Advertisement

Advertisement


Home > Politics - Opinion

అర్ధం లేని అల్లు అరవింద్ మాటలు

అర్ధం లేని అల్లు అరవింద్ మాటలు

సాధారణంగా ఏరంగంలోనైనా జీతాల పెరుగుదలకి ఒక లెక్కుంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాల్లో అయితే బేసిక్ మీద 3%, డియర్నెస్ అలోవెన్స్ పేరుతో మరో 2% కలిసి గరిష్టంగా ఏడాదికి 5% పెరుగుదల ఉండొచ్చు. 

ఎమ్మెన్సీ ఉద్యోగాల్లో అంతా పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత ఊడబొడిస్తే అంత శాతంలో ఇన్సెంటివ్ ఉంటుంది. అది కూడా మార్కెటింగ్ వంటి విభాగాల్లోనే. మిగిలిన వాళ్లకి కంపెనీకి లాభాలొస్తే మంచి బోనస్సులుండొచ్చు. లేకపోతే వస్తున్న జీతం తీసుకుని అలా పని చేస్తూ ఉండాలి. 

ఇక మామూలు ప్రైవేట్ కంపీనీల్లో అయితే జీతం పెరుగుదల ఎప్పుడన్నది ఎవ్వరూ చెప్పలేరు. 

సినిమారంగంలో రచయితలు, సంగీతం దర్శకులు, మేకప్పేసే వాళ్లు, క్యారెక్టర్ నటీనటులు, హీరోయిన్స్, ఎడిటర్లు, కెమెరా విభాగం వాళ్లు...ఇలా అనేకమంది ఉంటారు. వీళ్లకి కూడా వారి రేంజుని బట్టి ఒక పేమెంట్ ఉంటుంది. అది పెరుగుతుందా తగ్గుతుందా అనేది వాళ్లు చేస్తున్న సినిమాల విజయాలు, వాళ్లకున్న డిమాండ్, కాంపిటీషన్ బట్టి ఉంటుంది. 

కానీ అదేంటో గానీ, హీరోలకి మాత్రం ప్రతి సినిమాకి రెమ్యునరేషన్ పెరుగుతూనే ఉంది. సినిమా జయాపజయాలతో సంబంధం ఉండదు. పోయిన సినిమాకి 18 కోట్లు తీసుకుంటే తదుపరి సినిమాకి 20 తీసేసుకోవాలి అనుకుంటున్నారు. కొంతమందైతే ముప్పై నుంచి పెంచి నలభై అంటున్నవాళ్లున్నారు. ఇచ్చే నిర్మాతలు ఇస్తున్నారు కూడా. "అడిగే వాళ్లు అడుగుతున్నారు.. ఇచ్చే వాళ్లు ఇస్తున్నారు.. మధ్యలో మీ బాధేంటి" అని అంటున్నవాళ్లున్నారు. 

బాధేం కాదు.. దీనివల్ల మిగిలిన విభాగాల వాళ్లకి, మరీ ముఖ్యంగా నిర్మాతకి, పంపిణీదారులకి భారీ నష్టాలు మిగులుతున్నాయి. నిర్మాతలు అన్నీ తెలిసి గతిలేనట్టుగా హీరోల జీతాలు ఎందుకు పెంచుకుంటూ పోతున్నారో ఎవ్వరికీ అర్ధం కావడంలేదు. దీనివల్ల నిర్మాణ వ్యయం పెరగడం, పర్యవసానంగా భారీ రేట్లకి పంపిణీ చేయడం, చివరికి కలెక్షన్లు ఘనంగా వచ్చినా లాభాల బాట పట్టడం కష్టతరమవడం జరుగుతోంది. 

