Advertisement

Advertisement


Home > Politics - Opinion

చంద్రబాబులో కనిపించిన ఆత్మవిశ్వాసం

చంద్రబాబులో కనిపించిన ఆత్మవిశ్వాసం

చెస్సాటలో ప్రత్యర్ధి చెక్ పెడితే బయటపడటానికి నానాయాతన పడడం సహజం. అదే విధనగ జైల్లోంచి చంద్రబాబుని బయట పడేయటానికి ఆయన వర్గం చాలా తంటాలు పడ్డారు. 

కోటానుకోట్లు ఫీజులు తీసుకున్న లాయర్లకు కూడా వెంటనే తట్టని "హెల్త్ రీజన్" ఐడియా, ఎవరికి తట్టిందో కానీ ఆలశ్యంగానైనా తట్టింది. 50 రోజుల తర్వాత ఉపశమనం కలింది చంద్రబాబుకి. 

అయితే, యెల్లో మీడియాలో జరిగిన ప్రచారాన్ని బట్టి చంద్రబాబు జైల్లోంచి బయటకు రాగానే ఆయాసపడి నడుస్తూ, మొహము కళ్లు పీక్కుపోయి, మాట్లాడలేని నీరసంతో కనిపిస్తారనుకున్నారు ఆ వార్తల్ని నమ్మిన జనం. 

కానీ ఆ దాఖలాలు ఏవీ లేకుండా మునుపటికంటే మెరుగైన ముఖవర్ఛస్సుతో, ఎక్కడా నీరసం లేని నడకతో బయటికి వచ్చి ప్రెస్ ముందు గంభీరమైన స్వరంతో ప్రసంగించారు చంద్రబాబు. 

అంటే, క్యాటర్యాక్ట్ చెయ్యాల్సిన కంటి సంగతి పక్కనపెడితే ఆయన ఆరోగ్యం నిక్షేపంలా ఉందని చూడగానే ఎనిమిదేళ్ల నారా దేవాన్ష్ కి కూడా అర్ధమయ్యి ఉంటుంది. 

ఇక్కడ చంద్రబాబుని కచ్చితంగా మెచ్చుకోవాల్సిన విషయం ఒకటుంది. ప్రెస్ ముందు మాట్లాడేటప్పుడు ఆయన పాటించిన తూకం...

కోర్టు షరతులని పాటిస్తూ ఎక్కడా కేస్ గురించి ఎత్తలేదు. ఏ రాజకీయ ప్రసంగం చెయ్యలేదు. తనకి సంఘీభావం తెలిపిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. అది కూడా ఏ పార్టీనీ వదలకుండా అందరికి పేరు చెప్పి మరీ ధన్యవాదాలు తెలియజేసారు. ఆ లిస్టులో భాజపా, బీఆరెస్, కాంగ్రెస్..ఇలా అన్నీ ప్రస్తావించారు. 

అందుకే చంద్రబాబుని అనుభవజ్ఞుడు అనేది. ఎక్కడ ఎంత మాట్లాడాలో, ఏది మాట్లాడాలో తెలిసి మాట్లాడే నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఎక్కడా తొట్రుపాటు లేకుండా అన్ని పార్టీల వారికి ధన్యవాదాలు చెప్పడం వల్ల తెలియకుండా ఆయా పార్టీల వారికి సానుభూతి కలగొచ్చు. 

చంద్రబాబు అరెష్ట్ విషయంలో కేంద్ర భాజపా హస్తముందని బలమైన అనుమానాలున్నప్పటికీ ఆ పార్టీకి కూడా థాంక్స్ చెప్పడం మామూలు లౌక్యం కాదు. 

ఇన్నాళ్లూ చంద్రబాబుని విమర్శించిన వాళ్లకి కూడా ఆయన విడుదలయి బయటకు రాగానే ఇచ్చిన స్పీచ్ పట్ల సానుకూల భావన కలిగింది. ఆయనని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన జనాన్ని, వాళ్ల భావోద్వేగాన్ని చూస్తే నిజంగా చంద్రబాబు మహానాయకుడనిపించింది. 

బాలకృష్ణ పబ్లిక్ గా చంద్రబాబు కాళ్లకి నమస్కరించేటప్పటికి ఆయన దైవాంశసంభూతుడనిపించింది. 

"అంతలా ఎందుకు అనిపించింది" అనడుగుతారా?...

చంద్రబాబుని ఎందుకు అంతలా ఎత్తేస్తున్నారని అనుకుంటున్నారా? 

దానికి బలమైన కారణం ఒకటుంది. 

