టీడీపీని వీడి, బీజేపీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై కోవర్టు 'ముద్ర' వేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు.. అయితే, డైరెక్ట్‌గా కాదు.. ఇన్ డైరెక్ట్‌గా.! బీజేపీలో చేరేవారిలో కోవర్టులు వుండే అవకాశం లేకపోలేదనీ, అలాంటి వారిపై ప్రత్యేక నిఘా పెడతామని జీవీఎల్ చేసిన వ్యాఖ్యలిప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సుజనా చౌదరి, ఆయనతోపాటు మరో ముగ్గురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో కలిసిపోయి 24 గంటలు కూడా కాకుండానే అప్పుడే 'కోవర్టుల' చర్చ బీజేపీ నుంచి ఎందుకు తెరపైకి వచ్చింది.?
నిజానికి సుజనా చౌదరి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అరి వీర భయంకరుడైన భక్తుడు. 'చంద్రబాబు నాకు రాజకీయ గురువు.. మేం తెలుగుదేశం పార్టీని వీడినా, ఆ పార్టీ ముందు ముందు మరింత బలోపేతమవుతుందని ఆశిస్తున్నాం. టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదు. సంక్షోభం నుంచి పుంజుకుని.. ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తుందనే గట్టి నమ్మకం నాకుంది..' అంటూ బీజేపీలో చేరాక సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు సహజంగానే బీజేపీ నేతలకు మింగుడు పడవు. అద్గదీ అసలు విషయం.
సుజనా చౌదరి మాత్రమే కాదు.. సీఎం రమేష్ పరిస్థితి కూడా అంతే. ఆయనకీ చంద్రబాబే రాజకీయ గురువు. అయినాగానీ, చంద్రబాబుని వదిలేసి సుజనా చౌదరి వెంట సీఎం రమేష్ నడిచారు. టీజీ వెంకటేష్‌కి పార్టీలు మార్చడం పెద్ద వింతేమీ కాదు. మిగిలిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు. ఈయన పరిస్థితి కాస్త భిన్నం. మొత్తమ్మీద, నలుగురి రాజకీయ జీవితాన్నీ ఓ సారి పరిశీలిస్తే.. సుజనా, ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి కోవర్టుగానే కన్పిస్తారు.
కానీ, సుజనా చౌదరి నేతృత్వంలోనే మిగిలిన ముగ్గురూ బీజేపీలోకి వెళ్ళారు. అలా నలుగుర్ని లాగడం వల్ల వారి పదవులకు భంగం వాటిల్లకూడదనీ, తద్వారా రాజ్యసభలో తమ బలం పెంచుకోవాలనీ బీజేపీ వేసిన స్కెచ్ ఫలించింది. సుజనాపై ఎటూ సీబీఐ, ఈడీ కేసులున్నాయి గనుక.. చంద్రబాబు భక్తుడే అయినా, ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పట్లో కార్యకలాపాలు నిర్వహించే అవకాశం లేదన్నది బీజేపీలో కొందరు చెబుతున్న మాట.
మొత్తమ్మీద, బీజేపీలో చేరిన ఇరవై నాలుగ్గంటల్లోపే సుజనా చౌదరి సహా మిగతా ముగ్గురు ఎంపీలూ 'కోవర్టులు' అనే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అవును మరి, సుజనా పేరు సరాసరి ప్రస్తావించకుండా జీవీఎల్ తెలివిగా 'కోవర్టులు' అని దాదాపుగా అందర్నీ అనేసినట్లే.