దీనిపై స్పందిస్తూ తాజాగా అల్లు అరవింద్ ఇలా చెప్పారు: "పెరిగిన సినిమా బడ్జెట్ లో హీరోల రెమ్యూనరేషన్ 20-25 శాతం మాత్రమే. హీరోల వల్ల కాస్ట్ పెరగడం లేదు.. కాస్ట్ పెరిగిన సినిమాల్లో హీరోలుంటున్నారు అంతే. నేను సినిమాల పేర్లు చెప్పను కానీ, కొన్ని సినిమాల్ని మీరు గమనిస్తే సినిమాల కాస్ట్ ఎంత, రెమ్యూనరేషన్ ఎంతనేది మీ జర్నలిస్టులే లెక్కలేసుకోండి. పారితోషికాలు తక్కువే ఉన్నాయి.  కాబట్టి హీరోల వల్ల సినిమా బడ్జెట్ పెరిగిపోతోందనడం సరికాదు. పెద్ద హీరోల సినిమాల్ని పెద్దగా చూపించకపోతే ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదని, ఈ క్రమంలో బడ్జెట్ పెరిగింది తప్ప, హీరోల పారితోషికాల వల్ల బడ్జెట్ పెరగలేదు"

తన ఇంట్లో స్టార్ హీరో ఉన్నాడు. తన మెగా-అల్లు కుటుంబంలో చాలామంది పెద్ద స్టార్లున్నారు. కాబట్టి ఎలా ఆర్గ్యూ చేసినా హీరోల రెమ్యునరేషన్స్ ని వెనకేసుకు రావాలి తప్ప మరోలా చెప్పడం ఆయన వల్ల కాలేదు. 

కానీ ఆయన చెప్పింది అర్ధరహితం. ఒకప్పుడు నిర్మాతలంటే ఆ హుందాతనమే వేరుగా ఉండేది. వాళ్ల దయ కోసం హీరోలు లైన్లు కట్టేవాళ్లు. రీజనెబుల్ పారితోషకాలతో జాగ్రత్తగా సినిమాలు తీసి వచ్చిన లాభాల్లో వాళ్ల అగ్రభాగం వాళ్లు తీసుకుని  బయటపడేవారు. ఈ లిష్టులో అల్లు అరవింద్ కూడా ఉండేవారు. 

ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్ లాంటి హీరోలు తెరమీద ఎంత రిచ్ గా కనపడ్డా బయట పంచెలు కట్టుకుని తిరిగేవారు. అప్పట్లో ఇప్పుడున్నంత మీడియా లేదు కాబట్టి అలా ఉండేవాళ్లులే అనుకోవచ్చు. కానీ ఇప్పటికీ రజనీకాంత్ ఎలా ఉంటాడో మనకు తెలుసు.

కుర్ర స్టార్ హీరోలకి మాత్రం సినిమా తెరమీదే కాకుండా బయట కూడా డాబుసరి బిల్డప్పులు ఎక్కువైపోయాయి. ఆ ఖర్చుని కూడా అప్పటికి సెట్స్ మీద ఉన్న సినిమాల నిర్మాతల మీద వేసేస్తున్నారు. 

మొన్నామధ్య ఇలాగే.. ఒక నిర్మాత ఒక స్టార్ హీరోకి పర్సనల్ ట్రిప్ కోసం ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేసాడు. భారీ బడ్జెట్టుతో ఆ హీరో పుట్టినరోజు కూడా జరిపాడు. ఆ ఖర్చునంతా అప్పటికి సెట్ మీద ఉన్న తన సినిమా బడ్జెట్టులో కలిపేసాడు. 

ఇలా తెర మీద కాకుండా, తెర వెనుక పారపోస్తున్న డబ్బు ఎక్కువగా ఉంది. హీరోలే కాదు.. కొందరు స్టార్ క్యారెక్టర్ ఆర్టిష్టులు కూడా క్యారవాన్లు, వ్యక్తిగత సిబ్బంది అంటూ వాళ్లకి ఇవ్వాల్సిన జీతాలు కూడా నిర్మాతల చేతే ఇప్పిస్తున్నారు. అలా లగ్జరీ మరిగిన నటీనటులు దిగమంటే దిగట్లేదు. 

