గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్ల నుంచి వైసీపీ చాలా నేర్చుకుంది. మరీ ముఖ్యంగా ఫలితాలు వెల్లడికావడానికి వారం రోజులముందు, ఫలితాలు వచ్చిన తర్వాత పరిస్థితులపై పూర్తి అవగాహనకు వచ్చారు వైసీపీ అధినేత జగన్. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి పూర్తిగా సన్నద్ధమౌతున్నారు. అన్నిరకాల ఏర్పాట్లు పూర్తిచేయడంతో పాటు, పనిలోపనిగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఓ కన్నేసి ఉంచారు.
ఎన్నికల ప్రచారంలోనే కాదు, ఆ తర్వాత కూడా పవన్ పేరును ఉచ్ఛరించడానికి ఇష్టపడలేదు జగన్. ఎన్నికల ప్రచారం సమయంలో పవన్ ను “చంద్రబాబు పార్టనర్” గానే చెప్పుకొచ్చారు. ఎలాంటి విమర్శ చేయాల్సి వచ్చినా “చంద్రబాబు పార్టనర్” అంటూనే స్టార్ట్ చేసేవారు. ఇప్పుడు అదే “పార్టనర్”పై జగన్ ప్రత్యేకంగా గురిపెట్టారు. దీనికి ఓ బలమైన కారణం ఉంది.
ఎవరు ఔనన్నా, కాదన్నా చంద్రబాబు-పవన్ ఒక్కటే. నిన్నటికినిన్న కూడా చంద్రబాబు బాటలోనే పవన్ కూడా వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సిందేనంటూ ప్రకటన చేశారు. ఇదొక్కటే కాదు, గతంలో కూడా ఎన్నోసార్లు తెరవెనక బాబు ఏది చెబితే, పబ్లిక్ ముందు పవన్ అదే చెప్పేవారు. సో.. ఈసారి ఎన్నికల ఫలితాల్లో ఎడ్జ్ వస్తే గనుక చంద్రబాబు-పవన్ మరోసారి కలిసిపోతారు. పైపైన తిట్టుకున్నప్పటికీ ఫలితాల్లో ఎడ్జ్ కనిపిస్తే మాత్రం జరిగేది ఇదే.
వార్ వన్ సైడ్ అని తేలినప్పటికీ జగన్ ఈ విషయంలో ముందుజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అసలు పవన్ కు ఎంత సీన్ ఉంది అనే విషయంపై ఇప్పుడిప్పుడే లెక్కలు బయటకు తీస్తున్నారు. ఆఖరి నిమిషంలో పవన్-బాబు కలిస్తే సమీకరణాలు ఏమైనా మారుతాయా అనే యాంగిల్ లో కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఇవన్నీ ముందుజాగ్రత్త చర్యలు మాత్రమే.
మరోవైపు చంద్రబాబు గురించి జగన్ కు పూర్తిగా తెలుసు కాబట్టి ఆ దిశగా కూడా చర్యలు చేపట్టారు. ఈనెల 19న ఏర్పాటుచేయనున్న సమావేశంలో జిల్లాకు ఒక కీలక నేతను ఎంపిక చేయబోతున్నారు. ఆ నేత, తన జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు. ఇలా చేయడం వల్ల వైసీపీ నుంచి గెలిచిన అభ్యర్థుల్ని కాపాడుకున్నట్టు అవుతుంది. పైగా చంద్రబాబు పన్నాగం నుంచి తప్పించుకోవడం కూడా సాధ్యం అవుతుంది.
గత ఎన్నికల్లో కేవలం ఒక్కశాతం ఓటింగ్ తేడాతో ఓడిపోయారు జగన్. ఆ తర్వాత చంద్రబాబు, వైసీపీ ఎమ్మెల్యేల్ని సంతలో పశువుల్ని కొన్నట్టు కొనేసిన విధానాన్ని కూడా చూశారు. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం వైసీపీ పూర్తి ఆధిక్యం సాధిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. గురితప్పదని, కచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. అయినప్పటికీ జగన్ తన జాగ్రత్తల్లో తాను ఉన్నారు.
ఆఖరి నిమిషంలో ఏదైనా జరగొచ్చనే ఆలోచనతో ముందు జాగ్రత్తగా జిల్లాల వారీగా కీలక వ్యక్తులకు బాధ్యతలు అప్పగిస్తూనే, జనసేన అధ్యక్షుడిపై కూడా ఓ కన్నేసి ఉంచారు. ఈసారి ఎన్నికల్లో పవన్ ప్రభావం ఉండదని తెలిసినప్పటికీ జగన్ ఇలా అత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు.