కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణాన్ని సినీ రంగం జీర్ణించుకోలేకపోతోంది. ఎంతో భవిష్యత్ ఉన్న ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడవడం పలువుర్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. టాలీవుడ్‌తో పునీత్‌కు మంచి సంబంధాలున్నాయి.
సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లోని పలు పెద్ద కుటుంబాలతో ఆత్మీయ సంబంధా లను కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో పునీత్ మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని అగ్రహీరో నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి బాలయ్య వెళ్లి పునీత్‌కు అంతిమ నివాళుర్పించారు. పునీత్ పార్థివదేహాన్ని చూసి భావోద్వేగానికి గురైన ఆయన కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం పునీత్ సోదరుడు శివరాజ్‌కుమార్‌ని ఆయన పరామర్శించి ఓదార్చారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ పునీత్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తల్లడిల్లారు.
ఆప్తుడైన పునీత్ రాజ్‌కుమార్ మరణం తనకు తీరని లోటన్నారు. పునీత్ మన మధ్య లేరన్న విషయాన్ని నమ్మలేకపో తున్నాన్నారు. పునీత్ మరణ వార్త తనను ఎంతగానో కలచివేస్తోందన్నారు. రాజ్‌కుమార్ కుటుంబంతో తమకెంతో అనుబంధం ఉందన్నారు.
ఒక తల్లి కడుపున పుట్టకపోయినా తామంతా అన్నదమ్ములా కలిసిమెలిసి ఉండేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. తాను నటించిన ‘ఎన్టీఆర్’ సినిమా ప్రమోషన్‌కి కూడా పునీత్ వచ్చాడన్నారు. ఒక కళాకారుడిగా, మంచి మనిషిగా ఆయన ఎప్పటికీ మన గుండెల్లోనే ఉంటారన్నారు.