Advertisement

Advertisement


Home > Politics - Opinion

బీజేపీకి ఇది అర్థ‌మ‌వుతోందా?

బీజేపీకి ఇది అర్థ‌మ‌వుతోందా?

తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌రిస్థితి ఎన్నిక‌ల స‌మ‌యానికి మ‌రీ ఇలా ఢ‌మాల్ అన్న‌ట్టుగా ప‌డిపోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల స‌మ‌యంలో నిజంగానే బీఆర్ఎస్ కు బీజేపీనే ప్ర‌త్యామ్నాయం అనేంత స్థాయిలో జ‌న‌సామాన్యంలో చ‌ర్చ జ‌రిగిన మాట వాస్త‌వం. అప్పటి దూకుడు రాజ‌కీయాలు, భావోద్వేగ రాజ‌కీయం.. ఇదంతా కమ‌లం పార్టీ గ్రాఫ్ ను ఒక రేంజ్ కు తీసుకెళ్లింది. కాంగ్రెస్ కు అల‌వాటైన పొర‌పాట్లు, ఇవ‌న్నీ బీజేపీని హీరోగా నిల‌బెట్టాయి!

ఇప్ప‌టికిప్పుడు బీజేపీ తెలంగాణ‌లో అధికారంలోకి రాక‌పోయినా.. ఎప్పుడు బీఆర్ఎస్ ను దించాల‌ని ప్ర‌జ‌లు అనుకున్నా.. వారు ప‌ట్టం గ‌ట్టాల్సింది అయితే బీజేపీకే అనే అభిప్రాయాలు అప్పుడు వినిపించాయి. మ‌రి ఆ స్థితి నుంచి మ‌రింత‌గా ముందుకు వెళ్లాల్సిన బీజేపీ ఆ దారి త‌ప్ప‌డం గ‌మ‌నార్హం!

దుబ్బాక ఉప ఎన్నిక‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు వంటి స‌మ‌యంలో.. బీజేపీ మంచి ఊపు మీద క‌నిపించింది. ఆ త‌ర్వాత ఆ వేడి త‌గ్గింది. బీజేపీ ర‌గిల్చిన భావోద్వేగం కూడా ఎక్కువ స‌మ‌యం పాటు కొన‌సాగ‌లేదు! క‌ర్ణాట‌క‌లో అయితే ఇంత‌కు మించి భావోద్వేగాల‌ను రగిల్చే ప్ర‌య‌త్నం ఇటీవ‌లి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ ప్ర‌యత్నించింది. 

స్వ‌యంగా న‌రేంద్ర‌మోడీనే కేర‌ళ స్టోరీ వంటి సినిమా గురించి ప్ర‌స్తావించి ఓటు అడిగారు! అలాంటి సినిమాలు చూసి ఓటేయాల‌ని అడుక్కునే ప‌రిస్థితికి వెళ్లారు. అయితే సౌత్ లో బీజేపీ మార్కు భావోద్వేగ రాజ‌కీయాలు కొద్ది సేపే న‌డుస్తాయ‌ని, అవి లాంగ్ ట‌ర్మ్ లో న‌డ‌వ‌వ‌నే క్లారిటీ క‌మ‌లం పార్టీకి వ‌చ్చి ఉండాలి. నార్త్ లో వాటితో ద‌శాబ్దాల‌కు ద‌శాబ్దాలు ప్ర‌జ‌ల‌ను తిప్పుకోవ‌చ్చు కానీ, సౌత్ లో అంత తేలిక కాద‌నే క్లారిటీ వ‌చ్చి ఉండాలి.

మ‌రి తెలంగాణ‌లో లేచిన‌ట్టే లేచి బీజేపీ మూల‌న కూర్చున్న‌ట్టుగా తయారైంది. ఆ పార్టీలో చేరిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి లాంటి వాళ్లు కూడా ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. తెలంగాణ‌లో బీజేపీ ప‌తాన‌వ‌స్థ‌కు మ‌రో సాక్ష్యం ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పొత్తు!

