Advertisement

Advertisement


Home > Politics - Opinion

హాఫ్ సెంచరీ ఘనత- బాబుదా, జగన్ దా?

హాఫ్ సెంచరీ ఘనత- బాబుదా, జగన్ దా?

చంద్రబాబు జైలు జీవితం అర్ధశతదినోత్సవం పూర్తి చేసుకుంది. అంటే హాఫ్ సెంచరీ!

ఇంతకీ ఈ ఘనత జైల్లో ఖైదీగా మూల్గుతున్న చంద్రబాబుదా? లేక అన్ని రోజులు సక్సెస్ఫుల్ గా బెయిల్ రాని విధంగా సాక్ష్యాలతో సహా కేసును కట్టించిన జగన్ మొహన్ రెడ్డిదా?

హాఫ్ సెంచరీ పూర్తయిందని బ్యాట్ లేపాల్సింది ఎవరు?

ఇంతకీ ఇది "ఉత్సవం" కాదు కదా, "దినోత్సవం" అంటారేంటి అని కొందరు కోపం తెచ్చుకోవచ్చు. 

కానీ ఏం చేద్దాం?

వైకాపా వాళ్లు ఉత్సవం చేసుకుంటున్నట్టు కనిపించడంలేదు కానీ..ఆశ్చర్యకరంగా తెదేపా సానుభూతిపరులు మాత్రం హైదరాబాదులో అనూప్ రూబెన్స్ సంగీత కచ్చేరీ పెట్టుకుని మరీ ఉత్సవం చేసుకుంటున్నారు. 

ఏమన్నా అంటే ఇది బాబుగారికి జైల్లో 50 రోజులు నిండినందుకు కాదు, ఆయన హైటెక్ సిటీ నెలకొల్పి 25 ఏళ్లు అయిన సందర్భంగా అని అంటున్నారు. ఇదే మరి కామెడీ అంటే.  అదే నిజమైతే సరిగ్గా చంద్రబాబు జైల్ లైఫ్ 50 డేస్ కొట్టినప్పుడే ఎందుకు? కాస్త ముందో, లేదా ఆగో చేసుకోవచ్చుగా ఆ ఉత్సవం? 

ఇందులో దాగున్న ఇంకొక నవ్వుకునే విషయమేంటంటే అసలు హైటెక్ సిటీకి శ్రీకారం చుట్టింది చంద్రబాబు కానే కాదు. ఆ ఘనత నేదురుమల్లి జనార్దన రెడ్డిది. ఈ సత్యాన్ని కేసీయార్ సైతం మైకు పట్టుకుని వివరంగా చరిత్ర మొత్తం చెప్పినా చెవుల్లో పచ్చరంగు సీసం పోసుకున్న చంద్రబాబు అభిమానులకి వినపడదు. వాళ్లంతా పచ్చమీడియా గోబెల్స్ ప్రచారంలో మునిగిపోయి హైటెక్ సిటీ అంటే చంద్రబాబే అనుకుంటుంటారు. 

నిజానికి చంద్రబాబు అసలు తాను జీవితంలో అరెస్టే కానన్న ధీమతో "నీ బాబే నా ముందు తోక ఊపలేదు. ఏం పీక్కుటావో పీక్కోమన్నాను. నువ్వెంత జగన్ మోహన్ రెడ్డి" అన్నాడు. 

ఆ అహంకారం యొక్క గూబ గూయ్యిమనే విధంగా స్కిల్ స్కాం కేసులో బాబుని అరెష్టు చేయించాడు జగన్ మోహన్ రెడ్డి. 

"చంద్రబాబుని అరెష్టు చేయడమా! సో వాట్! బెయిల్ తీసుకుని నేరుగా ఇంటికే వెళ్తాడు. జైలు మొహం కూడా చూడడు" అనుకున్నారు పచ్చ తమ్ముళ్లు. 

కానీ లోపలికెళ్లాల్సి వచ్చింది. అప్పుడు కూడా "అయితే ఏంటి? ఒక్క రోజుకంటే ఎక్కువ జైల్లో ఉంచలేడు జగన్ మోహన్ రెడ్డి! ఆల్రెడీ ఢిల్లీ నుంచి లాయర్ హీరోలు దిగారు" అంటూ అదే అహంకారాన్ని ప్రదర్శించారు. 

