ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు ప్రత్యర్థి పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు టీడీపీలో చేరారన్న ఆనందం కనీసం 24 గంటలు కూడా లేకపోయింది.
టీడీపీలో చేరి తప్పు చేశామని, ఇప్పుడు తెలుసుకున్నామంటూ భార్యాభర్తలైన ఇద్దరు ఎంపీటీసీలు తిరిగి సొంత పార్టీ కండువాలు కప్పుకోవడం చర్చనీయాంశమైంది.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి మంత్రి అనిత ప్రాతినిథ్యం వహించే సంగతి తెలిసిందే. ఇటీవల పరిషత్ ఎన్నికల్లో అనిత సొంత మండలం నక్కపల్లిలో ఇద్దరు వైసీపీ ఎంపీటీసీలు గెలిచారు.
పెదబోదుగాలం నుంచి వీసం నానాజీ, రేబాక నుంచి ఆయన సతీమణి వీసం దేవి గెలుపొందారు. వైసీపీకి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్నది వాస్తవం.
అయితే గెలిచిన వాళ్లను టీడీపీలో చేర్చుకుంటే, ప్రజాబలం టీడీపీ వైపు ఉన్నట్టే అని హోంమంత్రి అనుచరులు భావించినట్టున్నారు.
అందుకే గెలిచిన రెండుమూడు రోజులకే వైసీపీ ఎంపీటీసీలైన నానాజీ దంపతుల మెడలో హోంమంత్రి అనిత టీడీపీ కండువాలు కప్పారు. అయితే వైసీపీకి ఒక్కరంటే ఒక్క స్థానిక సంస్థల ప్రతినిధి కూడా లేరనే ఆనందం అనితలో కనీసం ఒక రోజు కూడా మిగల్లేదు.
ఇవాళ మళ్లీ దంపతులిద్దరూ వైసీపీ కండువాలు కప్పుకున్నారు. తమ వాళ్లకు చెప్పకుండానే టీడీపీలో చేరామని ఆవేదన చెందారు. ఇకపై ఇలాంటి తప్పు జరగదని చెప్పుకొచ్చారు. స్వయంగా హోంశాఖ మంత్రి అనిత కండువాలు కప్పగా, ఒక్క రోజు కూడా పార్టీలో వుండకుండా పోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.

గొడ్డలి పోటు పడుతుందని భయపడ్డారులే