Advertisement

Advertisement


Home > Politics - Opinion

పతనం అంచున రామోజీ

పతనం అంచున రామోజీ

ఈ జన్మలో మనం తప్పు చేస్తే వచ్చే జన్మలో దాని ఫలితాన్ని అనుభవిస్తామని కర్మ సిద్ధాంతం చెబుతుంటారు. 

మోతాదు మించిన కర్మ- మంచైనా, చెడైనా వచ్చే జన్మ వరకు ఆగదు. ఈ జన్మలోనే వాటి ఫలాలను అందించడం మొదలుపెట్టి రాబోయే జన్మకి కూడా కొనసాగిస్తుంది. ఇది కూడా కర్మసిద్ధాంతంలో చెప్పే ఒక క్లాజు. 

అసలు జీవితంలో కోర్టు మెట్లే ఎక్కని చంద్రబాబు నాయుడు ఏకంగా జైల్లో ఉన్నాడు. బైలు కూడా రావట్లేదు. 

ఎంతటి కేసైనా స్టేలు తెచ్చుకుని రాజకీయ జీవితమంతా గడిపేసాడు. తాను ఎన్.టి.ఆర్ కి అల్లుడు కావడం, నందమూరి వంశంలో తనకి పోటీ వచ్చే తెలివున్నవాళ్లు ఎవ్వరూ లేకపోవడం, నాలుగు దశాబ్దాలుగా తిప్పిన రాజకీయచక్రం..అంతా ఎప్పుడో మునుపటి జన్మలో చేసుకున్న పుణ్యం తప్ప ఈ జన్మలో చేసుకున్న పుణ్యం కానే కాదు.  ఆ పాత పుణ్యం కరిగిపోతే ఇక అనుభవించాలిసింది ఈ జన్మలో చేసుకున్న పాపమే. ఆ తరుణమే ఇప్పుడు నడుస్తోంది. 

ఇక రామోజీరావు విషయానికొద్దాం. చంద్రబాబుకంటే వయసులో 13 ఏళ్లు పెద్దవాడు. శాంతంగా జీవితాన్ని గడపాల్సిన వయసులో జీవితంలో ఎన్నడూ చూడని ఇబ్బందిని చూస్తున్నాడు. 

ఎందుకు? ఈయన గారు చేసిన పాపాలేవిటి? ఒక్కసారి చూద్దాం!

రామోజీరావుది వ్యాపారంలో గోల్డెన్ హ్యాండ్. పేపరైనా, పత్రికైనా, పచ్చడైనా, టీవీ అయినా, చిట్ ఫండైనా, స్టూడియో అయినా మరొకటైనా అన్నీ సక్సెస్సులే. కాసులు సంపాదించేవే. 

అలాగే అప్పట్లో రామారావుని, ఆ తర్వాత చంద్రబాబుని తన మీడియా శక్తితో అడ్డుపెట్టుకుని "ఇచ్చి పుచ్చుకునే" ధోరణితో కోట్లకి పడగలెత్తిన ఆసామి. 

మీడియా అంటే న్యూస్ పేపర్ ఒక్కటే అనే రోజుల్లో తన ఈనాడుతో ప్రజలతో మైండ్ గేం మొదలుపెట్టిన ఘనాపాటి. అందులో రాసేదే వర్తమానం, చెప్పిందే చరిత్ర, చూపేదే భవిష్యత్తు. 

అంతులేనంత సంపాదన, పదవి లేకపోయినా కింగ్ మేకర్ గా ఒక స్థానం సంపాదించుకున్నాక కూడా తనకి ఆశ చావలేదు. ఇంకా ఎదిగి, ఇంకా ఇంకా ఎదిగి..వేల ఎకరాల రామోజీ ఫిల్మ్ సిటీకి రాజయ్యాడు. 

అలాంటి ప్రభ దాదాపు మూడు దశాబ్దాల పాటు కొనసాగింది. కానీ ఆయనగారి పుణ్యం 2000-2005 మధ్యన ఖర్చైపోయింది. సరిగ్గా ఆ టైములో అప్పటి సంప్రదాయ మీడియాకి దీటుగా వెబ్సైట్లొచ్చాయి. ఈనాడుకి వ్యతిరేకంగా తమ గొంతు వినిపించడం మొదలుపెట్టాయి.

2006లో ఉండవల్లి అరుణ్ కుమార్ రూపంలో రామోజీరావుకి ఊహించని దెబ్బ తగిలింది. రామోజీ మీద నోరెత్తాలంటే ఎవ్వడికైనా ఎంత ధైర్యం ఉండాలి అనుకునే సమాజంలో ఉండవల్లి లేపిన లా-పాయింట్లు అన్రనీ నోరెళ్లబెట్టుకునేలా చేసాయి.

కొందరైతే "ఉండవల్లి పనైపోయింది..రాజశేఖర్ రెడ్డి అండ చూసుకుని రామోజీతో పెట్టుకున్నాడు అమాయకంగా"! అన్నారు. 

