Advertisement

Advertisement


Home > Politics - Opinion

జైలు జీవితంలో చంద్రబాబుకి జగన్ కి తేడా

జైలు జీవితంలో చంద్రబాబుకి జగన్ కి తేడా

చంద్రబాబు ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీ. అప్పట్లో జగన్ కూడా రిమాండ్ ఖైదీనే. 

చంద్రబాబు జైలు జీవితం సరిగ్గా ఒక నెల పూర్తయింది. జగన్ జైలు జీవితం 16 నెలలు. 

చంద్రబాబైనా, జగన్ మోహన్ రెడ్డైనా న్యాయపరిభాషలో నిందుతులే తప్ప ఇంకా దోషులు కారు. వారి కేసుల పూర్వాపరాల్లోకి ఇక్కడ వెళ్లడం లేదు.ఎందుకంటే టాపిక్ అది కాదు. 

ఇక్కడ మనం చెప్పుకోబోతున్నది జైలు జీవితంలో ఈ ఇద్దరి నాయకుల మధ్యన తేడా ఏవిటి?

ఎవరు ఎలా సిచువేషన్ ని హ్యాండిల్ చేసారు?

ఎవరి కుటుంబం తీరు ఎలా ఉంది?

ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకోవాలి. 

జగన్ మోహన్ రెడ్డిని జైల్లో పెట్టిన సమయంలో అతనొక ఒంటరి యోధుడు. కుటుంబంలో ఉన్నవారంతా స్త్రీలే. తల్లి, భార్య, చెల్లి.. వీరెవరికీ వ్యాపార, రాజకీయానుభవాలు లేవు. నిరసన ఎలా తెలియజేయాలో కూడా దిశానిర్దేశం లేదు. చేసినా, ఎవర్ని మెప్పించడానికి చెయ్యాలో తెలీదు. జగన్ తరపున ఎవరూ అప్పటి ఢిల్లీ పెద్దలతో మంతనాలు చెయ్యలేదు. జగన్ తరపున టీవీల్లో కూర్చుని డిబేట్లల్లో మాట్లాడడానికి ఆర్టిష్టులు ఎవ్వరూ లేరు. 

అప్పుడు సెంటర్లో ఉన్నది మోస్ట్ పవర్ఫుల్ సోనియా గాంధీ. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదో అరెష్టు చేసి లోపలేయడం కాదు. ఎన్నో రకాలుగా ఉక్కిరిబిక్కిరి చేసారు. సాక్షి పేపర్ కి ప్రభుత్వ ప్రకటనలు రాకుండా ఆపి ఆర్ధికంగా కొట్టారు. 

సపోర్ట్ చేయడానికి ఎవరైనా ముందుకోస్తే వాళ్ల మీద ఐటీ రైడ్స్ అయ్యేవి.  

పైగా ఆ సమయంలో జగన్ కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లన్నీ ఈడీ వాళ్లు ఫ్రీజ్ చేసారు. అయినప్పటికీ, తనని నమ్మినవారు తన చుట్టూ ఉండడం వల్ల సాక్షి పేపర్ ని, సాక్షి టీవీని, భారతి సిమెంట్ ఫ్యాక్టరీని, వైకాపా పార్టీని.. అన్నింటినీ సమర్ధవంతంగా నడిపాడు. అది కూడా 16 నెలల పాటు!!

జైల్లో కూర్చునే పలు బై-ఎలక్షన్స్ లో తన అభ్యర్థుల్ని గెలిపించుకుని క్లీన్ స్వీప్ చేసాడు. అప్పుడన్నా కనీసం తెదేపా పోటీనివ్వలేకపోయింది. ఆ తర్వాత జైల్లోంచి బయటికొచ్చి ఎన్నికల్లో పోరాడాడు. తన పార్టీ నెగ్గకపోయినా 65 ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు. ఆ తర్వాత మరొక ఐదేళ్లు ప్రతిపక్షంలో పోరాడి 2019లో సీయం అయ్యాడు. అది జగన్ చరిత్ర. 

ఇక ఇప్పుడు చంద్రబాబు సంగతికొద్దాం. జైల్లోకెళ్లి నెలే అయ్యింది. ఈ నెల రోజుల్లో ఎంత ఆపసోపాలు పడ్డాడో చూసాం. రోజుకి కోటిన్నర తీసుకునే లాయర్లు రంగంలోకి దిగి బెయిల్ కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక లెక్క ప్రకారం చంద్రబాబు అరెష్టైనప్పటి నుంచి ఇప్పటి వరకు 58 మంది లాయర్లు పనిచేసారట. వాళ్లల్లో చాలామందికి ఇకా పేమెంట్లు అందలేదని గుర్రుగా ఉన్నారని సమాచారం. అవును మరి! పేమెంటిస్తే తప్ప పని చేయని మనుషులు చంద్రబాబు పక్కనున్న వాళ్లు. చేతిలో ఇవ్వడానికి చిల్లిగవ్వ లేకపోయినా నమ్మిన మిత్రుల వల్ల 16 నెలలపాటు నెగ్గుకుకొచ్చిన వాడు జగన్. 

