Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Andhra

కింజరాపు ఫ్యామిలీకి ఆ రెండు సీట్లు ప్రతిష్టాకరం!

కింజరాపు ఫ్యామిలీకి ఆ రెండు సీట్లు ప్రతిష్టాకరం!

శ్రీకాకుళంలో రెండు అసెంబ్లీ సీట్ల విషయంలో కింజరాపు ఫ్యామిలీ రాజకీయ పట్టు ఏమిటో రుజువు అయింది. వారు చెప్పిన వారికే టికెట్లు దక్కాయి. సీనియర్లను ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన వారిని సైతం పక్కన పెట్టి చంద్రబాబు కొత్త ముఖాలకు అక్కడ టికెట్లు ఇచ్చారు. అలా శ్రీకాకుళం అసెంబ్లీ టికెట్ ని యువ నేత గోండు శంకర్ దక్కించుకున్నారు. ఆయనకు సర్పంచ్ గా మాత్రమే పనిచేసిన అనుభవం ఉంది.

ఆయన నేరుగా సీనియర్ నేత మంత్రి ధర్మాన ప్రసాదరావుని ఢీ కొట్టబోతున్నారు. ఆయనకు టికెట్ రావడం వెనక అచ్చెన్నాయుడు ఉన్నారు. అలాగే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఈ ఇద్దరూ ఇప్పుడు శ్రీకాకుళం ఎమ్మెల్యే సీటుని టీడీపీ పరం అయ్యేలా చూడాల్సి ఉంది అంటున్నారు. ఇక్కడ గట్టి పట్టు ఉన్న మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబాన్ని కాదని రాజకీయం చేయడం ఒక సవాల్. అలాగే కొత్త వారికి టికెట్ ఇచ్చి అసెంబ్లీ మెట్లు ఎక్కించడం అంటే కూడా కష్టమే.

అదే విధంగా పాతపట్నం అసెంబ్లీ సీటులో కూడా దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తున్న కలమట కుటుంబాన్ని పక్కన పెట్టి మామిడి గోవిందరావుకు టికెట్ ఇప్పించడంతో కింజరాపు కుటుంబం ప్రధాన పాత్ర పోషించింది. ఇక్కడ కలమట రాజకీయ పలుకుబడిని తట్టుకుని కొత్త అభ్యర్థి గెలవాల్సి ఉంది. పైగా ఈ సీటు వైసీపీకి కంచుకోట. గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీ నుంచి అభ్యర్ధులే ఎమ్మెల్యేలు  అయ్యారు.

దాంతో ఈ బాధ్యతలను ఎంపీ రామ్మోహన్ భుజానికి ఎత్తుకున్నారు. ఆయన ఎక్కువగా ఈ రెండు సీట్ల మీద దృష్టి పెడుతున్నారు. ఇక్కడ వైసీపీని ఎదుర్కోవడంతో పాటు సొంత పార్టీలో సమస్యలను కూడా సర్దుకోవాల్సి ఉంది. ఈ రెండు సీట్లలో గెలుపు ఎంపీ విజయానికి కూడా ముఖ్యమైనవిగా ఉన్నాయి. ఈ మెజారిటీలే ఎంపీ సీటుని టీడీపీకి దక్కేలా చేస్తాయి. దాంతో కింజరాపు కుటుంబం ఈ రెండు సీట్లను ప్రతిష్టగా తీసుకుని పనిచేస్తోంది. వైసీపీ అయితే టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాలు అసంతృప్త్ని సొమ్ము చేసుకోవాలని భావిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?