ఫలానా నిర్మాత తమను అలా చూసుకున్నాడని చెప్తే తాము ఇంకా గొప్పగా చూసుకుంటామని బయలుదేరుతున్నారు వేరే నిర్మాతలు. 

ఇంతకీ ఈ నిర్మాతల తెలివేంటి? తెగువేంటి? 

వీళ్లు కచ్చితంగా గతంలో ఉన్న నిర్మాతల బాపతు కాదు. వీళ్లల్లో అధికశాతం ఎన్నారైలు. కష్టార్జితాన్నైతే ఇలా విచ్చలవిడిగా ఖర్చు చేయరు కదా అనిపిస్తుంది. వాళ్ళు చేస్తున్న అసలు వ్యాపారమేంటి? ఆ లాభాలేంటి? వందల కోట్లల్లో నష్టమొస్తున్నా వాళ్లు ఈ సినిమా నిర్మాణాన్ని ఎందుకు వదలడంలేదు అనే దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టే సమయమొచ్చింది. 

అంటే ఏదో నేరాలు, ఘోరాలు జరిగిపోతున్నాయని కాదు. అంత వైభావాన్ని అంత తేలిగ్గా హీరోలకి పంచుతూ, కోట్లు పోయినా మందహాసంతో మరో సినిమా తీసుతున్నారంటే ఆ ఆర్ధికపరిపుష్టికి కారణమేంటో తెలుసుకోవాలని ఉత్సాహం మాత్రమే. ఆ మార్గం మంచిదైతే ఆ దిశగా డబ్బు సంపాదించుకుని తాము కూడా సినిమాలు చేసుకోవచ్చని సగటు చిన్న నిర్మాతలు కూడా వేచి చూస్తున్నారు. 

ఇదిలా ఉంటే టాప్, మిడ్ రేంజ్ హీరోలు తమ నిర్మాతల్ని కేవలం ఊడిగానికి వాడుకునే వ్యక్తుల్లా చూస్తున్నారు. తాము చెప్పినట్టు నిర్మాతలు వినాలి తప్ప, నిర్మాతలు చెప్పినట్టు తాము వినే రోజులు ఎప్పుడో పోయాయి. 

ఉదాహరణకి ఒక సినిమా బడ్జెట్ 100 కోట్లని నిర్మాత చెప్పాడు. దాంట్లో 50 కోట్లు హీరో రెమ్యునరేషనే అని అన్నాడు. 

అప్పుడు వెంటనే హీరో అనేది ఒకటే.." మిగిలిన 50 కోట్లు ఎలా ఖర్చు పెట్టబోతున్నారో చెప్పండి" అని.

దానికి నిర్మాత, "ఫలానా హీరోయిన్ కి 2 కోట్లు, ఫలానా క్యారెక్టర్ నటుడికి 1 కోటి... ఫలానా లోకేషన్ చార్జ్ ఇంత... వర్కింగ్ డేస్‌ ఇన్ని" అని చెప్పుకుంటూ మొత్తం లిష్ట్ ఇచ్చాడనుకుందాం. 

అప్పుడు హీరో వెంటనే, "ఆ ఫలానాలన్నీ ఎందుకు దండగ. కొత్త వాళ్లని పెట్టుకో. తక్కువకొస్తారు. దాంతో పది కోట్లు మిగులుతాయి. లొకేషన్ ఫలానాది వాడు. 2 కోట్లు మిగులుతాయి. వర్కింగ్ డేస్ 50 వద్దు.. 40 లో పూర్తి చెయ్యమని దర్శకుడికి చెప్పు.. మరో కోటి మిగులుతుంది". 

"అబ్బో హీరో గారు పెద్దమనసుతో 13 కోట్లు ఖర్చు మిగిల్చారే" అని నిర్మాత మనసులో అనుకునే లోపు..

"ఆ మిగిలిన 13 కోట్లు నాకిస్తానన్న 50 కి కలిపి నా జీతాన్ని 63 కోట్లు చెయ్యి" అన్నాడు. 

