తప్పుకుంటానంటున్న వైసీపీ ఇన్‌ఛార్జి?

వైసీపీలో 2024 ఎన్నికలకు ముందు చేరిన భరత్ ఎన్నారైగా గుర్తింపు పొందారు. ఆయన ఉన్నత విద్యావేత్త కూడా.

వైసీపీ ఇన్‌ఛార్జిల పనితీరుపై ఇప్పుడు పెద్ద చర్చ సాగుతోంది. వారి మీదే భారం వేసి స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టాలని వైసీపీ అధినాయకత్వం సూచించింది. అయితే చాలా చోట్ల ఇన్‌ఛార్జిల పనితీరు సరిగ్గా లేదని అధినాయకత్వానికి నివేదికలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాను ఎంతో కష్టపడి పనిచేసినా, కొందరు నాయకులు వైసీపీ హైకమాండ్‌కు తప్పుడు సమాచారం ఇచ్చి తనను ఇబ్బంది పెట్టారని అనకాపల్లి వైసీపీ ఇన్‌ఛార్జి మలసాల భరత్ తన సన్నిహితులతో అంటున్నట్లు చర్చ సాగుతోంది. పార్టీ కోసం ఆర్థికంగా, ఇతరత్రా తాను ఎంతో అండగా ఉంటూ వచ్చానని ఆయన చెబుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

తనను పార్టీలో అన్ని విధాలుగా ఉపయోగించుకున్న నాయకులే తనపై చెప్పుడు మాటలు పైస్థాయి నేతలకు చెబుతున్నారని ఆయన మథనపడుతున్నారని అంటున్నారు. పార్టీలో తనకు గుర్తింపు లేకుండా చేసే కుట్ర సాగుతోందని ఆయన భావిస్తున్నారట.

అందుకే వైసీపీలో తనకు అప్పగించిన ఇన్‌ఛార్జి పదవికి రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ రెండు రోజుల్లో ముగియనుండటంతో, ఆ తర్వాత భరత్ తన పదవికి రాజీనామా చేస్తారని అంటున్నారు.

వైసీపీలో 2024 ఎన్నికలకు ముందు చేరిన భరత్ ఎన్నారైగా గుర్తింపు పొందారు. ఆయన ఉన్నత విద్యావేత్త కూడా. అయితే అనకాపల్లి రాజకీయాలు ఆయనకు సవాల్‌గా మారాయి.

2024 ఎన్నికల్లో టికెట్ పొంది కూడా భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. రెండున్నరేళ్లుగా పార్టీని నడిపిస్తున్నా వైసీపీ నుంచి ఆశించిన గుర్తింపు లభించడం లేదనే చర్చ ఉంది.

అక్కడ వర్గపోరు అధికంగా ఉంది. సీనియర్ నేతలు ఎంతోమంది ఉన్నా, ఒకరు మరొకరికి సహకరించుకోలేని పరిస్థితి ఉంది. ఇక అనకాపల్లి జోన్‌లో మొత్తం ఆరు జీవీఎంసీ వార్డులనూ కూటమి గెలుచుకుంది. దాంతో అధినాయకత్వం కూడా ఈ దారుణ పరిస్థితికి కారణాలేంటని అధ్యయనం చేస్తోంది.

ఈ క్రమంలో పదవి నుంచి తప్పుకోవడానికి ఇన్‌ఛార్జి సిద్ధపడుతున్నారని ప్రచారం సాగుతోంది.