మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి జమిలి ఎన్నికల చర్చ జరుగుతోంది. దీపం ఉండగానే యిల్లు చక్కబెట్టుకోవాలనే సామెతలా తన ప్రభ వెలుగుతూండగానే దేశమంతా బిజెపియే ఏలేయాలనే ఊహతో దీన్ని ముందుకు నెడుతూ వచ్చారు. ఒకేసారి ఎన్నికలైతే ఖర్చు తగ్గుతుందనే వాదన ఒక్కటే దాని పక్షాన ఉంది. ఫిరాయింపుల చేతనో, అసంతృప్తి చేతనో, పాలకపక్షం బలం తగ్గి మధ్యమధ్యలో మారే రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటూ ఉంటాయి కదా, వాటి పదవీకాలం ఐదేళ్లు ఉండేట్లా చూడడం ఎలా అనే ప్రశ్నకు బిజెపి ఎన్నడూ సమాధానం చెప్పలేదు. బహుశా తక్కిన పదవీకాలమంతా రాష్ట్రపతి పాలన విధిస్తాం అనే ఆలోచన కాబోలు, అది బయటపెట్టలేదు. రాష్ట్రాలనే ఏమిటి, 2019 పార్లమెంటు ఎన్నికలలో బిజెపికి అన్ని సీట్లు రాక, ఎన్‌డిఏలో తక్కిన పార్టీల మద్దతు తీసుకున్నా, మూడో కూటమికి బొటాబొటీ మెజారిటీ వచ్చినా కేంద్ర ప్రభుత్వం కూడా గద్దె మీద కాకుండా స్టూలు మీద కూర్చున్నట్లే అయేది. గతంలో జనతా పార్టీ, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్‌డిఏ ప్రభుత్వాలు పదవీకాలం పూర్తి చేసుకోలేక పోయిన విషయాన్నీ చూశాం. కేంద్రమే కుప్పకూలితే పరిస్థితి ఏమిటి?
వీటికి సమాధానాలు చెప్పకుండానే 2019 పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. మోదీకి బలం మరింత బలం పెరగడంతో జమిలి ఎన్నికల గురించి ధాటీగా మాట్లాడుతున్నారు. రాజ్యసభలో కూడా ఎదురు లేకుండా, తమకు చిత్తం వచ్చిన బిల్లులన్నీ పాస్ చేయించుకుంటున్నారు కాబట్టి, యిదీ రేపో, ఎల్లుండో అయిపోవచ్చు అనుకునే పరిస్థితి వచ్చింది. నిజానికి ఆరెస్సెస్ సిద్ధాంతకర్తలకు భారత్‌లో ఉన్న ఫెడరల్ తరహా ప్రభుత్వంపై నమ్మకం లేదు. గతకాలంలో చక్రవర్తుల వలె యూనిటరీ ప్రభుత్వమే ఉండాలని, దిల్లీ పాలకులు అనుకున్న విధానాన్ని దేశమంతా ఒకే రీతిలో అమలు చేయాలనీ వాళ్లు వాదిస్తారు. భారతజాతిలో ఉన్న బహుళత్వాన్ని అంగీకరించరు. రాష్ట్రాలకు నామమాత్రపు అధికారాలు యిచ్చి, నిర్ణయాలన్నీ కేంద్రస్థాయిలో తీసుకోవాలని వారి అభిప్రాయం. అమెరికా అధ్యక్షుడి అధికారాలకు చెక్ పెట్టేట్లా కాంగ్రెసు ఉంది. ఇక్కడ అదీ అక్కరలేదని వాళ్ల ఉద్దేశం.
మోదీ ఆ స్కూలుకి చెందినవాడే. అందుకే రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేస్తూ వచ్చాడు. జమిలి ఎన్నికలు నిర్వహించి, అమెరికా అధ్యక్షుడిలా మారి, కేంద్రానికి మరిన్ని అధికారాలు బదిలీ చేసేట్లుగా రాజ్యాంగం సవరించే యోచనలో ఉన్నాడనుకోవాలి. దేశాన్ని బలోపేతం చేయాలంటే ఆ చర్య తప్పదని జనాల్ని కన్విన్స్ చేయగల వచోసామర్థ్యం అతనికి ఉంది. అయితే దానికి ముందు కేంద్రంతో బాటు ప్రతి రాష్ట్రంలోను (కనీసం 90%) బిజెపియే నెగ్గాలి. ప్రస్తుతం దేశం మొత్తంలో మోదీ తప్ప మరో నాయకుడు కనుచూపు మేరలో లేడు. అక్కడక్కడ ప్రాంతీయ పార్టీలు తప్ప జాతీయ ప్రతిపక్షం గుండుసున్న అయిపోయింది. కార్పోరేట్లు, మీడియా మద్దతు పుష్కలంగా ఉంది. మోదీ ఏం చేసినా దేశహితం కోసమే చేస్తాడని నమ్మి, గణాంకాలతో సహా వాస్తవాలు ఎత్తి చూపి విమర్శించిన వారినైనా దేశద్రోహులుగా ముద్ర కొట్టే వాతావరణం దేశమంతా అలుముకుంది. జమిలి ఎన్నికలకు యింతకంటె మంచి తరుణం లేదు అనుకుంటున్న సమయంలో తాజా ఎన్నికలు వచ్చాయి. ఈ ఫలితాల తర్వాత జమిలి ఎన్నికలపై బిజెపి పునరాలోచనలో పడడం తథ్యమనిపిస్తోంది.
