టీడీపీ అధినేత చంద్రబాబుపై నగరి ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్‌బ్రాండ్ ఆర్‌కే రోజా విరుచుకుపడ్డారు. కుప్పం పర్యటనలో జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో రోజా తనదైన శైలిలో స్పందించారు. మిస్టర్ జగన్…తేల్చుకుందాం రా అని చంద్రబాబు సవాల్ విసరడం వైసీపీ నాయకులకి ఆగ్రహం తెప్పించింది.
ఈ నేపథ్యంలో నగరి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎక్స్ అఫిషియో మెంబర్ హోదాలో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులపై తీర్మానాలను ఆమోదించారు. రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ఎంత మానసిక ఒత్తిడిలో ఉన్నారో, అంతకంటే ఎక్కువ ఒత్తిడిలో నగరి నియోజక వర్గ టీడీపీ నాయకులున్నారని ఎద్దేవా చేశారు.
బాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రా.. లేక వీధి రౌడీనా? అని రోజా గట్టిగా నిలదీశారు. 'యధా రాజా తథా ప్రజా' అనడం తెలిసిందే అన్నారు. అయితే ఇప్పుడు 'యధా రాజా తథా చంద్రబాబు' అన్నది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకే సరిపోతుందని ఆమె వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు, అతనిని నమ్మి ఓటేసిన కుప్పం నియోజకవర్గ ప్రజలకి హంద్రీ నీవా ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు కూడా ఇవ్వకుండా చేశారని ఆరోపించారు. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కుప్పానికి నీళ్లు ఇవ్వలేదని విమర్శించడం ఎక్కడి న్యాయమని రోజా నిలదీశారు.
కుప్పంలో కనీసం ఇళ్లు, కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోలేదని తప్పు పట్టారు. అలాగే సొంత నియోజకవర్గ ప్రజల అభి వృద్ధి, సంక్షేమాలను గాలికి వదిలేశారని బాబుపై నిప్పులు చెరిగారు. ఈ రోజు ప్రజలని ఓట్లు వేయమని అడగడం హాస్యాస్పద మన్నారు. సిగ్గు లేకుండా కుప్పానికి రండి తేల్చుకుందాం అని బాబు పిలుస్తున్నారని రోజా వెటకరించారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు స్వయంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కుప్పంలో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి పౌరుషం చూపాలని బాబు పిలుపునివ్వడం తెలిసిందే. దానికి రోజా తనదైన కౌంటర్ ఇచ్చారు. తేల్చుకుందామంటూ జగన్‌కు సవాల్ విసరడానికి సిగ్గులేదా అని రోజా ప్రశ్నించడం హాట్ టాపిక్‌గా మారింది.