విశాఖ ప్రజలు ప్రతి ఎన్నికలోనూ తమదైన శైలిలో తీర్పు ఇస్తుంటారు. విశాఖ సిటీలో 2019లో వైసీపీ ఓడిపోయినా, 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీకే పట్టం కట్టారు. మేయర్ పీఠాన్ని అప్పగించారు.
అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని కూడా ఆదరించారు. 30కి పైగా వార్డుల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించి, జీవీఎంసీలో బలమైన ప్రతిపక్షాన్ని కూర్చోబెట్టారు.
ఇప్పుడు రెండున్నరేళ్ల కూటమి పాలన తర్వాత జీవీఎంసీకి ఎన్నికలు జరుగుతున్నాయి. 120 సీట్లకు పెరిగిన కార్పొరేషన్లో మేయర్ ఎవరన్నది 18 లక్షలకు పైగా ఓటర్లు తేల్చబోతున్నారు.
నగరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని విశాఖ ప్రజలు సమగ్రమైన తీర్పు ఇస్తారనే పేరుంది.
అధికార కూటమి ‘సేవ్ విశాఖ’ నినాదంతో ముందుకు వెళ్తోంది. వైసీపీ కూడా ‘సేవ్ విశాఖ’ నినాదంతోనే ప్రజల్లోకి వెళ్లింది. 2024 వరకు విశాఖలో వైసీపీ విధ్వంసం సృష్టించిందన్నది కూటమి ఆరోపణ.
గత రెండున్నరేళ్లలో పర్యావరణం మొదలుకొని తాగునీటి కొరత వరకు అనేక సమస్యలతో కూటమి పాలనలో విశాఖ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.
ఒకే నినాదంతో రెండు పార్టీలు ప్రజల ముందుకు వస్తున్నాయి. ఈ రెండు పార్టీల వాదనలను, నగరంలో జరిగిన పరిణామాలను ప్రజలు ఎలా బేరీజు వేసుకుంటారు? ఎలాంటి తీర్పు ఇస్తారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
జీవీఎంసీలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. బీసీల సంఖ్య కూడా ఎక్కువే. గతంలో టీడీపీ, వైసీపీ తరఫున మేయర్లుగా పనిచేసిన ఇద్దరూ బీసీ మహిళలే కావడంతో ఈ పోటీ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
జీవీఎంసీ మేయర్ పీఠం ఎవరిని వరిస్తుందన్న ఉత్కంఠకు ప్రజలు తెరదించనున్నారు. నవంబర్ 1న పోలింగ్‌కు అంతా సిద్ధమైంది.
విశాఖలో సాధారణంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది. గతంలో 60 శాతానికి తక్కువ కాకుండా ఓటింగ్ నమోదైంది. ఈసారి కూడా అంతకుమించి పోలింగ్ శాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.

3 to 4 lacks majority garanty kutamiki