అంత లాజిక్ తెలియకుండా ఏం సాధిస్తారు సామీ?!

బాపు రూపొందించిన కళాఖండం పెళ్లిపుస్తకం సినిమాలో ఓ అద్భుతమైన డైలాగు ఉంటుంది. గుమ్మడి పాత్ర ద్వారా ముళ్లపూడి వెంకటరమణ ఓ చక్కటి వ్యాపార మెళకువను సరళంగా పలికించారు. గుమ్మడి మాట్లాడుతూ.. తన భార్య తనకు…

బాపు రూపొందించిన కళాఖండం పెళ్లిపుస్తకం సినిమాలో ఓ అద్భుతమైన డైలాగు ఉంటుంది. గుమ్మడి పాత్ర ద్వారా ముళ్లపూడి వెంకటరమణ ఓ చక్కటి వ్యాపార మెళకువను సరళంగా పలికించారు. గుమ్మడి మాట్లాడుతూ.. తన భార్య తనకు గొప్ప వ్యాపార సూత్రం నేర్పిందని అంటారు. ‘‘అడవిలో ఉప్పు దొరకదు. అక్కడ ఉప్పమ్మితే లాభం. సముద్రం ఒడ్డున చింతపండు అమ్మితే లాభం. ఈ రెండూ దొరకని పట్టణాల్లో రెండూ కలిపి ఊరగాయ అమ్మితే లాభం అని చెప్పింది’’! అని చెప్తారు. 

చాలా సింపుల్ లాజిక్ ఇది. కేవలం వ్యాపారానికి మాత్రమే పరిమితమైన లాజిక్ కానే కాదు. ఏ వ్యవహారానికి అయినా ఇది వర్తిస్తుంది. దీన్ని ఇంకాస్త సింప్లిఫై చేస్తే.. ‘ఎక్కడ ఏది వర్కవుట్ అవుతుందో ఆ పని మాత్రమే చేయాలి’ అని చెప్పుకోవచ్చు.

ఈ పాటి వ్యవహార జ్ఞానం తెలుగుదేశం నాయకుల్లో, ఆ పార్టీలో కొమ్ములు తిరిగిన తెలివితేటలున్నవారని అనుకుంటున్న నాయకుల్లో కనీసంగా కూడా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆ పార్టీ సంక్షోభంలో ఉంది. చంద్రబాబునాయుడు అరెస్టు అయి జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. బెయిలు కోసం ఇప్పటికే అన్ని తలుపులూ తట్టేశారు గానీ.. ఆయన ఇరుక్కున్న కేసుకు అసలు బెయిలు వస్తుందో రాదో కూడా తెలియదు. 

ఈ సమయంలో చంద్రబాబు గురించిన విన్నపాలను వినిపించుకోవడానికి.. తెలుగుదేశం నాయకులు ఎవరు కనిపిస్తే వారిని ఆశ్రయిస్తున్నారు. చినబాబు నారా లోకేష్.. పరారీలో ఢిల్లీలో ఉంటూ తానేదో బ్రహ్మాండం బద్దలు చేయగలనని అనుకుంటున్నారు.

అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. ఎక్కడ ఫలితం ఉంటుందో, ఎవరిని ఏ తీరుగా ఆశ్రయిస్తే కాస్త ప్రయోజనం ఉంటుందో వారికి లాజిక్ కూడా తెలియడం లేదు. ఎలాగంటే.. నారా లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి.. చంద్రబాబు ఎపిసోడ్ ను వివరించారు. కింజరాపు రామ్మోహన్ అమిత్ షాకు లేఖ రాసి, సీఐడీ చీఫ్ మీద చర్య తీసుకోవాలని కోరారు. అయితే ఈ రెండు మార్గాలుకూడా కార్యం చక్కదిద్దే మార్గాలు కాదని పలువురు విశ్లేషిస్తున్నారు. 

ఎందుకంటే రాష్ట్రపతి ద్వారా.. ఏదో చెప్పుకున్నాం అని రికార్డుల్లో ఉంటుందే తప్ప జరిగే పనేం ఉండదు. అదే సమయంలో.. అమిత్ షాను నేరులో కలిసి మొరపెట్టుకుంటే.. ఏదైనా ఫలితం ఉండొచ్చు.

కానీ తెదేపా నేతలు.. రివర్సులో చేస్తున్నారు. రాష్ట్రపతిని కలిసి, అమిత్ షాకు లేఖ రాసి చేతులు దులుపుకుంటున్నారు. ఎక్కడ ఏ పని జరుగుతుందో.. ఎవరిని ఎలా ఎప్రోచ్ అయితే  పని నెరవేరుతుందో కూడా లాజిక్ తెలియని వాళ్లు.. ఏం సాధిస్తారని, చంద్రబాబును ఎలా రక్షిస్తారని ప్రజలు నవ్వుకుంటున్నారు.