2014 పార్లమెంటు ఎన్నికలలో ఆర్థిక ప్రగతి, అభివృద్ధి గురించి ఊరించిన మోదీ 2019 వచ్చేసరికి ఆర్థికవిషయాలు చర్చించలేదు. బాలాకోట్, ఫుల్‌వామా అంటూ అతిజాతీయవాదాన్ని ముందుకు తెచ్చాడు. ఆర్థిక గణాంకాలు బయటకు రాకుండా తొక్కిపెట్టాడు. ప్రజలంతా ఆ మాయలో పడ్డారు. మోదీకి మరిన్ని సీట్లు యిచ్చారు. ఆ తర్వాత గణాంకాలు బయటకు వచ్చాయి. ప్రజలు పరిస్థితి దుర్భరంగా ఉందని, కొనుగోలు శక్తి నశించి, పరిశ్రమలు మూతబడ్డాయని అందరికీ తెలిసిపోయింది. అయినా మళ్లీ జాతీయవాదం ప్రవచించి, ఆ వూపుతోనే మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధిస్తామని మోదీ, అమిత్ షా నమ్మారు. అసెంబ్లీ ఎన్నికలలో స్థానిక సమస్యలు చర్చించడం మానేసి, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ జాబితా వంటి విషయాలపై లెక్చర్లు దంచారు. ఎన్నికలకు జస్ట్ ముందు రోజు పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై దాడి చేయబోతున్నామని చెప్పించారు. స్థానిక నాయత్వంలో లోపాలున్నా, ప్రజల్లో అసంతృప్తి ఉన్నా, అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లున్నా, రాజకీయపు టెత్తుగడలు వెగటు పుట్టించినా మోదీ మ్యాజిక్‌లో అవన్నీ కొట్టుకుపోతాయని నమ్మారు.
అయితే ఫలితాలు వచ్చాక చూస్తే అలా జరగలేదని తెలిసివచ్చింది. గణాంకాలు పూర్తిగా వచ్చాక అనుకున్న ఫలితాలు ఎందుకు రాలేదన్నది చర్చించవచ్చు కానీ, స్థూలంగా చూస్తే మాత్రం కొట్టవచ్చినట్లు కనబడే విషయాల గురించి మాట్లాడుకోవచ్చు. మహారాష్ట్ర, హరియాణాలలో బిజెపి ఎలాగోలా ప్రభుత్వాలు ఏర్పాటు చేయవచ్చు కానీ వాళ్లు అనుకున్న ఫలితాలు రాలేదన్నది నిర్వివాదాంశం. హరియాణా పార్లమెంటు ఎన్నికలలో పదికి పది స్థానాలు బిజెపి గెలుచుకుంది. 79 అసెంబ్లీ నియోజకవర్గాలలో ముందు ఉంది. ప్రతిపక్షంలోని హేమాహేమీలందరూ మట్టి కరిచారు. జాటేతర ఓట్లన్నిటినీ సమీకృతం చేసుకుని, ఈ సారి 90 సీట్లలో 75 సీట్లలో విజయం ఖాయం అని చెప్పుకున్నారు. అయితే పార్లమెంటులో గెలిచిన 79టిలో దాదాపు సగం, అంటే 40 స్థానాల్లో, అనగా 2014 కంటె 7 తక్కువగా మాత్రమే బిజెపి గెలిచింది. ఐదు నెలల్లోనే యింత మార్పా!?