అస‌లు ఏపీలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఉన్న ఓట్లెన్నో క్లారిటీ లేదు. పార్టీ ప‌రంగా ఏ నిర్మాణం లేకుండా కేవ‌లం ఫ్యాన్స్ ఓట్లు ఉన్నాయ‌నే న‌మ్మ‌కంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయం సాగుతోంది. పార్టీ పెట్టి ఇప్ప‌టికే ద‌శాబ్దం గ‌డుస్తున్నా ప‌వ‌న్ క‌నీసం ఎమ్మెల్యేగా నెగ్గ‌లేక‌పోయాడు. ఇంత‌కు మించి ఆయ‌న ఫెయిల్యూర్ స్టోరీ గురించి వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఏపీలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు జిల్లాల చుట్టూ తిరుగుతున్నాడు. కులాన్ని న‌మ్ముకున్నాడు. ఆ రెండింటీని దాటి బ‌య‌ట‌కు వచ్చేంత సీన్ ఆయ‌న‌కు లేకుండా పోయింది.  ఏపీలోనే రెండు జిల్లాల‌ను దాట‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తో తెలంగాణ‌లో పొత్తు అంటూ బీజేపీ త‌న ధీనావ‌స్థ‌ను చాటుకుంది!

ఈ పొత్తు వ్య‌వ‌హారంలో బీజేపీ మ‌రింత అబాసుపాల‌య్యింది త‌ప్ప ఇంకో ఉప‌యోగం లేకుండా పోయింది. తెలంగాణ‌లో జ‌న‌సేన ఏ ఎన్నిక‌ల్లో పోటీ చేసింది? ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఆ పార్టీకి ఒక నిర్మాణం అంటూ ఉంది? ఆ పార్టీకి ఏ సీట్ల‌ని కేటాయిస్తారు?  బీజేపీ త‌నకున్న శ‌క్తికొద్దీ తెలంగాణ‌లో ఈ ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డి ఉంటే.. కొద్దో గొప్పో గౌర‌వం అయినా ద‌క్కేది! అయితే ఇప్పుడు ఎన్నిక‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను సంక‌లో పెట్టుకుని వెళ్తోంది క‌మ‌లం పార్టీ! దీని వ‌ల్ల ప‌డే ఆ నాలుగు ఓట్లైనా ప‌డ‌తాయా? ఈ దెబ్బ‌తో అవి కూడా దూరం అవుతాయా? అనే సందేహాలు జ‌నిస్తున్నాయి బీజేపీ వీరాభిమానుల్లో కూడా! ఏపీలో చెల్ల‌ని పావ‌లా తెలంగాణ‌లో చెల్లుతుందా? అనే ప్ర‌శ్న ఇప్పుడు బీజేపీ ముందుంది.

ఇక వేరే దిక్కులేక ప‌వ‌న్ క‌ల్యాణ్ తో బీజేపీ పొత్తు పెట్టుకుంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక్క‌డ పొత్తు క‌న్నా.. దిక్కులేద‌నే భావ‌నే ప్ర‌జ‌ల్లోకి గ‌ట్టిగా వెళ్తోంది. ఇది కాంగ్రెస్ కు మ‌రో సానుకూలంశంగా మారింది. తెలంగాణ‌లో కాంగ్రెస్ స్థానాన్ని ఆక్ర‌మిస్తాన‌నే ధీమాతో ఉన్న బీజేపీ ఇలా బేల‌గా మారిపోవ‌డం కాంగ్రెస్ శ‌క్తిని మ‌రింత‌గా పెంచేదే అవుతోంది! ఏతావాతా తెలంగాణ‌లో స‌రిగ్గా అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యానికి బీజేపీ త‌న స్థానాన్ని త‌నే కుంచించుకుపోయేలా చేసుకుంది. ఈ ప్ర‌భావం ఎన్నిక‌ల ఫ‌లితాల్లో స్ప‌ష్టంగా కనిపించే అవ‌కాశాలూ ఉన్నాయి.

-హిమ‌

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?