Advertisement

Advertisement


Home > Politics - Opinion

పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి- జనసైనికుల అంతరంగం

పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి- జనసైనికుల అంతరంగం

"మనీ" సినిమాలో ఒక సీనుంటుంది. హీరో అవ్వాలనుకునే బ్రహ్మానందానికి తనికెళ్ల భరణి రెండు ఆప్షన్స్ ఇస్తాడు.

"ఒకటి- బాగా కష్టపడి చిన్న వేషాలేసి, తర్వాత డైలాగు వేషాలేసి, ఆ తర్వాత కొంచెం పెద్ద వేషాలేసి హీరో అవడం..అంటే కష్టపడి పైకి రావడం..చిరంజీవి టైపు.

లేదా భడేల్.."విక్రం"- నాగార్జున; ధడేల్.."కలియుగ పాండవులు"- వెంకటేష్

ఈ రెండిట్లో ఏది కావాలో డిసైడ్ చేసుకో" అంటాడు.

ఈ రెండు ఆప్షన్స్ విన్న బ్రహ్మానందం "రెండోదే బెటరేమో" అని బదులిస్తాడు.

సరిగ్గా అదే టైపులో "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" సినిమాతో హీరో అయిపోయినవాడు పవన్ కళ్యాణ్. అన్నగారిలా చిన్న వేషాలు, విలన్ వేషాలు వేసి హీరో అవ్వలేదు. ఏ కష్టమూ పడకుండా అన్నగారి బ్రాండుతో హీరో అయిపోయాడు.

ఆ సమయంలో తనకి అనుభవముందో లేదో ఆలోచించలేదు. అన్నయ్యలా హీరో అవ్వాలనుకున్నాడు అయ్యాడు. జనానికి అలవాటయ్యాడు..వాళ్లు చూస్తున్నారు.

అప్పుడు గుర్తుకురాని సో-కాల్డ్ "అనుభవం" సరిగ్గా తన రాజకీయ ప్రస్థానం విషయంలో మాత్రం తనకి పదే పదే గుర్తొచ్చి ఎందుకు ఆపేస్తోందో అర్ధమవ్వదు.

పదేళ్ల క్రితం.. 2014 లో "అనుభవం" ఉన్న నాయకుడు రాష్ట్రానికి కావాలని చంద్రబాబుకి సపోర్ట్ చేసానని చెప్పాడు పవన్ కళ్యాణ్.

మళ్లీ పదేళ్లకి ..2024 ఎన్నికలకి కూడా అదే "అనుభవం" సాకు చెప్పి చంద్రబాబుని సీయం గా చూడాలనుకుంటున్నాడు.

జనసేన పార్టీ పెట్టి ఒకటిన్నర దశాబ్దం అయినా, అంతకు ముందు అన్నగారి ప్రజారాజ్యం పార్టీలో మూడేళ్లు పని చేసినా పవన్ కళ్యాణ్ ఎందుకు తనకి "అనుభవం" లేదనుకుంటున్నాడో తెలీదు.

ఎన్.టి.ఆర్ కి ఏం అనుభవం ఉందని జనం పట్టం కట్టారు? అరవింద్ కెజ్రీవాల్ కి ఏం అనుభవముందని ముందుకొచ్చి నిలబడి సీయం అయ్యాడు? జగన్ మోహన్ రెడ్డికి సీయం గా ఏం అనుభవం ఉందని జనాభిమానాన్ని పొంది సీయం అయ్యాడు?

అనుభవమంటే పవన్ దృష్టిలో ఏవిటి?

ఇలా "చంద్రబాబు అనుభవం" అనే మంత్రం వల్లిస్తూ ఏళ్లకేళ్లు గడిపేస్తుంటే తాను సీయం అయ్యేదెప్పుడు? ఎవరి సీయం పదవి కోసమో జెండాలు మొయాల్సిన ఖర్మ జనసైనికులకి ఎన్నాళ్లు?

ఇదంతా చూస్తుంటే అంబటి రాంబాబు అన్నట్టు "పవన్ కళ్యాన్ కి సినిమా అయినా, రాజకీయమైనా ఒకటే..కాల్షీట్లు అమ్ముకుని బతికేయడమే.." అన్న విషయం నిజమే అనిపిస్తుంది.

పోనీ క్లారిటీగా తనకి సీయం అయ్యే ఆలోచన లేదు.."అనుభవం" ఉన్న బాబుగారినే సీయం గా ఎప్పటికీ చూద్దామనుకుంటున్నాని చెప్తాడా అదీ చెప్పడు. అలా డైరెక్టుగా చెబితే జనసైనికులు జెండాలు కింద పారేసి ఛీగొట్టి వెళ్లిపోతారని తెలుసు. అందుకే చెప్పీ చెప్పకుండా చెప్పడం!!

