Advertisement

Advertisement


Home > Politics - Opinion

రాజ‌కీయ నేత‌లు ఎలాంటి వారంటే...!

రాజ‌కీయ నేత‌లు ఎలాంటి వారంటే...!

రాజ‌కీయం వ్యాపారంగా మారిన‌ప్పుడు వ్యాపారులే రాజ‌కీయాల్లోకి వ‌స్తారు. జ‌నం కూడా లాభ‌న‌ష్టాల్లో మునిగితేలుతున్నారు. పైస్థాయిలో రాజ‌కీయ చ‌ర్చ‌లు చేసే మేధావులు, బుద్ధిజీవులు ఎలాగూ ఓటింగ్‌కి రారు. వాళ్లు కేవ‌లం మాట‌ల పులులే. ఇక ఓటు వేసే వాళ్లు గిట్టుబాటు ధ‌ర గురించి ఆలోచిస్తున్నారు. మ‌ధ్య త‌ర‌గ‌తి, ఉద్యోగులు డ‌బ్బులు తీసుకోరు. అయినా వాళ్ల‌కి ఆప్ష‌న్ లేదు. తక్కువ అవినీతిప‌రున్ని ఎంచుకోవాల్సిందే.

ఎన్నిక‌లు వ‌స్తే చాలా మందికి చేతినిండా ప‌ని దొరుకుతుంది. కండువాలు బాగా అమ్ముడుపోతాయి. జెండాలు కుట్టే టైల‌ర్లు బిజీగా వుంటారు. నాయ‌కుల వెంట తిరిగే కుర్రాళ్ల‌కి మందు, డ‌బ్బులు ఫుల్‌. ధ‌ర్నాలు, మీటింగ్‌లు, ర్యాలీల‌కి వ‌చ్చే జ‌నాల‌కి రోజుకి రూ.500, క్వార్ట‌ర్ బాటిల్‌. అన్ని సినిమాల్లో అదే జూనియ‌ర్ ఆర్టిస్టులు క‌నిపించిన‌ట్టు అన్ని ధ‌ర్నాల్లో, మీటింగ్‌ల్లో అదే జ‌నం. ల‌క్ష మంది హాజ‌ర‌య్యారంటే అర్థం 98 వేల మందిని తోలుకొచ్చారని.

కంపెనీల్లోనే కాదు, ఇపుడు ఊళ్ల‌లో కూడా హెచ్ఆర్ (హ్యూమ‌న్ రీసోర్స‌స్‌) మేనేజ‌ర్లు ఉన్నారు. జ‌నాన్ని కూడ‌గ‌ట్టాలంటే ఈ మేనేజ‌ర్‌కి చెబితే చాలు. డ‌బ్బు, మందు, ట్రాన్స్‌ఫోర్ట్ ఏర్పాటు చేస్తే ఎన్ని వేల మందినైనా అరేంజ్ చేస్తాడు. ఇదంతా నాట‌కం అని నాయ‌కుల‌కీ తెలుసు. అయితే ప్ర‌జాస్వామ్య‌మే ఒక నాట‌కంగా మారిన‌ప్పుడు ఈ చిన్న నాట‌కాలదేముంది? వేల మంది జ‌నం త‌మ వెంట ఉన్నార‌ని షో చేయ‌క‌పోతే వాల్యూ వుండ‌దు. ముఖ్య‌మంత్రుల స‌భ‌లైనా, ప్ర‌ధానుల స‌భ‌లైనా ఇదే మూల‌సూత్రం.

రోడ్ షోల్లో రీసైక్లింగ్ న‌డుస్తుంది. షో మొద‌ల‌య్యే చోట వెయ్యి మందిని త‌ర‌లిస్తే, ఆయ‌న అక్క‌డ మాట్లాడుతూ వుండ‌గానే త‌ర్వాత పాయింట్‌కి 500 మంది వెళ్లిపోతారు. నాయ‌కుడు అక్క‌డికి చేరే స‌రికి భారీ స్వాగ‌తం ప‌లికి హంగామా చేస్తారు. తెలియ‌ని వాళ్లు ప్ర‌తి వూళ్లోనూ జ‌న‌మే జ‌నం అనుకుంటారు. ధ‌న‌మే జ‌నం.

గెలిచిన త‌ర్వాత స్పెష‌ల్ విమానాలు, వెయ్యి రూపాయ‌ల వాట‌ర్ బాటిళ్లు తాగే నాయ‌కులు, ఒక నెల రోజులు సామాన్యుడి అవ‌తారం ఎత్తుతారు. బండి మీద దోస‌లు పోస్తారు. బ‌జ్జీలు కాలుస్తారు. పిల్లోళ్ల చీమిడి తుడుస్తారు. బ‌ర్రె ఈనిందా, ఆవు త‌న్నిందా ఇలా ప్ర‌శ్న‌ల‌డుగుతారు. పెద్ద వాళ్ల కాళ్ల‌కి దండం పెడ‌తారు. ఏమ‌డిగినా గెలిచిన త‌ర్వాత చేసేస్తామంటారు. ఐదేళ్లు క‌న‌ప‌డ‌రు.

నాయ‌కుడు బెంజి కారులో ఎందుకు తిరుగుతున్నాడు, తామింకా గంజి తాగుతూ ఎందుకు బ‌తుకుతున్నామో జ‌నానికి తెలియ‌దు. గొర్రెల సంత‌తి పెరుగుతూ వుంటేనే క‌బేళాలకి డిమాండ్‌.

సృష్టిలోని ప్రాణుల నుంచి నాయ‌కులు చాలా నేర్చుకుంటారు. క‌ప్ప‌లా పార్టీల్లోకి గెంతుతారు. చేరిన పార్టీని పొగుడ్తారు. వీడిన పార్టీని తిడ్తారు. పాములా ప్ర‌త్య‌ర్థులపై విషం చ‌ల్లుతారు. సోష‌ల్ మీడియా పాయిజ‌న్‌కి స‌ప్లై చాన‌ల్‌. కాల‌కూట విషాన్ని కూడా క్ష‌ణాల్లో ఎక్కించొచ్చు.

సీతాకోక చిలుక‌లా రంగుల రెక్క‌ల్ని ప్ర‌ద‌ర్శిస్తారు. అది మేక‌ప్ అని లోప‌లుండేది గొంగ‌ళి పురుగు అని జ‌నానికి తెలుసు. అయినా చ‌ప్ప‌ట్లు కొడ్తారు. కొట్ట‌క‌పోతే కొడ‌తార‌ని భ‌యం.

నాయ‌కులు ఎంత తెలివైన వాళ్లంటే ఎలుగుబంటికి హెయిర్ డై అమ్మ‌గ‌ల‌రు. గొర్రెకి తోలు ఒలిచి , దానికి కంబ‌లి క‌ప్ప‌గ‌ల‌రు. ప‌ట్టు పురుగుకే ప‌ట్టుచీర గిఫ్ట్ ఇవ్వ‌గ‌ల‌రు.

మ‌నం పీల్చే గాలి కూడా కాలుష్యంగా మారిన‌ప్పుడు రాజ‌కీయాలు శుభ్రంగా, ప‌రిశుద్ధంగా ఉండాల‌ని కోరుకోవ‌డం త‌ప్పు కాదా?

జీఆర్ మ‌హ‌ర్షి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?