మార్గదర్శి వ్యాపారంలో ఉన్న లోపాలు, అక్రమాలు అన్నీ వెలుగులోకి తెచ్చిన ఉండవల్లి అరుణ్ కుమార్ నిజానికి అప్పుడొక ఎంపీ. ఆయన వెనుక ఉన్నది అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. 

కానీ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కూడా ఉండవల్లి తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా రామోజీ కానీ, ఆయన ప్లీడర్లు కానీ, కులవర్గం కానీ, ఇతరత్రా బలాలుకానీ ఉండవల్లిని ఆపలేకపోయాయి. ఎందుకంటే పాపపు కర్మ అనుభవించాల్సి వచ్చినప్పుడు ప్రత్యర్థి ఎంత చిన్నవాడైనా చాలా బలవంతుడిగా మారతాడు. ప్రకృతి, దైవం కూడా ప్రత్యర్థి వైపే ఉంటాయి తప్ప అనుభవిస్తున్నవాడి వైపు ఉండవు. 

అసలు తనపై దేశంలో ఎవరూ కేసులు పెట్టలేరు, కోర్టుకి లాగలేరు, పోలీసుల్ని పంపలేరు అనుకున్న రామోజీకి మొన్నామధ్యన ఏపీ సీయైడీ ఇంటికొచ్చి ప్రశ్నించేసరికి వేదాంతం పుట్టుకొచ్చింది. "ఇదంతా జగన్ మహిమ" అంటూ అంపశయ్యమీద పొడుకుని అన్నాడాయన. 

ఇక తాజాగా యూరి రెడ్డి కేసు. ఇది మరీ ఆశ్చర్యం. తనకు చెందాల్సిన మార్గదర్శి షేర్లు తననుంచి బలవంతంగా తుపాకి పెట్టి మరీ రామోజీ రాయించుకున్నాడని యూరి రెడ్డి అనే వ్యక్తి కేసు పెట్టాడు. 

వృధ్ధాప్యంలో రామోజీకి ఇంతకంటే అప్రతిష్ట ఉంటుందా? ఎంత బంగారంరంగు సింహాసనంలో కూర్చుంటే మాత్రం ఏమి ఉపయోగం? అంత్యకాలంలో ఇలాంటి క్రిమినల్ కేసులు ఎంత అపకీర్తి తెస్తాయి!! 

మార్గదర్శి కేసులో అభియోగమొస్తే మీడియా నోరు నొక్కుతున్నారంటూ అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం మీద తిరగబడేవాడు రామోజీ. 

అంటే ఏమిటి? ఆయన ఏ తప్పుడు పని చేసినా అది మీడియా మీద దాడే అని అతి తెలివి ప్రదర్శన చేసేవాడు. 

కాస్త గతంలోకి వెళ్తే చెన్నారెడ్డిని చందాలరెడ్డి అని తన ఈనాడుతో ప్రచారం చేసిన వ్యక్తి రామోజీ. అదే నిజమైతే చెన్నారెడ్డి వారసుల్లో ఎవరు వేల కోట్లకి పడగలెత్తి ఉన్నారిప్పుడు? ఎవ్వరూ లేరు. 

అలాగే కోట్ల విజయభాస్కర రెడ్డిని అవినీతిపరుడంటూ రాతలు రాసి భ్రష్టుపట్టించాడు. అదే నిజమైతే విజయభాస్కర రెడ్డి చివరి దశలో ఆసుపత్రి బిల్లులు కట్టుకోవడానికి సొంత ఇల్లు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది?

పి.జనార్దనరెడ్డిని చాలా చీప్ గా చిత్రీకరిస్తూ కబ్జాదారుడంటూ ఒక రౌడీలాంటి ప్రొజెక్షన్ ఇచ్చాడు ఈనాడు రాతల్లో. నిజంగా కబ్జాదారుడే అయితే జూబ్లీ హిల్స్ లో అన్ని ఎకరాల ప్రైం ల్యాండ్ లో పెద్దమ్మగుడి ఎందుకు కడతాడు? ఏ రియలెస్టేట్ వ్యాపారమో చేసుకునే వాడేగా!

పి.జనార్దన రెడ్డి పిల్లలు ఇప్పుడేమైనా కబ్జాలు చేసిన ఎకరాల ఎస్టేటుల్లో ఉంటున్నారా? చూపించమనండి! అసలు పి జనార్దనరెడ్డిని కబ్జాకోరుగా చిత్రీకరించడానికి కారణం అప్పట్లో అక్రమంగా కట్టిన ఐమ్యాక్స్ థియేటర్ మీద అతను పోరాడాడు కనుక. స్వకులంవారి ఆస్తుల మీదకొస్తే ఈనాడు ఊరుకోలేక జనార్దనరెడ్డిని భ్రష్టు పట్టించే పని చేసింది. 

అయితే మాత్రమే? ఆ పి.జనార్దనరెడ్డి పోయినప్పుడు తరలి వచ్చిన జనాన్ని, ఏడ్చిన హృదయాల్ని చూసి సొంత పార్టీలోనే ఆయన ప్రత్యర్థి అయిన వై.ఎస్.ఆర్ కూడా, "ఇంత గొప్ప నాయకుడినా మనం కోల్పోయింది!" అని నిట్టూర్చారు. 