ఇదేదో కల్పిత సన్నివేశం అనుకున్నారేమో. ఆ మధ్యన నిజంగానే ఒక స్టార్ హీరోకి, నిర్మాతకి జరిగిన సంభాషణ ఇది. 

హీరోల ఆశ ఈ రేంజులో ఉంది. వాళ్ల సినిమాల్లో పెద్ద పాత్రల్లో కూడా కొత్తవాళ్లు కనిపిస్తున్నారంటే ట్యాలెంటుని ఎంకరేజ్ చేస్తున్నారు అనుకునేరు!! కాదండి బాబు! బడ్జెట్ మిగిల్చి దానిని హీరోగారు పట్టుకుపోవడానికి. 

అప్పట్లో సీనియర్ ఎన్.టి.ఆర్ మీద ఒక టాక్ ఉండేది. ఏ పాత్ర చేసినా ఆ బట్టలు, వేసుకునే కోట్లు పట్టుకుపోయి తమ రామకృష్ణా స్టూడియోలో పెట్టేసుకునేవారట. అది నిజమో, గాసిప్పో తెలీదు! టాక్ మాత్రం ఉండేది. 

ఆయన వేసుకునే కోట్లే పట్టుకెళ్లేవాడేమో!

ఇప్పటి స్టార్ హీరోలు కరెన్సీ కోట్లు పట్టుకుపోతున్నారు!

నిర్మాతకి ఒక్క పిసరు మిగల్చకుండా పీల్చేస్తున్నారు.

ఒక్క పైసా వదలకుండా ఊదేస్తున్నారు. 

"తెర మీద భారీతనం కనపడడానికి బడ్జెట్ పెరిగింది తప్ప హీరోల జీతాలు కావుష‌.. అని అల్లు అరవింద్ అన్న మాటలు ఎంత అర్ధరహితమో అర్ధం కావట్లేదూ!!. 

హీరోలకిచ్చే రెంటెడ్ ప్రైవేట్ జెట్లు, స్టార్ హోటల్ సూట్లు.. ఇవన్నీ తెర మీద కనిపిస్తాయా? పైగా హీరోలు తమ అధిక రెమ్యునరేషన్ కోసం పాపులర్ నటీనటుల్ని తీసేసి కొత్తవాళ్లని పెట్టుకుంటే ఇంకెక్కడి భారీతనం? 

మొన్న "స్కంద" సినిమా వచ్చింది. దాదాపు వందకోట్ల బడ్జెట్టన్నారు. తెర మీద ఆంధ్రా సీయం, తెలంగాణా సీయం ప్రధాన పాత్రలు. ఆ పాత్రల్ని పోషించిన నటులు పేర్లెవిటో ఠక్కున చెప్పలగలరా? వస్తున్న ప్రతి సినిమాని క్రమం తప్పకుండా చూసేవాళ్లకి కూడా కష్టమే చెప్పడం. ఇదొక్కటీ ఏదో ఉదాహరణకి చెప్పుకుంటున్నాం కానీ ఈ రకంగా ఎన్ని సినిమాలుంటున్నాయో గమనిస్తే మీకే అర్ధమవుతుంది. ఈ హీరోలకి స్టార్ డైరెక్టర్స్ కూడా కలిస్తే నిప్పుకి గాలి తోడైనట్టే. ఇద్దరూ కలిసి నిర్మాతని నమిలి చప్పరించేస్తారు. భారీతనం పేరుతో తమ జేబుల్ని భారీగా నింపుకుని ఒక నాశిరకం సినిమా జనం మొహాన కొడతారు. పంపిణీదారులు నష్టపోతారు. జనం మోసపోతారు. అదే జరుగుతున్నది. 

మారుతున్న కాలంలో ఇదీ ఒక పరిణామమే అనుకుని సర్దుకుపోవాలంతే. ఒక్కటి మాత్రం సత్యం..ఇదే విధానం కొనసాగితే భవిష్యత్తులో రిచ్ హీరోలుంటారు తప్ప "రిచ్" అనబడే ఏ టెక్నీషియన్, ఏ నిర్మాత ఉండడు. 

- శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?