కాబినెట్‌లోని 8 మంది మంత్రులు ఓడిపోయారు. హరియాణా బిజెపి అధ్యక్షుడు ఓడిపోయాడు. కాంగ్రెసు ముక్త భారత్ సాధిస్తామని విర్రవీగిన బిజెపికి బుద్ధి రావడానికా అన్నట్లు గతంలో కంటె 16 సీట్లు ఎక్కువగా, కాంగ్రెసుకు 31 వచ్చాయి. బిజెపి తరఫున మోదీ, అమిత్ వచ్చి సభలు నిర్వహించగా కాంగ్రెసు తరఫున సోనియా, రాహుల్, మరి ఏ యితర జాతీయ నాయకుడు తొంగి చూడలేదు. స్థానిక నాయకులే తిరిగారు, గెలిచారు. అంటే క్షేత్రస్థాయిలో కాంగ్రెసుకు ఎంత ఓటు బ్యాంకు ఉందో అర్థమవుతోంది. జాట్ ఓట్లు చీల్చేశాం, వాళ్లకు మంగళం పాడేశాం అనుకుంటే యువనాయకుడు దుష్యంత్ చౌటాలా నాయకత్వంలోని జెజెపి ఏకంగా 10 సీట్లు గెలిచింది. తక్కిన 9టిలో లోకదళ్‌కు 1, ఎచ్‌ఎల్‌పికి 1, స్వతంత్రులకు 7 వచ్చాయి. ఈ స్వతంత్రులలో 4గురు బిజెపి తిరుగుబాటు అభ్యర్థులే కాబట్టి వీరిని మళ్లీ పార్టీలో చేర్చుకున్నా 44 దగ్గర ఆగిపోతోంది. ఇక తక్కినవారిపై వల వేసి లాక్కోవలసిందే! 75 వస్తాయనుకున్నవారికి యీ పరిస్థితి దాపురించిందంటే బిజెపికి జమిలి ఎన్నికలపై ధైర్యం ఉంటుందా?
ఇక మహారాష్ట్రకి వస్తే ఫడణవీస్ బ్రహ్మాండంగా పాలిస్తున్నాడు, అతని హవా, మోదీ హవా కలిసి ప్రభంజనం సృష్టిస్తాయి అన్నారు. ఎందుకైనా మంచిదని శివసేనను కలుపుకున్నారు. ఎన్‌సిపి, కాంగ్రెసు నుంచి ఎడాపెడా నాయకుల్ని గుంజుకుని వాటిని ఖాళీ చేసేశారు. పైగా ఎన్‌సిపి అధినేత దగ్గర్నుంచి, చిన్న నాయకుడి దాకా అందరి మీదా కేసులు పెట్టేశారు. మరాఠాలకు రిజర్వేషన్లు యిచ్చేసి ఆకట్టుకున్నారు. అభివృద్ధి పనులు చేపట్టి నగరజనాభాను ఆకర్షించారు. అందువలన 288 సీట్లలో 250 వచ్చేస్తాయని వాళ్లు చెప్పుకున్నా, హీనపక్షం 200-225 వస్తాయని అందరూ అంచనా వేశారు. ఎందుకంటే బిజెపి-సేన కూటమికి పార్లమెంటు ఎన్నికలలో 48 ఎంపీ సీట్లలో 41 సీట్లు (అనగా 220 అసెంబ్లీ సీట్లు అన్నమాట) వచ్చాయి. ఇప్పుడు 225 రావడంలో అబ్బురమేముంది అనుకుంటే ఫైనల్‌గా 161 దగ్గర ఆగింది!
164 సీట్లలో పోటీ చేసిన బిజెపికి 105 వచ్చాయి. అంటే 2014తో పోలిస్తే 17 తగ్గాయి. శివసేనకు గతంలో కంటె 7 తగ్గి 56 వచ్చాయి. వాళ్లు 126 స్థానాల్లో పోటీ చేశారు. చుక్కాని లేని పడవలో ప్రయాణిస్తున్న కాంగ్రెసుకు గతంలో కంటె 2 ఎక్కువగా 44 వచ్చాయి. కుటుంబ తగాదాల్లో మునిగిపోయి, కేసుల్లో యిరుక్కుపోయి డీలా పడిన వృద్ధనాయకుడి నేతృత్వంలో పూర్తిగా చచ్చుపడి పోయిందనుకున్న ఎన్‌సిపికి గతంలో కంటె 13 పెరిగి 54 వచ్చాయి. ఇతర పార్టీల్లోంచి ఫిరాయించిన అనేక మంది బిజెపి అభ్యర్థులు ఓడిపోయారు. సామర్థ్యానికి మారుపేరుగా మారిన ఫడణవీస్ కాబినెట్‌లో ఏకంగా 9 మంది మంత్రులు ఓడిపోయారు. ఇవన్నీ చూసి శివసేన తోక ఝాడిస్తోంది. బిజెపి సీట్లలో సగం కంటె కాస్త ఎక్కువ సీట్లు తెచ్చుకున్నా అధికారంలో ఫిఫ్టీ-ఫిఫ్టీ అంటోంది. ఎందుకంటే బిజెపి బలహీనపడిందని అది గమనించి బ్లాక్‌మెయిల్ మొదలెట్టింది.
