విజయనగరం జెడ్పీ చైర్‌పర్సన్‌గా తన కుమార్తెను చూడాలన్న ఆరాటంతో దశాబ్దాలుగా ఉన్న పార్టీని సైతం విడిచి చిన్న శ్రీను టీడీపీలోకి మారారు. ఆయన కుమార్తె సిరి సహస్ర జెడ్పీటీసీగా రెండు చోట్ల నామినేషన్లు దాఖలు చేసింది.
అయితే ఇప్పుడు ఆమె కులం బీసీ కాదు అంటూ వైసీపీ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో రాజకీయం కొత్త మలుపు తిరిగింది.
సిరి సహస్రది ఓసీ కుటుంబం అని వైసీపీ నేతలు అంటున్నారు. ఆమె బీసీలకు కేటాయించిన జెడ్పీటీసీ సీట్లలో ఎలా పోటీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
సిరి సహస్ర జనన ధ్రువీకరణ పత్రంలోనూ, పదో తరగతి మార్కుల జాబితాలోనూ తన పేరు ముస్కాన్ జైన్‌గా నమోదైందని వైసీపీ అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు చెప్పారు.
అయితే విజయనగరం జిల్లాలోని కొత్తవలస, తెర్లాం జెడ్పీటీసీ నామినేషన్లకు బీసీ సర్టిఫికెట్లను సిరి సహస్ర జత చేసిందని ఆయన ఆరోపించారు. జనరల్ కేటగిరీకి ఆరు వేల రూపాయలకు బదులు, బీసీ కేటగిరీ కింద మూడు వేల రూపాయలు డిపాజిట్ చెల్లించారని ఆక్షేపించారు.
వైసీపీ ఆమె కులం విషయంలో విజయనగరం జిల్లా రిటర్నింగ్ అధికారి ముందు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, సిరి సహస్ర నామినేషన్లను ఎలా అంగీకరిస్తారని ప్రశ్నించారు.
ఈ విధంగా బీసీల రిజర్వేషన్ హక్కులకు గండికొడితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
కులం విషయంలో వివాదం ఉంది కాబట్టి సిరి సహస్ర నామినేషన్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆమె రెండు నామినేషన్లను తిరస్కరించకపోతే వైసీపీ తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రేగిడి లక్ష్మణరావు స్పష్టం చేశారు.
ఆమెకు కుల ధ్రువీకరణ పత్రాల జారీ నుంచి నామినేషన్ల స్వీకరణ వరకు ప్రతి అంశాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించాలని కోరారు.
ఈ మొత్తం వ్యవహారంపై చిన్న శ్రీను సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్ హక్కులను పరిరక్షించేందుకు చట్టపరంగా పోరాడతామని వైసీపీ నేతలు అంటున్నారు.