ఇన్నేళ్లూ చంద్రబాబు ప్రసంగాల్లో ఒక కోతలరాయుడిని చూసిన జనానికి ఆయన జైల్లోకి వెళ్లగానే గత 50 రోజులుగా ఆయన ప్రసంగాలు వినే భాగ్యం కలగలేదు. 

వారి స్థానంలో ఆయనగారి కుటుంబసభ్యులు- బాలకృష్ణ, బ్రాహ్మణి, భువనేశ్వరి, చైతన్య కృష్ణ, రామకృష్ణ..ఆఖరికి లోకేశ్వరి కొడుకు..ఇలా ప్రతివాళ్ళు వాళ్ల నోళ్లు విప్పి మాట్లాడేసరికి జనానికి మైండులో ఫీజులు కొట్టేసాయి. 

చంద్రబాబు కుటుంబంలో సరిగ్గా ప్రసంగించగలిగేవాడు ఒక్కడూ లేడా అని ఆశర్యమేసింది. 

"అయ్యో..పాపం ఏవిటి వీళ్లు" అని తటస్థులు నిట్టూరిస్తే, తెదేపా వ్యతిరేకులు విపరీతమైన ట్రోలింగులు చేసుకున్నారు. 

తెదాపా వర్గీయులు మాత్రం ఆ కుటుంబసభ్యులంతా అద్భుతంగా ప్రసంగాలిస్తున్నారని భ్రమలో బతికేసారు. ఆఖరికి రఘురామరాజు కూడా భువనేశ్వరిని ఏకంగా సత్యభామతో పోలుస్తూ డబ్బా కొట్టేసాడు. 

అందుకే..ఏ చెట్టు లేని చోట ఆముదం వృక్షమే మహా వృక్షంలా కనిపిస్తున్నట్టు ఇప్పుడు చంద్రబాబే గొప్ప వక్తగా, ధీరుడిగా, శూరుడిగా, నాయకుడిగా, దేవుడిలా కనిపిస్తున్నాడు. 

తెదేపా వర్గీయులకే కాదండోయ్. అనేకమంది తెదేపా వ్యతిరేకులకి కూడా! 

సరే..మొత్తానికి ఇంటరిం బెయిల్ వచ్చింది. రాబోయే 10 వ తారీఖున అసలు బెయిల్ హియరింగ్ ఉంది. అక్కడ బెయిల్ వచ్చేస్తే ఇక స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకి ఊరట లభించినట్టే. ఒకవేళ 10 న బెయిల్ రాకపోతే, ప్రస్తుత తాత్కాలిక బెయిల్ మీద నవంబర్ 28 వరకు కంటిన్యూ అయ్యి మళ్లీ లోపలికెళ్లడానికి లొంగిపోవాల్సి ఉంటుంది.  

కానీ అంత ఈజీగా చంద్రబాబుని లొంగనిస్తారా అనేది పాయింట్. 

ఒకసారి హెల్త్ రీజన్ మీద బయటకు వెళ్తే అదే క్లాజ్ వాడి మళ్లీ లోపలికెళ్ళకుండా తాత్సారం చేసే ప్రయత్నాలు జరగొచ్చు. 

ఒకవేళ అదే హెల్త్ రీజన్ ని వాడుకుంటూ చంద్రబాబు బయటే ఉన్నా పెద్ద ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఒక్కసారి హెల్త్ రీజన్ చెప్పాక.. పొలిటికల్ స్పీచులు, యాత్రలు గట్రా చేయకూడదు. అవి చేస్తే హెల్త్ బానే ఉందని తీసుకెళ్లి లోపలేస్తారు. కనుక ఆ చంక్రబంధంలోంచి బాబు ఎలా బయటపడతారో చూడాలి. 

ఇది ఒక్క ప్రస్తుత కేస్ విషయంలోనే కాదు లైన్లో ఉన్న ఇతర కేసుల్లో కూడా ఇదే అవకాశం, ఇదే ప్రమాదం లేకపోలేదు. 

ఏదో విధంగా ఫిబ్రవరి వరకు మళ్లీ లోపలికెళ్లకుండా కాసుకో గలిగితే అప్పటికి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. చంద్రబాబుకి మరింత ఊరట లభిస్తుంది. 

కనుక ఈ క్యాట్ అండ్ మౌస్ గేములో నోటిఫికేషన్ వచ్చే లోపే ఎవరి ఆటైనా! 

ఆ ఆటలో గెలిచెది ఎవరైనా...అసలైన గెలుపోటములు 2024 మేలో తేలిపోతాయి. ఆ తర్వాత ఆట మారుతుందో లేక ఇలాగే కొనసాగుతుందో..వేరే విషయం. 

శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?