ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు. కార్మిక సంఘాలతో చర్చలు ప్రారంభించాలని అధికారుల్ని, రవాణా శాఖ మంత్రిని ఆదేశించారు. సమ్మె ప్రారంభమై ఇప్పటికే 3 వారాలు దాటింది. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇన్నాళ్లకు ముఖ్యమంత్రికి చర్చలు జరపాలనే ఆలోచన వచ్చింది. అయితే అంతా బాగానే ఉంది కానీ, అసలు డిమాండ్ మాత్రం ఇంకా అలానే ఉంది. అదే ప్రభుత్వంలో విలీనం.
ఆర్టీసీ కార్మికులు అందించిన 26 డిమాండ్ల చిట్టాలో అత్యంత కీలకమైనది సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం. ఇతర డిమాండ్ల సంగతి పక్కనపెడితే, ఈ ఒక్క డిమాండ్ పైనే ఉద్యమం మొత్తం సాగుతోంది. ప్రతిపక్షాలు ఎక్కువగా ప్రస్తావిస్తున్న అంశం కూడా ఇదే. ఇలాంటి కీలకమైన డిమాండ్ పై ఎలాంటి నోటు తయారుచేయలేదు అధికారుల కమిటీ. 26 డిమాండ్ల నుంచి కేవలం 21 డిమాండ్స్ కు సంబంధించిన నోట్స్ మాత్రమే ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రికి అందించారు. ప్రతి డిమాండ్ కు పరిష్కార మార్గంతో పాటు ఎదురయ్యే ప్రతికూలతలను తమ నోట్ లో పొందుపరిచారు. అవన్నీ కూలంకుషంగా చదివిన తర్వాత చర్చలకు పచ్చజెండా ఊపారు కేసీఆర్.
ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు ప్రారంభించబోతోంది. బస్ భవన్ లేదా రవాణా శాఖ కార్యాలయంలో జరగనున్న ఈ చర్చల్లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ, ఇతర అధికారులు పాల్గొంటారు. అయితే చర్చలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదంటున్నారు ఆర్టీసీ కార్మికులు. చర్చలకు తాము సిద్ధమేనని, కానీ ఎప్పుడు, ఎక్కడ అనే వివరాల్ని అందించకుండా ఎలా చర్చిస్తామని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా కార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి.
సమ్మె ఇలానే కొనసాగితే ఆర్టీసీని భూగోళంపై ఎవ్వడూ కాపాడలేడని వ్యాఖ్యానించారు కేసీఆర్. అంతేకాదు.. సమ్మెకు పరిష్కారం ఆర్టీసీ మూసివేతే అంటూ ఆయన ప్రకటించడం కార్మికులకు కోపం తెప్పించింది. ఒక్క సంతకం పెడితే వేల సంఖ్యలో ప్రైవేటు బస్సులు రోడ్లపైకి వస్తాయని హెచ్చరించారు. మరోవైపు కోర్టుపై కూడా కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే హుజూర్ నగర్ ఎన్నికల్లో గెలుపుతో వచ్చిన ఉత్సాహం వల్ల అలా మాట్లాడారని, ఇప్పుడు కేసీఆర్ వాస్తవ లోకంలోకి వచ్చి ఆలోచిస్తున్నారని, అందుకే హైకోర్టు ఆదేశాల మేరకు చర్చలు ప్రారంభిస్తున్నారని అంటున్నారు కొంతమంది.
అంతా బాగానే ఉంది కానీ, కీలకమైన “విలీనం” అంశాన్ని మాత్రం ప్రభుత్వం పక్కదోవ పట్టించింది. కావాలనే ఆ అంశానికి ప్రాధాన్యం ఇవ్వకుండా మాట్లాడుతోంది. మరోవైపు కార్మిక సంఘాలు మాత్రం విలీనం అంశంతోనే చర్చలు ప్రారంభించాలని కోరుతోంది. ఈ చిక్కుముడి ఎప్పుడు వీడుతుందో! ప్రజల కష్టాలు ఎప్పుడు తీరుతాయో!