సోషల్ మీడియాలో ఎవరో రాసారు - "తన జేబులో ప్యాకేజి, జనసైనికుల చెవిలో క్యాబేజి, ఇదే పవన్ కళ్యాణ్ ఇమేజి" అని.

సరే..ఇప్పటి వరకు చంద్రబాబు "అనుభవానికి" తన రాజకీయ జీవితాన్ని తాకట్టు పెడుతున్న పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో మాత్రం తనకున్న అనుభవాన్ని తాను గుర్తిస్తాడన్న గ్యారెంటీ ఏముంది?

సింహాసనానికి కట్టుబానిస అయిన కట్టప్ప టైపులో అప్పుడు కూడా "అనుభవజ్ఞుడైన తండ్రికి పుట్టిన కొడుకు" అని చినబాబుని సీయం చేయడమే తన కర్తవ్యమంటాడేమో!

తనకి తెదేపాతో చాలాకాలంగా తెరచాటున సాగుతున్న "సంబంధం" గురించి చంద్రబాబు జైల్లోకి వెళ్లగానే పవన్ కళ్యాణ్ ఆవేశంగా బహిర్గతం చేసాడు.

ఇవాళ మళ్లీ మీటింగ్ అంటూ, "సూపర్ సిక్స్" పాయింట్స్ అంటూ హడావిడి చేసాడు. ఇంతకీ ఆ సిక్స్ పాయింట్స్ ని తెదేపా వారే ఏకపక్షంగా ప్రకటిస్తారా లేక అందులో జనసేన వారివి మూడు పాయింట్స్ ఉంటాయా అనేది చూడాలి.

ఇప్పటి వరకు జనం పవన్ కళ్యాణ్ ని, అతని పార్టీని ఓటేసి గెలిపించేంత సీరియస్ గా తీసుకోకపోవడానికి కారణం అతని వ్యక్తిత్వమే. ఎప్పుడూ "నిలకడ" చూపించడు.

కొన్నాళ్లు చెగువేరా ఫోటో పెట్టుకుని ఆ టైపు గెటప్పేసుకుని విప్లవకారుడిలా ఊరేగడం, ఇంకొన్నాళ్లు గెడ్డం పెంచుకుని మేథావి గెటప్పులో దర్శనమివ్వడం, మరి కొన్నళ్లు మెడలో ఎర్ర తువ్వాలు వేసుకుని కార్మికనాయకుడి టైపులో కటింగివ్వడం, కొన్నాళ్లు భాజపా వారిని మెప్పించే పనిలో ఆ రకం వేషం కట్టడం, ఇప్పుడు వైట్ అండ్ వైట్ లాల్చీ పైజామా వేసుకుని కనిపించడం...

అప్పట్లో సీనియర్ ఎన్.టి.ఆర్ కూడా మొదట్లో ఖాఖీ డ్రెస్సులోనూ, కొన్నాళ్లు తలపాగాతో వివేకానందుడి గెటప్పులోను, తర్వాత సన్యాసిలా కాషయంలోనూ, లక్ష్మీ పార్వతితో పెళ్లయ్యాక వైట్ డ్రెస్సులోను దర్శనమిచ్చి పలు సందర్భాల్లో కామెడీకి గురయ్యారు. 

ఇప్పుడంటే స్వర్గస్తుడయ్యాడు కాబట్టి ఆయన్ని దేవుడంటున్నారు కానీ అప్పట్లో ఆయన మీద కూడా స్వకుల పత్రికల్లో సైతం భయంకరమైన వెకిలి కార్టూన్స్ వచ్చేవి. అయితే అప్పట్లో సోషల్ మెడియా లేకపోవడంతో ఎన్.టి.ఆర్ లోని మైనస్సులు పెద్దగా జనానికి తెలిసేవి కావు. మాట్లాడిన మాటలు క్లారిటీ ఉండి, స్పష్టమైన తెలుగులో, బేస్ వాయిస్ లో పవర్ఫుల్ గా ఉండేవి. దాంతో ఆయన గెటప్పుల్ని ప్రజలు పట్టించుకునీ పట్టించుకోనట్టుగా వదిలేసేవారు.

మాట్లాడే విషయంలో నిలకడ ఉంటే చాలా లోపాల్ని కనపడకుండా చేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ పరిస్థితి అది కాదు. వేషంలోనే కాదు భాషలో కూడా నిలకడ ఉండదు.

"కొడకల్లారా" అంటూ చెప్పు చూపిచి స్పీచులిచ్చిన ఈ మనిషే "ప్రత్యర్థులెవర్నీ బూతులు తిట్టకండి" అంటూ తాజాగా గౌతమబుద్ధుడి రేంజులో బుద్ధులు చెప్తున్నాడు.

