హీరోయిన్లకి అందమైన రూపం వుంటే చాలనుకునే రోజుల్లో నటించగలిగిన వారు చాలా తక్కువగా కనిపిస్తుంటారు. ముఖ్యంగా భావోద్వేగాలని పండించడంలో ఆనాటి నటీమణులకి ఇప్పటి తరానికీ పోలికే లేదు. అయితే కమర్షియల్ హీరోయిన్లుగా సక్సెస్ అవుతారు, లేదా పర్‌ఫార్మెన్స్ చేయగలదని అనిపించుకుంటారు తప్ప రెండు విధాల మెప్పించే వారు అరుదు. ఈతరం హీరోయిన్లలో సమంత మిగిలిన అందరికంటే ప్రతిభావంతురాలు అనడంలో సందేహం లేదు.
ముఖ్యంగా ఆమె ఎమోషన్స్ పలికించే తీరు విశేషంగా ఆకట్టుకుంటుంది. 'మజిలీ' చిత్రాన్నే తీసుకుంటే తన పాత్ర ప్రవేశించిన తర్వాత సినిమా రేంజే మారిపోయింది. హీరో ప్రధానంగా సాగే కథ అయినా కానీ తన పరిధిలోనే సమంత తన ముద్ర వేయగలిగింది. పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గడంతో తనకి నచ్చిన కథలు చేస్తోన్న సమంత ఈ ఫేజ్‌ని బాగా ఎంజాయ్ చేస్తోంది.
'ఓ బేబీ' ట్రెయిలర్ చూస్తేనే సమంత ఎంతగా ఆ పాత్రలో లీనమయిందనేది అర్థమవుతుంది. ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు లేని వారికి కూడా ట్రెయిలర్ చూసిన తర్వాత ఇది చూడాలనే భావన కలుగుతుంది. సోలోగా సమంత కనుక బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోగలిగితే ఇకనుంచి ఆమెపై మరిన్ని అద్భుతమైన పాత్రలు ఆశించవచ్చు అనిపిస్తోంది.