అదలా ఉంటే చంద్రబాబు కుటుంబంలో ఆల్రెడీ లోకేష్ మాజీమంత్రి. ఢిల్లీ వెళ్లి ఏం సాధించాడో జనమంతా చూస్తున్నారు.

చంద్రబాబు సొంత బావ బాలకృష్ణ ఎమ్మెల్యే. ఏం జరుగుతోందో చూస్తున్నాం.

సొంత బావ, వియ్యంకుడు జైల్లో దోమలు కొట్టుకుంటుంటే బాలకృష్ణుడు మాత్రం "భగవంత్ కేసరి" సినిమా ఫంక్షన్లో హీరోయిన్ శ్రీలీల ముందు చిలిపి స్పీచులిస్తూ హాయిగా నవ్వుతూ కనిపిస్తున్నాడు.

చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి తన మామగారి అరెస్టుకి నిరసనగా డప్పులు కొట్టే పిలుపిచ్చి ఆమె మాత్రం నవ్వుతూ డప్పు కొట్టింది. ఆ వీడియోలు జనం చూసారు.

ఎలా చూసుకున్నా చంద్రబాబు జైల్లో పడ్డాడని సొంత కుటుంబసభ్యులకే పెద్ద దిగులు లేనట్టుంది.

ప్రోగ్రాముంటేనే నారా భువనేశ్వరి ఆంధ్రా వెళ్తోంది. లేకపోతే హైదరాబాదుకే పరిమితం. బ్రాహ్మణి పరిస్థితి కూడా అంతే.

వాళ్ల టెన్షనల్లా తము కూడా ఎక్కడ అరెష్టవుతామనో తప్ప చంద్రబాబు దుస్థితి చూసి కాదేమో అనిపిస్తుంది. అందుకే లోకేష్ కూడా అరెష్టుని కాస్తైనా తప్పించుకోవాలని ఢిల్లీలో ఉన్నాడన్న టాక్ ని జనం నమ్ముతున్నారు.

ఎంత భయం కాకపోతే, జగన్ మోహన్ రెడ్డి మొన్న ఢిల్లీ వెళ్లగానే లోకేష్ ఇలా ఆంధ్రా వచ్చాడు. మళ్లీ జగన్ తిరిగి వెనక్కి రాగానే లోకేష్ ఢిల్లీ చెక్కేసాడు. చూడ్డానికి సిల్లీగా లేదు! ఎందుకిలాంటి చేష్టలు చేసి జనం అనుమానాన్ని బలపరచడం? 

ఇప్పుడు చంద్రబాబు తరపున వకాల్తా పుచ్చుకుని రోజూ మీడియాలో ఊదరగొట్టడానికి బోలెడన్ని ఛానల్సున్నాయ్.

ఢిల్లీలోనే మకాం వేసి మంతనాలు చేసేందుకు భాజపా ముసుగులో ఉన్న తెదేపావాళ్లు కూడా ఉన్నారు.

ఇలాంటి పరిస్థితి అప్పట్లో జగన్ కి లేదు. 

పైగా అప్పట్లో జగన్ మీద ముప్పేట దాడి చేసినట్టుగా ఇప్పుడు చంద్రబాబు వర్గం మీద జరగట్లేదు. ఆయనకి సపోర్ట్ ఇస్తున్నవారిపై ఐటీ రైడ్స్ గట్రా లేవు.

అయినప్పటికీ... 

ఎక్కడ 40 ఏళ్ల చంద్రబాబు చతురత?

ఎక్కడ ఆ సో-కాల్డ్ చాణక్యుడి ఎత్తుగడ?

ఎక్కడున్నారు ఆ పార్టీలో సీనియర్లు?

ఏమైపోయాయి "ప్రెసిడెంటుల్ని, ప్రధానమంత్రుల్ని నిలబెట్టింది కూడా నేనే" లాంటి ప్రగల్భాలు?

ఎక్కడికిపోయాయి స్వకుల శక్తులు....ర్యాలీలు నిర్వహించి చిన్నపిల్లల చేత వేదిక మీద బూతులు మట్లాడించడానికి తప్ప? 

ఏకాంతంలో ఆత్మావలోకనం చేసుకునే అవకాశం మెండుగా ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు జైల్లో ఆ అంతరావలోకనం చేసుకుంటున్నారా? లేక ఇప్పటికీ అదే కుళ్లిన అసూయతో ధృతరాష్ట్రుడి మాదిరిగా రగిలిపోతున్నాడా? ఏమో ఆయనకి, తరచు వెళ్లి చూసొస్తున్న ములాకత్ బ్యాచ్ కి తెలియాలి? 

- శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?