రూలింగ్ పార్టీ కరప్షన్ కి పాల్పడిందంటూ ఆధారాల్లేని అభియోగాలు చేస్తూనే చంద్రబాబు అవినీతి కేసులో లోపలికెళ్లగానే "యాక్సెప్టిబుల్ లెవెల్ ఆఫ్ కరప్షన్" గురించి ఒక లెవెల్లో ప్రస్తావించి ట్రోలింగులకి గురయ్యాడు.

తన పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్న ఈ మహానుభావుడే జగన్ మోహన్ రెడ్డి స్కూల్ పిల్లలకి టోఫెల్, ఐబీ ఎడ్యుకేషన్ సిస్టం ప్రవేశపెడతానంటే అదంతా అనవసరమని, అంత ఇంగ్లీష్ అవసరం ఇప్పుడు పిల్లలకి ఏమొచ్చిందంటూ వెర్రి స్పీచులిస్తున్నాడు.

వేషభాషల్లోనూ, ఆలోచనల్లోనూ "నిలకడ" లేకపోవడం పవన్ కళ్యాణ్ పెద్ద మైనస్. ఈ వ్యక్తిత్వంతో అతను ఎప్పటికీ జనానికి దగ్గర అవ్వలేడు.

అవ్వాలనుకున్నా "అనుభవం" గల చంద్రబాబుని దాటి తనకి సీయం అయ్యే ఆలోచన లేదని చెప్పకనే చెప్పేస్తున్నాడు.

"ఎంతసేపూ జగన్, చంద్రబాబేనా..రాష్ట్రంలో మూడో వాడు వస్తే చూడాలనుంది..అది పవన్ అయితే ఓకే" అని ఉండవల్లి అరుణ్ కుమార్ కోరుకుంటున్న కోరికలో సగమైనా పవన్ కళ్యాణ్ కి ఉంటే ఈ వ్యాసం రాసే అవసరం ఉండేది కాదు.

"ప్రేమంటే రెండు మనసుల కలయిక..పెళ్లంటే రెండు కుటుంబాల బంధం" అన్నట్టుగా..తెదేపా-జనసేన అధినేతలు మనసులు ఇచ్చేసుకుని చేతులు కలిపేసుకుంటే సరిపోదు..పక్కనున్న కేడర్, వెనుకనున్న స్వవర్గం, ముందున్న ఓటర్లు..వీళ్లందరూ  కూడా కలిసుండాలి.

ఎవరి ఎమోషన్స్ వాళ్లకుంటాయి, ఎవరి లెక్కలు వారికుంటాయి. తాను శాసిస్తే తనను నమ్ముకున్నవాళ్లంతా పాటిస్తారనుకోవడం పవన్ కళ్యాణ్ మూర్ఖత్వం. నాయకుడిగా తనని తాను నమ్ముకుని ఒంటరిగా పోరాడేవాడికే ఫాలోవర్స్ కూడా బలంగా ఉంటారు.

మొన్నటివరకు ఏబీయన్ రాధాకృష్ణ మీద సెటైర్ వీడియోలు చేసి అశేష ఆంధ్ర జనాభాలో అగ్రశాతాన్ని అలరించిన కళ్యాణ్ దిలీప్ సుంకర సైతం జనసేన-తెదేపా పొత్తుని మనస్ఫూర్తిగా జీర్ణించుకోలేక, పవన్ కళ్యాణ్ మీద తనకున్న చికాకుని బహిరంగంగా చెప్పలేక, అలాగని సైలెంటుగా ఉండలేక..తన ఫీలింగ్స్ తో తానే సంఘర్షణ చెందుతూ, తన ఆలోచనల్ని, టోన్ ని, వాక్స్వేచ్ఛని అడ్జస్ట్ చేసుకుని మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇక్కడ చెప్పడానికి ఈ ఒక్క పేరు చెప్పుకున్నా చాలామంది జనసైనికుల మనోభావాలు ఇలాగే ఉన్నాయి.

తమ కుమార్తె తమకు ఇష్టం లేనివాడిని చెప్పకుండా పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో.. పవన్ కళ్యాణ్ తెదేపాతో పొత్తుని ప్రకటించినప్పటి నుంచీ అలానే ఉంది చాలామంది జనసైనికులకి, కాపు ఓటర్లకి. బాధతో మౌనం వహించి..గత్యంతరం లేక నెమ్మదిగా అలవాటు చేసుకునే ప్రయత్నం చెస్తున్నట్టుగా కనిపిస్తున్నారు వారు.

తెదేపా-జనసేన పొత్తుని ఎలా చూడాలి అని ఫేస్బుక్కులో ఎవరో అడిగితే కింద కామెంట్స్ లో- "పవన్ కళ్యాణ్ చేసుకున్న నాలుగో పెళ్లి" అని ఒక రిప్లై ఉంది. 

హరగోపాల్ సూరపనేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?