మెల్లమెల్లగా థియేటర్ వ్యవస్థ గాడిన పడింది. మంచి కంటెంట్ పడితే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు వస్తున్నారనే క్లారిటీ వచ్చింది. అయినప్పటికీ అక్టోబర్ బాక్సాఫీస్ కళ తప్పింది. ఒక్కటంటే ఒక్క సాలిడ్ హిట్ కూడా లేదు. కొన్ని సినిమాలు డిజాస్టర్ అవ్వగా, మరికొన్ని ఓకే అనిపించుకున్నాయంతే.
సాయితేజ్ నటించిన రిపబ్లిక్ సినిమాతో అక్టోబర్ బాక్సాఫీస్ రన్ మొదలైంది. కానీ ఆ సినిమా మంచి స్టార్ట్ అందించలేకపోయింది. దేవకట్టా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సందేశం ఎక్కువై వినోదం తక్కువైంది. నిత్యం దినపత్రికల్లో కనిపించే సమస్యలన్నింటినీ ఇందులో గంపగుత్తగా చర్చించారు. మంచి డైలాగులున్నప్పటికీ బి, సి ఆడియన్స్ కు అవి ఎక్కలేదు. వీటికి తోడు పూర్ ప్రొడక్షన్ వాల్యూస్ ఫలితంగా రిజల్ట్ తేడా కొట్టేసింది.
ఈ సినిమాతో పాటు వచ్చిన ఇదే మా కథ, ఆట నాదే వేట నాదే సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇక్కడ ఇదే మా కథ సినిమా గురించి కాస్త చెప్పుకోవాలి. శ్రీకాంత్, భూమిక లాంటి మంచి ప్యాడింగ్ ఉన్న సినిమా ఇది. రిలీజ్ కు ముందే 2 పాటలు కూడా హిట్టయ్యాయి. కానీ నెరేషన్ ఫ్లాట్ గా ఉండడం, ఎమోషన్ లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది. హీరో సుమంత్ అశ్విన్ ఈ సినిమాకు మరో డ్రాబ్యాక్.
సాయితేజ్ వచ్చిన వారం గ్యాప్ లోనే అతడి తమ్ముడు వైష్ణవ్ తేజ్ వచ్చాడు. క్రిష్-వైష్ణవ్ తేజ్-రకుల్ కలిసి చేసిన సినిమా కొండపొలం. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవ్, కొండపొలంతో మాత్రం ఆ ఫీట్ ను అందుకోలేకపోయాడు.
చిన్న పాయింట్ ఆధారంగా, ఓ నవలను బేస్ చేసుకొని తీసిన ఈ సినిమాను అటు ఆర్ట్ ఫిలింగా తీయలేక, ఇటు కమర్షియల్ ఫార్మాట్ లోకి మార్చలేక ఇబ్బంది పడ్డారు. ఫలితం కూడా అలానే అటుఇటు అన్నట్టుగా వచ్చింది. ఈ సినిమాతో పాటు గోపీచంద్ అప్పుడెప్పుడో నటించిన ఆరడుగుల బుల్లెట్ అనే సినిమా కూడా రిలీజైంది. కానీ 6 రోజులు కూడా ఆడలేదు.
ఇక కీలకమైన దసరా బరిలో మహాసముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లిసందDసినిమాలు నిలిచాయి. వీటిలో మహాసముద్రంపై భారీ అంచనాలుండేవి. కానీ ముందుగా ఫ్లాప్ అయింది ఆ సినిమానే. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను కూడా దాదాపు ఫ్లాప్ అనేశారంతా.
రివ్యూస్ కూడా అలానే వచ్చాయి. కానీ పండగ సీజన్ తో పాటు, సూపర్ హిట్ సాంగ్స్, పూజాహెగ్డే ఎప్పీయరెన్స్ కలిసిరావడంతో బ్యాచిలర్ బతికిపోయాడు. అటు పెళ్లిసందD సినిమాను అంతా మూకుమ్మడిగా ఫ్లాప్ అని తేల్చేశారు. అయినప్పటికీ కొత్త హీరోయిన్ శ్రీలీల అందాల కారణంగా సి-సెంటర్లలో ఈ సినిమా బాగానే పెర్ఫార్మ్ చేసింది.
దసరా తర్వాత వారం ఏకంగా అరడజను సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో ఏ ఒక్కటి ఆకట్టుకోలేదు. భారీ ప్రమోషన్ తో వచ్చిన నాట్యం సినిమా ఫ్లాప్ అయింది. డాన్స్ కు సంబంధించిన 3 ఎపిసోడ్స్ తప్ప మిగతాదంతా బోర్. ఈ సినిమాతో పాటు వచ్చిన మధురవైన్స్, అసలేం జరిగింది, క్లిక్ లాంటి సినిమాలన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. ఇదే వారం జీ5 యాప్ లో సునీల్ నటించిన హెడ్స్ అండ్ టేల్స్ కూడా రిలీజైంది. మంచి కాన్సెప్ట్ తో, మంచి నటీనటులతో ఓ కథను ఎలా ఖూనీ చేయవచ్చో దీన్ని చూస్తే అర్థమౌతుంది.
ఇక అక్టోబర్ కు ఫినిషింగ్ టచ్ ఇస్తూ చాలా సినిమాలే రిలీజయ్యాయి. వీటిలో అంచనాలతో వచ్చిన సినిమా వరుడు కావలెను. పాత స్టోరీకే కొత్త కలరింగ్ ఇస్తూ తీసిన ఈ సినిమా యూత్ ను మెప్పించదు. ఫ్యామిలీ ఆడియన్స్ ను పూర్తిస్థాయిలో సంతృప్తి పరచదు. ట్రెండ్ కు తగ్గట్టుగా లేని ఈ సినిమా రిజల్ట్ తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
రొమాంటిక్ సినిమా చూసిన తర్వాత, అదే కళ్లతో వరుడు కావలెను సినిమా చూసిన జనాలు మాత్రం మూవీ బ్లాక్ బస్టర్ అంటారు. దీన్ని బట్టి రొమాంటిక్ సినిమా ఎంత హింసించిందో అర్థం చేసుకోవచ్చు. హీరో ఆకాష్ పూరి ఏ దశలోనూ మోయలేని ఈ కథను ప్రేక్షకులు కూడా భరించలేకపోయారు. వీటితో పాటు వచ్చిన మిషన్-2020, ఓ మధు, మిస్టర్ ప్రేమికుడు లాంటి సినిమాలపై చర్చ కూడా అనవసరం. ఇక ఇదే వారం సోనీ లివ్ లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా అనే ఓ చిన్న సినిమా కూడా బోర్ కొట్టించింది.
మొత్తంగా చూసుకుంటే.. అక్టోబర్ నెలలో సాలిడ్ హిట్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. దసరా సీజన్ వల్ల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, సెన్సిబుల్ ఎలిమెంట్స్ కారణంగా వరుడు కావలెను సినిమాలు మాత్రం ఓకే అనిపిస్తాయి.