అప్పటినుంచీ అదే స్కెచ్ లో ఉన్న సుజనా!

తనతోపాటు మరో ఇద్దరు తెలుగుదేశం ఎంపీలను వెంటబెట్టుకుని సుజనాచౌదరి కమలతీర్థం పుచ్చుకోవడం అనేది హఠాత్తుగా ఇవాళ సంభవించిన పరిణామం కాదు. తెలుగుదేశం పార్టీ ఎన్డీయేనుంచి బయటకు వచ్చిన నాటినుంచి.. సుజనా అదే స్కెచ్ తో…

తనతోపాటు మరో ఇద్దరు తెలుగుదేశం ఎంపీలను వెంటబెట్టుకుని సుజనాచౌదరి కమలతీర్థం పుచ్చుకోవడం అనేది హఠాత్తుగా ఇవాళ సంభవించిన పరిణామం కాదు. తెలుగుదేశం పార్టీ ఎన్డీయేనుంచి బయటకు వచ్చిన నాటినుంచి.. సుజనా అదే స్కెచ్ తో ఉన్నారు! కాకపోతే అప్పట్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలో ఉన్నది గనుక.. సరైన తరుణం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం పతనం అయిన తర్వాత.. ఇంతకు మించిన తరుణం మరొకటి ఉండదని అనిపించినందునే… కమలంలో విలీనం అయ్యే లాంఛనాన్ని పూర్తిచేశారు. తాజాగా ప్రధానితో ఆ ముగ్గురు భేటీ అనంతరం.. వారి చర్చల రూపేణా ఇలాంటి సంకేతాలు బయటకు వస్తున్నాయి.

‘‘మీరు మంత్రిగా ఉన్నప్పుడే… ఎన్డీయే ప్రభుత్వంతో కలిసే ఉండాలనుకున్నారు… కానీ పార్టీ నిర్ణయం వల్ల విడిపోయారు…’’ అని ప్రధాని మోడీ వారితో వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మోడీ వ్యతిరేక వైఖరి తీసుకుని… చంద్రబాబునాయుడు ఎడాపెడా.. ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభించినప్పటికీ… వాటిలో సుజనాచౌదరి క్రియాశీలంగా పాల్గొన్నది తక్కువ. చంద్రబాబు పోరాటాలకు సుజనా వీలైనంత దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఆయన తొలినుంచి భాజపా ప్రాపకాన్ని వీడకుండా, ఒక స్కెచ్ ప్రకారం వారితో టచ్ లోనే ఉంటూ వచ్చినట్లుగా పలువురు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా పరంగా తీరని అన్యాయం జరిగిందంటే.. అందులో సుజనా పాత్ర కూడా చాలా ఉంది. హోదా డిమాండ్ ఉధృతం అయినప్పుడు.. అరుణ్ జైట్లీతో చర్చల్లో పాల్గొన్నది ఆయనే. స్పెషల్ ప్యాకేజీ అంటే ఏమిటో, అందులో ఏం ఉంటుందో ప్రజలకు ఎవరూ అర్థంకాని రోజునే… హోదాను చులకన చేస్తూ, ప్యాకేజీ అద్భుతం అంటూ.. మాయమాటలతో ప్రజలను బురిడీ కొట్టించడానికి ప్రయత్నించింది కూడా సుజనానే!

తీరా ఇప్పుడు… రాష్ట్ర ప్రయోజనాల కోసం అనే ఒక వంచనాపూర్వకమైన పడికట్టు పదాన్ని ఉపయోగిస్తూ వారు భాజపా పంచకు చేరారు. ఏడాదిన్నర నుంచి వేసిన స్కెచ్ ప్రకారం మొత్తానికి సుజనా తెదేపా పతనానికి తనవంతు ఆజ్యం పోశారని అనిపిస్తోంది.

బాబుగారూ.. 'మీరు ఓడిపోవడం ఏమిటయ్యా!'