అంత నమ్మకమేంటి అనడిగితే..."వ్యవస్థలన్నీ చంద్రబాబు గుప్పెట్లో ఉంటాయి...తాను పదవిలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా.." అని చెప్పుకొచ్చారు. 

కానీ ఏమయ్యిందో చూసాం. 

ఆ రోజుకారోజు హీరోలనుకున్న బడా లాయర్లు సైతం ఈ కేసు ముందు జీరోలైపోయారు. ఇప్పటివరకు అసలు బెయిలే తెప్పించలేకపోయారు. 

ఏరోజుకారోజు చంద్రబాబు విడుదల సంబరాల్ని చేసుకోవాలనుకుని వెయిట్ చేసి చేసి..ఇక విసుగు చెంది ఈ హాఫ్ సెంచరీ సంబరాలు చేసుకుంటున్నారు బాబు అభిమానులు. ఏదైతే ఏంటి..సెలబ్రేషన్ కావాలంతే. 

అందుకే అన్నారు శ్రీశ్రీ "చావుకూడా పెళ్లిలాంటిదే బ్రదర్" అని..

చంద్రబాబు జైల్లో బెయిల్ రాక మానసికంగా చచ్చే చావు చస్తుంటే ఇక్కడ ఆయన అభిమానులు బ్యాండ్ మేళం పెట్టుకును మరీ ఉత్సవాలు చేసుకుంటున్నారు. 

45 ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో చంద్రబాబు గానీ, అతని మనుషులు గానీ కొన్ని వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నా కూడా చట్టాల్లోని లొసుగుల్ని కనిపెట్టి ఎలా తప్పించుకునే వారో ఒక తాజా ఉదాహరణ ద్వారా బయటపడింది. అదే "నాట్ బిఫోర్ మీ" క్లాజ్. ఇదేంటో.. ఇదెలా వాడారో తెలుసుకుందాం. 

చంద్రబాబు బెయిల్ పిటీషన్ పరిశీలించే ముగ్గురు న్యాయమూర్తుల్లో ఇద్దరు తమ పక్షం వారుంటే మరొకరు కాదని లాయర్లు గ్రహించారట. అయితే కేసు ఆ మూడో న్యాయమూర్తి వద్దకు వెళ్లింది. ఆమె నిబంధనలను అనుసరించే న్యాయమూర్తి. 

అది తెలిసి ఆమె ముందుకు తమ తరపు న్యాయవాదిగా ఆమెకు పరిచయమున్న లాయర్ని ప్రవేశపెట్టారట చంద్రబాబు లాయర్లు.

నిబంధనల ప్రకారం బంధువో, స్నేహితుడో లాయర్ గా వస్తే అస్త్రసన్యాసం చేసి ఆ కేసునుంచి న్యాయమూర్తి తప్పుకోవాలి. దానినే "నాట్ బిఫోర్ మీ" క్లాజ్ గా చెప్తారు. 

కనుక ఆ కేసుని "నాట్ బిఫోర్ మీ" అంటూ ఆ న్యామూర్తి తప్పుకున్నారు. 

అయితే తప్పుకుంటూ ఆమె పేర్కొన్న విషయమేంటంటే "సోమవారం ఈ కేసుని ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో విచారణకు ఉంచాలి" అని. 

దీంతో చంద్రబాబు లాయర్లు ఖంగుతిన్నారు. వాళ్లు వేసిన ప్లానంతా గంగలో కలిసింది. 

వాళ్లు అనుకున్నది ఏంటంటే ఆ మూడో న్యాయమూర్తి "నాట్ బిఫోర్ మీ" అనగానే, ఆ కేసు తమకు సంబంధించిన న్యాయమూర్తుల వద్దకు వస్తుందని! 