పోయాక వెంట వచ్చే పుణ్యమంటే అది!! బతికున్నప్పుడు ఎంత పెద్ద ఇంట్లో, ఎంత పవర్ఫుల్ గా ఉంటున్నామన్నది కాదు. పోయాక ఎంతమందిని గుండెలు పిండేలా ఏడిపించగలిగామన్నదే పుణ్యమంటే. అదే స్వర్గాన్ని చేర్చేది. 

అసలు సిసలు కబ్జాదారుడు రామోజీరావు.

విశాఖపట్నంలో ఒక కుటుంబం తాలూకు ప్రోపెర్టీని ఆక్రమించి ఈనాడు ఆఫీసు పెట్టాడు. ఆ ప్రోపర్టీ కోసం ఆ కుటుంబం ఎన్నేళ్లు పోరాడినా లెక్కచేయకుండా తన పరపతి వాడి పీడించాడు. తర్వాత ఎన్నేళ్లకో వైఎస్సార్ హయాములో ఆ కుటుంబానికి విముక్తి లభించింది. 

ఇదిలా ఉంటే విజయవాడలో ఈనాడు ఆఫీసు రోడ్డుపైకి ఉంటుంది ఇప్పటికీ. అది కూడా కబ్జానే. కొట్టేస్తే మీడియా మీద దాడి అంటాడు. 

అదేంటో కానీ రామోజీరావు కేవలం ఒక వర్గానికి మాత్రమే మహానుభావుడు. మిగిలిన వాళ్లకి కాదు.

రామోజీరావు మీద కేసనగానే ఈ రోజు యూరీ రెడ్డి ప్రెస్మీట్ లో ఒకళ్లిద్దరు రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలు చూస్తే ఒకానొక వర్గానికి తప్ప తక్కిన వర్గాలన్నింటికీ నవ్వు తెప్పించేలా ఉన్నాయి. 

రామోజీ రావు తరపున వకాల్తా పుచ్చుకుని వాదించే లాయర్ల టైపులో "ఎప్పుడో 2016లో జరిగితే ఇప్పుడెందుకు కేస్ పెడుతున్నారు? ఇన్నాళ్లు ఏం చేసారు? ఉప్పుడే గుర్తొచ్చిందా?" అంటూ అడగడం హాస్యాస్పదం. ఎవరు ఎప్పుడైనా ఎవరి మీదైనా ధైర్యం తెచ్చుకున్నాక కేస్ పెట్టొచ్చు.

ఎప్పుడో పాతికేళ్ల క్రితం తనపై క్యాస్టింగ్ కౌచ్ కి పాల్పడ్డాడని కొందరు నటీమణులు హీరోల మీద, దర్శకుల మీద కేసులు పెట్టడం చూడలేదు!!? ఇదీ అలాంటిదే అనుకోవాలి. 

రామోజీని బహిరంగంగా వెనకేసుకొచ్చే అమాంబాపతు జర్నలిస్టుల వల్ల ఆ మీడియా మొగల్ మానసికంగా మరింత దూరవమవుతున్నాడు జనానికి. 

నేను తప్పు చెస్తాను..నాకే ఆ హక్కుంది..నేను శిక్షలకి అతీతుడిని...అనే టైపులో ఉంటుంది రామోజీ ధోరణి. 

అమిత్ షా వచ్చినా, నడ్డా వచ్చినా తన పేలెస్ లో తాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టైపులో కూర్చుని బిల్డప్ ఇవడం జనానికి చిరాకు తెప్పిస్తుంది తప్ప గౌరవాన్ని ఇనుమడింపజేయదు. అలాగని చేతులు కట్టుకుని ముడుచుకుపోనక్కర్లేదు. జాతీయస్థాయి నాయకుల్ని తనతో సమానమైన కుర్చీల్లో కూర్చోబెట్టాలి కానీ, తాను సువర్ణసింహాసనమెక్కి వాళ్లని పక్కన సోఫాలో కూర్చోబెట్టి, "చూసారా! ఇది నా లెవెల్" అన్నట్టుగా ఆ ఫోటోల్ని బయటికి వదలడం వల్ల జనానికి కామెడీతో కూడిన చికాకు తప్ప ఏమొస్తుంది?

రామోజీ మీద ఎవరో యూరిరెడ్డి కేస్ పెడితే అసలు సానుభూతి చూపించే జనమే లేరు. పైగా తాము నమ్మే కర్మసిద్ధాంతం కోసమైనా అరెష్టైతే చూద్దామనుకునే సోషల్ మీడియా జనమే అధికశాతంలో ఉండడం రామోజీ పతనం అంచుకు చేరిపోయాడనడానికి, ఆయన కర్మ పండి దుర్దినాలు అనుభవిస్తున్నాడని నిదర్శనం. 

హరగోపాల్ సూరపనేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?