ఈ రెండు రాష్ట్రాలు అనే కాదు, దేశం మొత్తం మీద జరిగిన 51 అసెంబ్లీ ఉపయెన్నికలలో కూడా బిజెపి గర్వపడాల్సింది ఏమీ లేదు. ఎక్కడా కొత్తగా గెలవలేదు. కొన్ని చోట్ల పోగొట్టుకుంది, మరి కొన్ని చోట్ల నిలుపుకోగలిగిందంతే. మహారాష్ట్రలో సతారా లోకసభ స్థానం నుండి మేలో గెలిచిన ఎన్‌సిపి అభ్యర్థి బిజెపికి ఫిరాయించి, ఆ పార్టీ తరఫున పోటీ చేసి యీ సారి ఎన్‌సిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. మోదీ, అమిత్‌ల సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఆరు చోట్ల జరగగా కాంగ్రెసుకు మూడు సీట్లు వచ్చాయి. బిజెపి మూడు చోట్ల స్థానాన్ని నిలుపుకోగలిగింది. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసు గెలుపుకు తనే కారణమని చెప్పుకున్న అల్పేశ్ ఠాకూర్ లోకసభ ఎన్నికల సమయంలో బిజెపికి ఫిరాయించి, యీ సారి నిలబడి, కాంగ్రెసు చేతిలో ఓడిపోయాడు. బిహార్‌లో బిజెపికి ఉత్తమమిత్రుడుగా వెలుగొందుతున్న నీతీశ్ జెడియు పార్టీ దెబ్బ తింది. అక్కడ 5 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలో నాలుగు జెడియు సిటింగ్ స్థానాలే. కానీ ఒక్కటే నెగ్గింది. రెండు లాలూ పార్టీకి, మరొకటి స్వతంత్రుడికి సమర్పించుకుంది. 5వ స్థానంలో మజ్లిస్ బిజెపిని ఓడించింది. బిజెపి మిత్రపక్షం ఎల్‌జెపి అభ్యర్థి సమస్తిపూర్ ఎంపీగా గెలిచాడు.
యుపిలో ఉపయెన్నికలు జరిగిన 11 స్థానాల్లో 9 బిజెపి సిటింగ్ స్థానాలే. కానీ ఏడే మిగిలాయి. ఒకటి తన మిత్రపక్షమైన అప్నాదళ్‌కు యిచ్చివేయగా మరొకదాన్ని ఎస్పీకి పోగొట్టుకుంది. ఎస్పీ మరో దాన్ని బిఎస్పీ నుంచి గుంజుకుని రెండు గెలిచింది. రాజస్థాన్‌లో 2 స్థానాలకు ఎన్నికలు జరగగా ఒకటి కాంగ్రెసు గెలుచుకోగా, మరొకటి బిజెపి మిత్రపక్షం ఆర్‌ఎల్‌పి నిలుపుకుంది. పంజాబ్‌లో కాంగ్రెసు 3 సీట్లు, అకాలీ దళ్ 1 సీటు గెలుచుకున్నాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెసు బిజెపి నుంచి ఝబువా స్థానాన్ని గెలుచుకుంది. తమిళనాడులో ఎడిఎంకె రెండు స్థానాలూ గెలుచుకుంది. కేరళలో శబరిమల గురించి ఎంత ఆందోళన చేసినా బిజెపికి కలిసి రాలేదు. లెఫ్ట్ ఫ్రంట్‌కు రెండు రాగా, కాంగ్రెస్ ఫ్రంట్ రెండు స్థానాలు నిలుపుకుంటూ మూడోది సిపిఎం నుంచి గుంజుకుంది. అసాంలో జరిగిన 4 స్థానాల్లో బిజెపి 3 గెలిచింది. నాలుగోది ఏఐయుడిఎఫ్ గెలుచుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో స్వతంత్రుడు నెగ్గాడు. ఇక పార్లమెంటు ఎన్నికలలో నాలుగు సీట్లు గెలిచి తెలంగాణలో తెరాసకు మేమే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బిజెపికి హుజూర్‌నగర్‌లో 1% ఓట్లు కూడా రాలేదు.
ఫలితాలు యిలా వచ్చాయంటే దాని అర్థం, ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయని కాదు. బిజెపికి బుద్ధి చెప్పాలనుకున్న గ్రామీణ ప్రజలు చచ్చుపుచ్చు పార్టీలకైనా ఓటేశారు. కౌరవసేన చూసి పారిపోయిన ఉత్తర కుమారుడిని బృహన్నల మళ్లీ యుద్ధక్షేత్రానికి లాక్కుని వచ్చినట్లు కోమాలో ఉన్న కాంగ్రెసును లేపి, కూర్చోబెట్టి ఊపిరి పోశారు. ఇది అర్థమైనప్పుడు జమిలి ఎన్నికల పట్ల బిజెపికి గల ఉత్సాహం నీరుకారుతుందనేది వాస్తవం. పరిస్థితులు చక్కబడేవరకు బిజెపి ఆ ఆలోచన చేయకపోవచ్చు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2019)
[email protected]