమిడి కళా వెంకటరావు ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

ఆయన 1983లో టీడీపీ తరఫున గెలిచిన నాయకుడు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో అప్పట్లోనే హోం శాఖ బాధ్యతలను నిర్వహించారు. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా కూడా పదవులు చేపట్టారు.

ఆయన సీనియారిటీ, అనుభవానికి ప్రాధాన్యతనిస్తూ మరోసారి ఈ బాధ్యతను అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన కళా వెంకటరావు, తన రాజకీయ జీవితంలో ఇవే చివరి ఎన్నికలని చెబుతూ 2024లో చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే మంత్రి పదవి దక్కుతుందని ఆయన ఆశించినప్పటికీ, అవకాశం రాకపోవడం అభిమానులు, అనుచరుల్లో అసంతృప్తికి కారణమైంది.

ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవిని కేటాయించడం ద్వారా ఆయనకు తగిన గుర్తింపు ఇచ్చినట్లవుతుందని పార్టీ అధినాయకత్వం భావిస్తోందనే ప్రచారం సాగుతోంది.

సామాజిక, రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటే కిమిడి కళా వెంకటరావుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆయన వర్గీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆయనకు ఈ పదవి దక్కితే, జిల్లాలోని ఇతర ముఖ్యమైన పదవులను మరో నేతకు కేటాయించడం ద్వారా అందరికీ సముచిత ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవి కోసం కిమిడి వర్గీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కళా వెంకటరావుకు ఈ పదవి దక్కితే, రెండుసార్లు టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన నేతగా ఆయన గుర్తింపు పొందుతారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.