అలా వచ్చాక బెయిల్ ప్రయత్నం చేస్తే ఇక ఏ అడ్డంకి ఉండదని వారి ఆలోచన. నిజంగా అలా వచ్చున్నా ఏం జరిగేదో ఏమో! అది వేరే సంగతి. 

అలా ఈ కేసు ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి చెంతకు చేరింది. 

న్యాయవ్యవస్థల్లో లాయర్ల నుంచి మెజిస్ట్రేట్ ల వరకు తన వాళ్లని దూర్చడం, నిస్సుగ్గుగా లొసుగుల్ని వాడేసుకుని బయటపడడం... ఇదే చంద్రబాబు రాజకీయ చరిత్ర. 

ఎన్నో ఏళ్లుగా వాడుతూ వస్తున్న ఈ "నాట్ బిఫోర్ మీ" ఫార్ములా కూడా ఇప్పుడు బడిసికొట్టింది. కనీసం బెయిల్ కూడా రాకుండా చేస్తోంది.

ఇలాంటి మలుపుల వల్ల చంద్రబాబుకి అలుపు వస్తోంది. 

తన లాయర్లు వేసే పాచికలు పారట్లేదు.

కొడుకేమో బ్యాటరీ డౌనైపోయి పనికొచ్చే పని ఏదీ చెయలేక ప్రెస్మీట్లకి పరిమితమవుతున్నాడు.  

భువనేశ్వరీ దేవి సెంటిమెంటల్ టూర్ ఏదైనా ఫలితం తెస్తుందా అంటే అది కాస్తా నెంబర్-వన్ కామెడీ షో అయి కూర్చుంది. ఆమె మాట్లాడే మాటలు, పలకలేని తెలుగు పదాలు, ఒకాదానికొకటి చెప్పడాలు చూసి "ఓహో! లోకేష్ ది వాళ్ల అమ్మ పోలికన్నమాట" అని ఒక నిర్ధారణకి వస్తున్నారు జనం. 

తెదేపా నాయకులు సైతం భువనేశ్వరి ఎంత తొందరగా తన యాత్ర ఆపేస్తే తెదేపాకి అంత మంచిదని భావిస్తున్నారు. 

ఈ భావనల్ని నేరుగా సోషల్ మీడియాలోనే పెట్టేస్తున్నారు. 

తెదేపాకి భువనేశ్వరి స్పీచులు చేస్తున్న డ్యామేజ్ ఇంతా అంతా కాదు.

ఇలా అన్ని దారులూ మూసుకుపోవడం వల్ల చంద్రబాబు కొత్తగా తనపై దాడి జరగొచ్చని ఒక డ్రామా ఆడుతున్నాడు.

క్యాటరాక్ట్, దురదలు, ఫిషర్ వంటి రుగ్మతల్ని చూపిస్తూ జైలు నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి షిఫ్టయ్యే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. 

కురుక్షేత్రంలో కర్ణుడు ఎదుర్కొన్న శాపాల్లాగ తన శక్తులనుకున్నవన్నీ నిర్వీర్యమైపోయి, సమయానికి అస్త్రాలు వేయడానికి మంత్రాలు గుర్తు రాక, గుర్తొచ్చినా కూడా అవి పనిచేయక....ఇలా రకరకాలుగా ఉంది చంద్రబాబు పరిస్థితి. 

అంతే మరి..ఒక్క శాపఫలితం అనుభవిస్తున్నప్పుడే ప్రకృతి, దైవం, మానవశక్తి ఏదీ సహకరించదు. అప్పుడైనా అర్ధంకావాలి. అదంతా స్వీయ పాపఫలితమని..! 

అలా అర్ధమైతే ముందు అహంకారం చస్తుంది. ఆ తర్వాత తన పాపాల్ని గుర్తు తెచ్చుకుని మనస్ఫూర్తిగా ఏడ్చి పశ్చాత్తాపం చెందినప్పుడే ఏదో ఒక విముక్తి మార్గం కనిపిస్తుంది. లేకపోతే అంత వరకు ఇలానే ఉంటుంది. చూస్తూ చూస్తూ సెంచరీ కూడా అయిపోవచ్చు. 

హరగోపాల్ సూరపనేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?