ప్రజాదరణ ఉన్నా లేకపోయినా రాజకీయ నాయకుల్లో చాలామంది రాజకీయాలను వదిలేయడానికి ఇష్టపడరు. యేవో పదవులు వస్తాయని ఎదురు చూస్తుంటారు. ఏనాటికైనా దశ తిరుగుతుందని అనుకుంటూ ఉంటారు. యాక్టివ్ పాలిటిక్స్ వదిలేసిన కొందరు రాజకీయ నాయకులు గవర్నర్ లాంటి పెద్దగా రిస్కు లేని పోస్టులు కావాలని కోరుకుంటారు. లేదా తామున్న పార్టీలోనే కీలకమైన పోస్టు వస్తే బాగుండునని అనుకుంటారు.
ఇలా తాపత్రయపడుతూనే ఉంటారు. ఏదీ లేకపోతే వారిని వీరిని తిట్టుకుంటూ (విమర్శిస్తూ ) కాలక్షేపం చేస్తుంటారు. మొత్తం మీద వార్తల్లో ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ముఖ్యమంత్రి పదవులు చేసిన వారు కూడా కొందరు మౌనంగా ఉంటారు. సరే …వయసైపోయి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉన్నవాళ్లు మౌనంగా ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు.
కానీ వయసులో ఉన్నవారు కూడా ఉన్నారంటే వారిని అర్ధం చేసుకోవడం కష్టం. అలా ఎవరికీ అర్ధం కాకుండా ఉన్న వ్యక్తి ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా ఇవ్వాలని డిసైడ్ అయినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర విభజనను ఆపలేకపోయిన ఈ మాజీ క్రికెట్ టీమ్ కెప్టెన్ చివరకు పదవికి రాజీనామా చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని కూడా విడిచిపెట్టాడు. సొంత పార్టీ పెట్టాడు. తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీని పోటీలోకి దింపాడు. సమైక్య రాష్ట్రం ఉండాలని తాపత్రయ పడిన కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించారు. దాంతో ఆ పార్టీ కథ కంచికి వెళ్ళిపోయింది.
ఆనాటి నుంచి ఆయన మౌన స్వామిగా మారిపోయాడు. బయట కనిపించడం మానేశాడు. ప్రస్తుతం ఆయన వయసు 62 ఏళ్ళు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఇంకా చిన్నవాడే కదా. అయినప్పటికీ యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఏపీ రాజకీయాల్లోకి రావడానికి నల్లారి సుముఖంగా లేడు. ఆయన హైదరాబాద్ లోని ఇంటికే పరిమితమయ్యాడు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తున్నాడు. రాష్ట్ర విభజన జరిగిన చాలా కాలానికి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినా మౌనం మాత్రం వీడలేదు.
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉన్నాడు. కాంగ్రెస్ నేతలు ప్రచారానికి ఆహ్వానించినా తిరస్కరించాడు. బద్వేలు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్నాడు. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆయనపై ఆశలు పెట్టుకుంది. యాక్టివ్ గా పని చేస్తాడనుకుంది.
ఏపీలో పార్టీని ముందుకు తీసుకు పోతాడనుకుంది. కానీ ఏదీ చేయలేదు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలను తీసుకునేందుకు సిద్థంగా లేడు. నాయకులు కిరణ్ కుమార్ రెడ్డిని గుర్తుపెట్టుకోవొచ్చునేమోగానీ ప్రజలు మర్చిపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి ఎవరనే పరిస్థితి వచ్చింది.